హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): ఎస్సీ గురుకుల సొసైటీ పనితీరు ఏమాత్రం మారలేదు. ప్రభుత్వ మార్గదర్శకాలు ఒకటైతే, సొసైటీలో మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించడం మరొకటి. ప్రభుత్వం బదిలీలకు అవకాశం కల్పిస్తే, ఆ ప్రక్రియను కుంటిసాకులతో పక్కనబెట్టి ఉన్నపళంగా ఉద్యోగోన్నతుల ప్రక్రియ తెరపైకి తీసుకొచ్చింది. ప్రమోషన్లు అయినా పద్ధతి ప్రకారం చేస్తున్నారా? అంటే అదీ లేదు. ఎక్కువ, తక్కువ స్థాయి పోస్టులను పక్కనబెట్టి కేవలం గ్రేడ్-2 ప్రిన్సిపాళ్లకు మాత్రమే ప్రమోషన్లు కల్పించడం చర్చనీయాంశంగా మారింది. అందులో మతలబేంటో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికే పలు సమస్యలపై అమాత్యుడికి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు వినతలు ఇవ్వడం, ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించినా అవి బుట్టదాఖలవుతున్నాయంటే ప్రభుత్వ పనితీరు ఎలా ఉన్నదో అర్థమవుతున్నది.
ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకు ఆదివారం వరకు గడువు ఇచ్చింది. ఒకే స్టేషన్లో మూడేండ్ల సర్వీస్ పూర్తిచేసుకున్న వారికి బదిలీకి అవకాశమివ్వగా, నాలుగేండ్ల సర్వీసును పూర్తిచేసుకున్న ఉద్యోగులకు తప్పనిసరిగా బదిలీ చేయాలని ప్రభుత్వం తేల్చిచెప్పింది. మొత్తం బదిలీలు 40 శాతం వరకు మించకూడదని, అదేవిధంగా సెన్సస్ డ్యూటీలో ఉన్న ఉద్యోగులను 2027 మార్చి30 వరకు ఎక్కడికి బదిలీ చేయవద్దని షరతు విధించింది. కానీ, ఎస్సీ గురుకుల సొసైటీ ఉన్నతాధికారులు బదిలీల ప్రక్రియ చేపట్టలేదు. ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు సొసైటీలో దాదాపు 30 శాతం మంది ఉద్యోగులు బదిలీల జాబితాలో ఉన్నారు. వారికి బదిలీ చేసే అవకాశమున్నా సొసైటీ ఆ ప్రక్రియను పక్కకుపెట్టింది. అదేమంటే 40 శాతం లేరని సాకుగా చూపింది. దీంతో సొసైటీ తీరుపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.
ఆదేశాలకే మంత్రి పరిమితం
ఇదిలా ఉండగా ఎస్సీ గురుకుల సొసైటీ చైర్మన్‌గా ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ వ్యవహరిస్తున్నారు. ఆయన బాధ్యతలను స్వీకరించి దాదాపు ఏడాది కావస్తున్నా ఇప్పటికీ పట్టు సాధించలేకపోయారనే అపవాదును మూటగట్టుకున్నారు. సొసైటీలో గందరగోళ పరిస్థితులు, ఉన్నతాధికారుల ఒంటెద్దు పోకడలపై, సర్కార్‌ను అప్రతిష్టపాల్జేస్తున్న వైనంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఎన్నోసార్లు మంత్రికి వినతిపత్రాలు అందజేశాయి. కానీ, అమాత్యుడు మాత్రం రెగ్యులర్ కార్యదర్శి లేరనే సాకుతో సమస్యలను దాటవేస్తున్నారని తెలుస్తున్నది. డిప్యుటేషన్ల రద్దు మినహా, ఏ ఒక్క సమస్యను పరిష్కరించిన దాఖలాలు లేవు. ఇదిలా ఉంటే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు అమాత్యుడిని కలిసి విన్నవించుకోవడం, ఆయన తగు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించడం వరకే పరిమితమవుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
బదిలీలను అటకెక్కించిన సొసైటీ ఉన్నతాధికారులు తాజాగా ప్రమోషన్ల ప్రక్రియను చేపట్టారు. ఎస్సీ గురుకుల సొసైటీలో 23 మంది గ్రేడ్-2 ప్రిన్సిపాళ్లకు గ్రేడ్-1 ప్రిన్సిపాళ్లుగా ప్రమోషన్ కల్పిస్తూ సొసైటీ ఇన్చార్జి సెక్రటరీ శనివారం సాయంత్రం ఆగమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమోషన్ పొందిన ప్రిన్సిపాళ్లకు జూన్ 5న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉన్నా, ఈ ప్రమోషన్ల ప్రక్రియను క్రమానుగతంగా చేపట్టకపోవడం చర్చనీయాంశంగా మారింది. సొసైటీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్ సెక్రటరీ 2 (ఏడీ), జాయింట్ సెక్రటరీ (జేఎస్) 5, డిప్యూటీ సెక్రటరీ 6(డీఎస్), అసిస్టెంట్ సెక్రటరీ 5 పోస్టులు ఉన్నాయి.
అవిగాకుండా మల్టీ జోన్-1, మల్టీజోన్-2, జోనల్ ఆఫీసర్లు, 150 ప్రిన్సిపాళ్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2017 సొసైటీ స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్‌కు సంబంధించి పోస్టుల్లో కొన్నింటిని ఆయా విభాగాల్లో సీనియారిటీ ప్రకారం ప్రమోషన్ల ద్వారా, మరికొన్నింటినీ డిప్యుటేషన్‌పై భర్తీ చేశారు. సొసైటీలో అకాడమిక్‌కు సంబంధించి ప్రత్యేకంగా జేఎస్ (జాయింట్ సెక్రటరీ), డీఎస్ (డిప్యూటీ సెక్రటరీ)లు ఖాళీగా ఉన్నాయి. మల్టీజోన్ 2, జోనల్ 1, 2, 6, 7 ఆఫీసర్ల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఎగువ, దిగువ పోస్టుల భర్తీని పక్కనబెట్టి కేవలం గ్రేడ్-2 ప్రిన్సిపాళ్లకు మాత్రమే ప్రమోషన్లు కల్పిస్తూ రాత్రికి రాత్రి ఉత్తర్వులివ్వడం గమనార్హం.