కాలచక్రం ఎప్పుడూ ఒకేలా ఉండదు. చరిత్ర పుటలు తిరగేస్తే ఒకనాటి అద్భుత దృశ్యం కనిపిస్తుంది. ప్రాచీన కాలంలో భారతదేశం ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయలా ఉండేది. క్రీస్తు పూర్వం ఒకటవ సహస్రాబ్దిలోనే మన పశ్చిమ తీరాల నుంచి నౌకలు పశ్చియాసియా వైపు పయనించేవి. సింధు లోయ నాగరికత విరాజిల్లుతున్న సమయంలోనే లోథాల్ వంటి ఓడరేవులు మెసొపొటేమియా, ఈజిప్టుతో నిరంతర సంబంధాలు నెరిపేవి.
బాబిలోనియన్లు తమ కట్టడాల కోసం భారతీయ టేకును వినియోగించేవారంటే మన ఎగుమతుల స్థాయి ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. రోమన్ సామ్రాజ్యపు సంపద మన సుగంధద్రవ్యాల కోసం, మస్లిన్ వస్ర్తాల కోసం భారత్‌కు ప్రవహించేది. 18వ శతాబ్దం వరకు ప్రపంచ తయారీ రంగంలో మనమే అగ్రగామి. చోళులు సముద్రాలను శాసించారు. శాతవాహనులు రోమ్ దాకా వ్యాపారం విస్తరించారు. అదొక స్వర్ణయుగం. ఆ వైభవం మళ్లీ పునరావృతమయ్యే చారిత్రక సందర్భం ఇప్పుడు మన కండ్ల ముందు సాక్షాత్కరిస్తున్నది.
ప్రస్తుతం ప్రపంచం ఒక వింతైన సంక్షోభంలో ఉన్నది. మధ్యప్రాచ్యంలో రగులుతున్న టెక్ యుద్ధం దీనికి నిదర్శనం. ఏప్రిల్ 1న బహ్రెయిన్‌లోని ‘బాటెల్కో’ టెలికాం సంస్థపై జరిగిన దాడులు కేవలం ఒక క్షిపణి సామాన్యమైనవి కావు. అవి గ్లోబల్ టెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై జరిగిన దాడులు.
అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) వంటి దిగ్గజాలు తమ కస్టమర్లను డాటా తరలించుకోమని హెచ్చరించడం ఒక తీవ్రమైన పరిణామం. ఆపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి 18 దిగ్గజ కంపెనీలను ఇరాన్ లక్ష్యంగా ప్రకటించడం ప్రపంచ పెట్టుబడిదారుల్లో గుబులు రేపుతున్నది. గత ఐదేండ్లుగా గల్ఫ్ దేశాలను టెక్ హబ్‌లుగా మార్చడానికి ఖర్చు చేసిన బిలియన్ల డాలర్లు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. ఈ అస్థిరత ప్రపంచ టెక్ మ్యాప్‌ను మార్చేస్తున్నది.
పెట్టుబడికి ప్రాణం భద్రత. ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడికే సంపద చేరుతుంది. మధ్యప్రాచ్యం అస్థిరంగా మారిన వేళ.. ప్రపంచమంతా భారత్ వైపు చూస్తున్నది. భారతదేశం ఇప్పుడు ఒక ‘టెక్ సేఫ్ జోన్’ (Tech Safe Zone)గా అవతరించింది. మన దేశంలో ఉన్న సైబర్ భద్రత చట్టాలు, డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ యాక్ట్ వంటివి అంతర్జాతీయ కంపెనీలకు ఒక బలమైన భరోసాను ఇస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూర్ వంటి నగరాలు కేవలం ఐటీ సెంటర్లు మాత్రమే కాదు, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన సురక్షిత దుర్గాలు. యుద్ధ మేఘాలు లేని ఆకాశం, స్థిరమైన ప్రభుత్వం మన దేశానికి అదనపు బలాన్ని ఇస్తున్నాయి.
భారతదేశ భౌగోళిక స్థానం మనకు దేవుడిచ్చిన వరం. హిందూ మహాసముద్రం మధ్యలో ఉండటం వల్ల ప్రపంచ వాణిజ్య మార్గాలపై మనకు సహజసిద్ధమైన పట్టు లభిస్తున్నది. సుమారు 7,516 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతం మనల్ని ఆసియా, ఆఫ్రికా, ఐరోపా దేశాలకు వారధిగా నిలబెట్టింది. ఉత్తరాన హిమాలయాలు మనకు రక్షణ కవచంలా ఉన్నాయి. చైనా దూకుడును అడ్డుకోవడంలో భారత్ ఇప్పుడు ఒక ‘నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్’గా మారింది. ఈ భౌగోళిక రాజకీయ ప్రాధాన్యత వల్లే అగ్రరాజ్యాలు మనతో జట్టు కట్టడానికి పోటీ పడుతున్నాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ పాత్ర ఇప్పుడు అనివార్యం.
ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న మరో నినాదం ‘చైనా ప్లస్ వన్’ (China Plus One). గతంలో ప్రపంచమంతా చైనాపైనే ఆధారపడింది. కానీ వాణిజ్య యుద్ధాలు, కొవిడ్ సమయంలో వచ్చిన సరఫరా గొలుసుల అంతరాయం ప్రపంచం కండ్లు తెరిపించాయి. ఒకే దేశంపై ఆధారపడటం ఎంతటి ఆత్మహత్యాసదృశమో కంపెనీలు గుర్తించాయి. ఈ ప్రత్యామ్నాయ వ్యూహంలో భారత్ మొదటి వరుసలో ఉన్నది. ఆపిల్, శామ్సంగ్ వంటి సంస్థలు తమ తయారీ కేంద్రాలను చైనా నుంచి భారత్‌కు తరలిస్తున్నాయి. ఇది మన పారిశ్రామిక భవిష్యత్తును మార్చబోయే మహా విప్లవం. మన దేశంలో జరుగుతున్న డిజిటల్ మార్పులు అమోఘం. ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ లావాదేవీలు జరుగుతున్న దేశం మనది. సెమీకండక్టర్ల తయారీలో మనం వేస్తున్న అడుగులు భవిష్యత్తులో మనల్ని గ్లోబల్ లీడర్‌గా నిలబెడతాయి. ఇదంతా ఒక క్రమపద్ధతిలో జరుగుతున్న నిర్మాణం.
ఈ దశాబ్దం (2020-2030) భారతదేశానిది. అమెరికా-చైనా మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు మనకు ఒక సువర్ణావకాశం. భవిష్యత్తులో భారత్ కేవలం ఒక మార్కెట్‌గానే కాకుండా, ప్రపంచానికి కావాల్సిన ఉత్పత్తులను అందించే కర్మాగారంగా మారుతుంది.
చివరగా ఒక మాట. అవకాశం ఎప్పుడూ తలుపు తట్టదు, అది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇప్పుడు ప్రపంచంలో నెలకొన్న అశాంతి, అనిశ్చితి మన దేశానికి ఒక మారువేషంలో వచ్చిన అదృష్టం. గతాన్ని గర్వంగా చెప్పుకోవడమే కాదు, భవిష్యత్తును మనమే నిర్మించుకోవాలి. మన విధానాలు, దౌత్య సంబంధాలు మరింత పటిష్టం కావాలి. పేదరికాన్ని రూపుమాపడానికి, నిరుద్యోగ రక్కసిని తరిమికొట్టడానికి ఇదే సరైన సమయం. ఇది మనకు లభించిన ‘ఇప్పుడే.. లేదా ఎప్పటికీ కాదు‘ అనే కీలకమైన సందర్భం. ఈ అవకాశాన్ని ఒడిసి పట్టుకుంటే, భారతదేశం మళ్లీ ప్రపంచ వేదికపై అగ్రపీఠాన్ని అలంకరించడం ఖాయం.
– (వ్యాసకర్త: సీ అండ్ డీ టెక్నాలజీ కన్సల్టెంట్)
– డా. చంద్రశేఖర్ నంబూరి 9393990399