ఆదిలాబాద్ ప్రజలు ఎన్నడూ చూడని ఒక విపత్కర పరిస్థితిలో చిక్కుకున్నారు. వారికే తెలియని ఈ ఘోర మానవ హనన కార్యక్రమంలో బలి అవుతున్నారు. అయితే, ఈ విధ్వంసానికి ఇక్కడి ప్రజల ప్రతిస్పందన లేకపోవడం విచారకరం. బాలగోపాల్ అన్నట్లు ఆదిలాబాద్ ప్రజల జీవన విధానం నెమ్మదైనది. నిజంగా ఇంత నెమ్మదా? తమ ఉనికికే ప్రమాదం వాటిల్లుతుంటే, కనీసం నిరసన ప్రకటించని మంచితనం ఏమిటి? ఆదిలాబాద్‌లో ఇండస్ట్ట్రియల్ పార్క్, విమానాశ్రయాల పేరుతో ప్రజలు పెద్ద ఎత్తున నిర్వాసితులు కానున్నారు. గతంలో ఆదివాసీలు వలసలు, ఆధునిక అభివృద్ధికి దూరంగా జరుగుతూ దట్టమైన అడవుల్లోకి వెళ్లిపోయారు. కానీ నేడు అడవి, భూములు రెండూ లేవు. ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. ప్రస్తుతం అభివృద్ధి పేరిట జరిగే అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడకపోతే ఇటు మైదాన ప్రాంత ప్రజలు, అటు
ఆదివాసీలకు మనుగడ ఉండదు.
కొరాట-చనాక ప్రాజెక్టు పూర్తయ్యే సందర్భంలో, ఆ ప్రాజెక్టు కింద ఉన్న భూములను ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో ప్రభుత్వం ఆక్రమించుకుంటున్నది. ఈ ప్రాజెక్టు కింద ఉన్న భూములు చాలావరకు బినామీల పేరు మీద రిజిష్టర్ అయ్యాయి. చాలా ఊర్లలో బినామీల జాతర నడుస్తున్నది. పెద్దఎత్తున సాగు భూములకు మంగళం పాడుతుంటే..వేల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు ఎందుకోసం? ఇప్పటికే రైతులకు నామమాత్రంగా చెల్లింపులు చేసి 3000 ఎకరాల భూములను బడాబాబులు సొంతం చేసుకున్నారు.
జనసాంద్రత ఎక్కువగా లేని ఆదిలాబాద్‌కు మొదట 300 ఎకరాల్లో పౌర విమానాశ్రయం నిర్మిస్తామని పాలకులు చెప్పారు. అవసరం లేకున్నా ప్రజలు ఓర్పుతో అంగీకరించారు. నిర్మాణ వ్యయం రీత్యా కేంద్ర ప్రభుత్వం మారుమూల ప్రాంతమైన ఆదిలాబాద్‌లో విమానాశ్రయం నిర్మించటం వల్ల పెద్దగా ఒనగూరే ప్రయోజనం లేదనుకున్నది. అందుకే ఎన్నో ఏండ్లపాటు దీనికి ఆమోదం తెలుపలేదు. దీని వ్యయాన్ని భరించలేక రక్షణశాఖ, పౌరవిమానయానశాఖ సంయుక్తంగా నిర్మిస్తాయని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. తాజాగా 300 ఎకరాలకు బదులుగా 2,000 ఎకరాలతో రక్షణశాఖ వారి కోసం విమానాశ్రయం, టౌన్‌షిప్‌లు నిర్మిస్తామని అంటున్నారు. దీంతో ఒక్కసారిగా విమానాశ్రయం ప్రణాళిక మారిపోయింది. ఎన్నో ఏండ్లుగా సీసీఐ (సిమెంట్ పరిశ్రమ)ను పునరుద్ధరిస్తామని ప్రగల్భాలు పలికిన నాయకులు ఆ భూములకు ఇప్పుడు ఎసరు పెట్టారు.
ఆదిలాబాద్ ప్రజల చిరకాల వాంఛ-మూతపడిన సీసీఐని పునః ప్రారంభించాలని, మళ్లీ తెరిపించడానికి వివిధ సందర్భాల్లో వారు ఎన్నో పోరాటాలు చేశారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నదని ప్రజాప్రతినిధులు గత దశాబ్దకాలంగా ఊరిస్తూ వచ్చారు. ఎప్పటికైనా సిమెంట్ పరిశ్రమ తెరుస్తరని, తమ బిడ్డలకు కొలువులు వస్తయనే ఆశతో ప్రజలుంటే.. తేరగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న 1,700 ఎకరాల సీసీఐ భూములను రక్షణరంగ శాఖకు బదిలీ చేసే పెద్ద కుట్రను తెరపైకి తీసుకువచ్చారు.
ఉత్పత్తి రంగానికి పెద్దపీట వేయవలసిన ప్రభుత్వం, సీసీఐని శాశ్వతంగా ప్రజల మనోఫలకాల నుంచి తుడిచివేసే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. ఇటు ఎయిర్‌ఫోర్స్ అథారిటీ అధికారులతో సర్వే చేయిస్తూ, అటు సీసీఐ యంత్ర సామగ్రిని తుక్కుగా మార్చి అమ్మేస్తున్నారు. ఆదిలాబాద్ ప్రజలు సీసీఐని ‘ఆదిలాబాద్ షాన్’గా చూశారు. సీసీఐ భూముల జోలికి ఎప్పుడూ పోలేదు. ఒకప్పుడు నామమాత్ర పరిహారంతో సీసీఐకి భూములిచ్చిన రైతులు ఆర్థికంగా ఎంతో నష్టపోయారు.
సీసీఐ పరిశ్రమ కోసం బంగారం పండే భూముల్ని ఆనాడు ఇచ్చిన రైతులు సీసీఐ అభివృద్ధి కోసం ఎంతో త్యాగం చేశారు. కానీ వారి త్యాగానికి విలువ లేకుండా పోయింది. సీసీఐని పునరుద్ధరించలేని పక్షంలో కేంద్ర ప్రభుత్వం ఆ భూములను రైతులకు తిరిగి అప్పజెప్పాలి. సిమెంట్ పరిశ్రమను ఏర్పాటు చేయటం లేదని అధికారికంగా ప్రకటించాలి. సర్వం కోల్పోయిన రైతులు, వారి బిడ్డలు ఈ భూములను సాగుచేసుకునే అవకాశం లభిస్తుంది. గతంలో సుప్రీంకోర్టు బెంగాల్‌లోని సింగూరులో పరిశ్రమ ఏర్పాటు చేయకపోతే రైతులకు ఆ భూములు తిరిగి అప్పజెప్పాలని పేర్కొన్నది. ఇది సహజ న్యాయం. రక్షణశాఖ 1,700 ఎకరాల భూములను తీసుకొని ఆదిలాబాద్‌కు విధ్వంస రచన చేస్తున్నది. అందులో ‘20 వేల కోట్ల లీటర్ల రీఫిల్లింగ్ స్టేషన్’ కడతామని అంటున్నారు. దీనివల్ల ఏ చిన్న ప్రమాదం జరిగినా ఆదిలాబాద్ పట్టణం భస్మీపటలం అవుతుంది. తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ర్టాలు ఈ నిర్మాణాన్ని అడ్డుకున్నాయి. ఎయిర్పోర్ట్ అయితే ఇక్కడ ప్రయాణించే నాథుడే ఉండడు కాబట్టి ఈ రీఫిల్లింగ్ స్టేషన్‌కు కాపలా కాయడానికి రక్షణశాఖ అవసరం ఏర్పడింది.
అవసరం లేని ఎయిర్పోర్ట్ పేరుతో రక్షణశాఖ ఆడుతున్న వింత నాటకం. ఇలాంటి రక్షణ ప్యూహాలను బంజరు భూములు, జనావాసాలు లేని ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోవాలి. ఆదిలాబాద్ పట్టణం, వివిధ గ్రామాలకు మధ్యన ఇటువంటి నిర్మాణాలు చేపట్టడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమే అవుతుంది.
ఇలాంటి ప్రాజెక్టు కోసం పచ్చని అడవి, పంట పొలాలతో అలరారుతున్న ఆదిలాబాద్, పరిసర ప్రాంతాలను ఎంచుకోవటం సరికాదు. ఇది తీవ్ర పర్యావరణ సంక్షోభానికి దారితీస్తుంది. వరంగల్ జిల్లా మామునూరు విమానాశ్రయానికి 300 ఎకరాలు సరిపోతున్నపుడు, ఆదిలాబాద్‌ను ఎందుకు విధ్వంసం చేస్తున్నట్టు? ఇక్కడి ప్రజలు రైతులు, అమాయకులు, వారికేం తెలియదు, ఏమి చేసినా సహిస్తారని ఈ దారుణానికి ఒడిగట్టారా? ఎయిర్పోర్ట్, రీఫిల్లింగ్ ఫ్యూయల్ స్టేషన్ల వల్ల ప్రజలు వివిధ ఆంక్షలతో ఎన్నో అవస్థలు పడాల్సి ఉంటుంది. పని దొరకదు, జీవన వ్యయాలు విపరీతంగా పెరుగుతాయి. వివిధ వనరులు అడవులు కలిగి, పుష్కలంగా పంటలు పండే ఆదిలాబాద్ జిల్లాను ఇంకా ఏవిధంగా అభివృద్ధి చేయవచ్చో పాలకులు ఆలోచించాలి. అభివృద్ధి సంగతి ఏమోగానీ, కనీసం నాశనం చేయకపోతే అదే మహాభాగ్యం అనిపిస్తున్నది.
– (వ్యాసకర్త: ఆదిలాబాద్ పరిరక్షణ వేదిక సభ్యుడు)
బి.వేణుగోపాల్‌రెడ్డి