వేములవాడలోని సుభాష్‌నగర్‌కు చెందిన వృద్ధురాలు చింతల్‌ఠాణ మల్లవ్వ ఆదివారం ఇంట్లో జారిపడడంతో కాలు విరిగింది. వెంటనే కుటుంబ సభ్యులు వేములవాడ ఏరియా దవాఖానకు తీసుకెళ్లారు. సంబంధిత సేవలు అందుబాటులో లేవని చెప్పడంతో సిరిసిల్ల ప్రభుత్వ దవాఖానకు తీసుకొచ్చారు. మల్లవ్వను పరీక్షించిన వైద్యులు రాడ్ వేయాలని సూచించారు. కానీ, సంబంధిత వైద్య పరికరాలు రిపేర్‌లో ఉన్నాయని, సర్జరీ చేయడం కుదరదని తేల్చి చెప్పారు. దాంతో దిక్కుతోచని స్థితిలో కుటుంబ సభ్యులు అదేరోజు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు.
సిరిసిల్ల టౌన్, జూన్ 9 : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్కారు వైద్యం మెరుగుపడింది. అప్పటి మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలో సిరిసిల్ల జిల్లా దవాఖాన వైద్య సేవల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందింది. ప్రభుత్వం మారిన తర్వాత ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. ఇటీవల స్కానింగ్ సేవలు నిలిచి పోవడంతో గర్భిణులు, సంబంధిత రోగులు అవస్థలు పడిన విషయం తెలిసిందే కాగా, ప్రస్తుతం అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.
ఆపరేషన్ థియేటర్లో అర్థోపెడిక్ విభాగానికి సంబంధించిన హైడ్రాలిక్ టేబుల్ మరమ్మతుకు గురికావడంతో రెండు రోజులుగా తుంటి ఎముకకు సంబంధించిన సర్జరీలు నిలిచిపోయాయి. సదరు ఆపరేషన్ కోసం ప్రైవేట్‌కు వెళ్లాలంటే లక్షల్లో బిల్లులు చెల్లించాల్సి వస్తుండగా, పేద, మధ్యతరగతి వర్గాల పేషెంట్లు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్‌కు వెళ్లే స్థోమత లేక దవాఖానలోనే అవస్థలు పడుతున్నారు. చేసేందేమీ లేక కొందరు తిరిగి ఇళ్లకు తీసుకెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో వేములవాడ ఏరియా దవాఖానలో ఉన్న హైడ్రాలిక్ టేబుల్‌ను సిరిసిల్ల దవాఖానకు తరలిస్తే సర్జరీలు చేసే అవకాశాలు ఉన్నాయని, ఈ దిశగా సంబంధిత అధికారులు చొరవ తీసుకోవాలని సిబ్బంది చెబుతున్నారు.
వేములవాడ మండలం నాగయ్యపల్లెకు చెందిన వృద్ధుడు కొండాపురం మల్లయ్య సోమవారం మంచంపై నుంచి పడడంతో కాలు ఫ్యాక్చర్ అయింది. కుటుంబ సభ్యులు వెంటనే సిరిసిల్ల ప్రభుత్వ ప్రధాన దవాఖానకు తీసుకొచ్చారు. మల్లయ్యను పరీక్షించిన వైద్యులు, సీటీ స్కానింగ్, ఎక్స్‌రే, తదితర పరీక్షలు చేశారు. అనంతరం కాలుకు రాడ్ వేయాలని సూచించారు. కుటుంబ సభ్యులు అంగీకరించిన తర్వాత కొద్దిసేపటికి ఆపరేషన్ మరుసటి రోజు చేస్తామని చెప్పారు.
ఆపరేషన్ చేయాలని మంగళవారం కుటుంబసభ్యులు కోరడంతో ఆపరేషన్ థియేటర్లో పరికరాలు రిపేర్‌లో ఉన్నాయని పది రోజులు పడుతుందని సమాధానం చెప్పారు. దీంతో కంగుతిన్న కుటుంబసభ్యులు వైద్యుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఏం చేయాలో తెలియక మల్లయ్యను దవాఖానలోనే ఉంచారు. పెద్ద దవాఖానలోనే సేవలు అందలేని పరిస్థితి ఉంటే ఎలా వాపోతున్నారు. ప్రైవేట్‌కు వెళ్లే స్థోమత లేక ప్రభుత్వ దవాఖానకు వస్తే ఇక్కడ దుస్థితి ఇలా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.