హాలియా, జూన్ 9: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్ర భుత్వం పేదల సంక్షేమాన్ని గాలికి వదిలేసింది. అర్హులైన పేదలకు ఇండ్లు ఇచ్చేందుకు ఆ పార్టీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం తెస్తే, ఆ పథకం క్షేత్రస్థాయిలోని కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబులు నింపుకునేందుకే ఉపయోపడుతోంది. పట్టణాలు మొదలు పల్లెల దాక ఇంది రమ్మ ఇండ్ల మంజూరులో అర్హులను పక్కకు పెట్టి కాంగ్రెస్ పార్టీకి జై కొట్టిన వారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తూ అర్హులైన పేదలకు మొండిచెయ్యి చూపుతున్నారు. అర్హుల ఎంపికలో అధికార పార్టీ నేతలు వివక్ష చూపుతున్నారు. అధికారులు సైతం అర్హులను పక్కకు పెట్టి స్థానిక నాయకులు సూచిస్తున్న పేర్లనే ఫైనల్ చేస్తున్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి జై కొట్టిన వారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నా రే తప్ప నిజమైన పేదలకు, అర్హులకు సంక్షేమ పథకాలు దక్కడం లేదు. లబ్ధిదారుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు, విమర్శలు నియోజకవర్గంలో గుప్పుమంటున్నాయి.
అర్హులకు ఏవీ..
హాలియా వీరయ్యనగర్ పరిధిలోని ఓ వీధి లో రాపోలు లీలావతి (50) అనే ఒంటరి మహిళ గత 20 ఏండ్లకు పైగా నివాసం ఉం టోంది. పదేళ్ల క్రితం భర్త రాపోలు మట్టయ్య చనిపోయాడు. గుంటెడు వ్యవసాయ భూమిలేదు. రెక్కాడితేనే డొక్క నిండుతుంది. తనకు వచ్చిన కుట్టు మిషన్ పనితో జీవనం సాగిస్తున్నది. చీర,జాకెట్లు కుట్టుగా వచ్చిన దాంట్లే కలోగంజో తాగుతూ జీవనం సాగిస్తున్నది. ఆమెకు ఒక కుమార్తె ఉన్నది. తనకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలంటూ ఆమె ప్రభుత్వ కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా మొదటి దశలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదు. మొదటి దశలో అన్ని ఇండ్లను హాలియాలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇచ్చారు.
రెండో దశలోనైనా అర్హులైన పేదలకు ఇండ్లు ఇస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతులు తడిపిన వారికే ఇందిరమ్మ ఇండ్లు వస్తాయంటూ జోరుగా స్థానికులు చర్చించుకుంటున్నారు. పదేళ్ల క్రితం రాపోలు మట్టయ్య లీలావతి ఓ అద్దె ఇంట్లో ఉంటేవారు. అనారోగ్యంతో చికిత్సపొందుతున్న మట్టయ్య మృతి చెందడంతో శవాన్ని ఇంట్లోకి తేవద్దని నాడు ఇంటి యజమాని చెప్పడంతో గత్యంతరం లేక లీలావతి పెద్దవూర మండలం పులిచర్ల గ్రామంలోని తన భర్త బంధువుల ఇండ్ల వద్ద దహన సంస్కారాలు చేయించింది. నాటి నుంచి హాలియాలో ఇల్లు నిర్మించుకోవాలన్న ఆమె కల కలగానే మిగిలింది.
స్థానిక నాయకుల చేతివాటం..
ఇందిరమ్మ ఇండ్ల మంజూరీలో అధికార పార్టీ నాయకులు అక్కడక్కడా చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.ఐదు లక్షలు ఇస్తోంది. సొంత పార్టీ కార్యకర్త అయినా ఎంతో కొంత తమ పార్టీ నాయకులకు సమర్పించుకోవాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తే నాకేం ది.. అంటూ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.ఐదు లక్షలు ఇస్తుండటంతో తనకు వచ్చిన బిల్లులో రూ.50 వేలు తమవి కావనుకుంటే సరిపోతుందనే ఉద్దేశంతో లబ్ధిదారులు.. ఇం డ్లు మంజూరు చేయిస్తే తమ వంతు వాటా ఇస్తామని నాయకులకు చెబుతుండటంతో అనుకూలమైన వారికే ఇండ్లు మంజూరు చేయిస్తున్నారు.
బిల్లులు రాక ఇబ్బందులు..
ఇందిరమ్మ బిల్లులు సక్రమంగా అందడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. లబ్దిదారులకు నాలుగు దశల్లో బిల్లులు చెల్లిస్తారు. మొద టి దశలో లక్ష, రెండోదశలో లక్ష, స్లాబ్ పూర్తయిన తరువాత రూ.లక్షా 40 వేలు, ఇండ్లు పూర్తయిన తరువాత మిగిలిన మొత్తం లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం చెబుతున్నది. కానీ వాస్తవానికి ఇండ్ల బిల్లులు సక్రమంగా లబ్ధిదారులు ఖాతాలో జమ చేయ డం లేదని లబ్ధిదారులు వాపొతున్నారు.
నత్తడనక నిర్మాణ పనులు..
హాలియాలో మొదటి దశలో 155 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారు. లబ్ధిదారులు మొద టి విడత ఇండ్ల నిర్మాణం చేపట్టినప్పటికీ బిల్లుల చెల్లింపులో ఆలస్యం కావడంతో ఇండ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మున్సిపాలిటీలో మొత్తం 155 మంది లబ్ధిదారుల్లో ఇప్పటి వరకు 40 ఇండ్లు మాత్రమే నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. మిగిలిన 110 మంది ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయి. నిర్మా ణం కోసం ప్రభుత్వం ఇస్తున్న డబ్బు దేనికీ సరిపోవడం లేదని, బిల్లును 7.5 లక్షలకు పెంచాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు.
వార్డుకు 15 ఇండ్ల లెక్క పంచుకుంటున్న నేతలు..
హాలియా మున్సిపాలిటీకి గతంలో మొదటి దశలో సుమారు 150 ఇండ్లు మంజూరు చేయగా కాంగ్రెస్ పార్టీ నేతలు వార్డుల వారీగా పంచుకున్నారు. ఒక వార్డు సభ్యుడు మరో వార్డులో జోక్యం చేసుకునే వీలు లేకపోవడంతో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పదిహేను ఇండ్లను తనకు నచ్చిన వారికి, తమ పార్టీ కార్యకర్తలకు, చేతులు తడిపిన వారికి ఇవ్వడంతో నిజమైన నిరుపేదలకు అన్యాయం జరుగుతున్నది రెండోదశలో కూడా మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో ఒక్కో వార్డుకు 15 ఇండ్ల చొప్పున కాంగ్రెస్ కౌన్సిలర్లు ఇండ్లు పంచుకొని లబ్ధిదారులను ఎంపిక చేశారు.
అర్హులకు మొండిచెయ్యి..
మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు లో అవకతవకలు జరుగుతున్నాయి. అర్హుల ను కాదని అనర్హులకు ఇండ్లు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, చేతులు తడిపిన వారికి ఇండ్లు మంజూరు చేశారే తప్ప నిజమైన లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు చేయలేదు. ఆ పార్టీకి ఓటేసిన పాపానికి మాకు కష్టాలు తప్పడం లేదు.
– పిల్లి వెంకట్, హాలియా