వర్తమాన భారత రాజకీయ ముఖచిత్రాన్ని కేసీఆర్ పాత్రలేకుండా ఊహించలేం. పద్నాలుగేండ్ల ఉద్యమం, పదేండ్ల పాలనలో తెలంగాణ స్థితిని, గతిని మార్చిన నాయకుడు కేసీఆర్. ఇప్పుడు దేశ ప్రజల ఆకాంక్ష మేరకు బీఆర్ఎస్ పార్టీని స్థాపించి దేశంలో నూతన వ్యవసాయ ఆర్థిక, రాజకీయ విధానం తీసుకువచ్చి దేశంలో గుణాత్మక మార్పుకు కంకణం కట్టుకున్నారు.
కొంతకాలంగా దేశ ప్రజలు తెలంగాణ తరహా పాలనా, అభివృద్ధి, సంక్షేమం దేశవ్యాప్తంగా అమలు కావాలని కోరుకుంటున్నారు. రైతులు, దళితులకు ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపుతూ, మహారాష్ట్రలో మొదలైన బీఆర్ఎస్ జైత్రయాత్ర దావానలంలా యావతు భారతదేశ మంతా విస్తరిస్తున్నది.
గడిచిన 40 ఏండ్లుగా ఈ దేశ రాజకీయాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా కేవ లం రెండు పార్టీల చుట్టు తిరుగుతున్నాయి. ప్రజలు ఆ రెండు పార్టీల పట్ల విసిగిపోయినప్పటికీ మరో అవకాశం లేక ఒకరిని మార్చి మరొకరికి అధికారం ఇస్తూ నష్టపోతున్నారు. బహుళ పార్టీ వ్యవస్థ అమల్లో ఉన్న మన దేశంలో కేవలం రెండు జాతీయ పార్టీలే అధికారాన్ని చెలాయించడం మన దురదృష్టం. ఇప్పుడు దేశ ప్రజల ముందు మూడవ ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ ఆవిర్భవించింది.
కేసీఆర్ నాయకత్వ పటిమ, వ్యూహ చతురత, నిబద్ధత గడిచిన 24 సంవత్సరాలు గా కేవలం తెలంగాణ ప్రజలే కాక యావత్తు భారత ప్రజలకు తెలుసు. అది ఉద్యమమైనా, రాజకీయమైనా, పాలనైనా కేసీఆర్‌కు సరిసాటి నాయకులు సమకాలీన రాజకీయ చిత్రపటంలో మరొకరు లేరు. ఉద్యమ నాయకులు సమర్దవంతంగా పాలనను అందించలేరనే వాదనను చెరిపేస్తూ తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దకాలంగా జనరంజక పాలనను అందిస్తూ ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసే లా చేసి యావత్తు దేశానికి మార్గదర్శిగా నిలిచారు సీఎం కేసీఆర్.
అందుకే కొంతకాలంగా దేశ ప్రజలు తెలంగాణ తరహా పాలన, అభివృద్ధి, సంక్షేమం దేశవ్యాప్తంగా అమలు కావాలని కోరుకుంటున్నారు. రైతులు, దళితులకు ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపుతూ, మహారాష్ట్రలో మొదలైన బీఆర్ఎస్ జైత్రయాత్ర దావానలంలా భారతదేశ మంతా విస్తరిస్తున్నది. కేసీఆర్ ప్రధాన ఉద్దేశం కేవలం అధికార మార్పిడి కాదు. ఈ దేశంలో గుణాత్మక మార్పు తీసుకువచ్చి దేశంలో నూతన ఆర్థిక, రాజకీయ, వ్యవసాయ విధానాన్ని తీసుకువచ్చి ఈ దేశ సంపదను అన్ని వర్గాలకు అందించడం. తద్వారా దేశాన్ని ప్రపంచపటంలో అగ్రభాగాన నిలపడం.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అత్యధికకాలం ఈ దేశాన్ని పాలించింది కాంగ్రెస్ పార్టీ. తన పాలన విధానాలతో ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నా పట్టించుకోలేదు. ఫలితంగా ఆ పార్టీ దేశ ప్రజలకు క్రమక్రమంగా దూరమవుతూవచ్చింది. అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా 100 సీట్లకు తగ్గని కాంగ్రెస్ పార్టీ 2019 సార్వత్రిక ఎన్నికలనాటికి 44 సీట్లకు పరిమితమై ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారింది. కాంగ్రెస్ ఇంత ఘోరంగా పతనమై దేశ ప్రజల తిరస్కరణకు గురికావడానికి ప్రధానమైన కారణం అవినీతి, కుంభకోణాలు.
దేశంలో అతి పెద్ద కుంభకోణమైన 2జీ స్కాం విలువ లక్షా డబ్బు ఆరు వేల కోట్లు. దీనితోపాటు బొగ్గు కుంభకోణం, అగస్టా వెస్ట్ లాండ్ వీవీఐపీ చాపర్ కుంభకోణం. చివరకు అంతర్జాతీయ క్రీడలైన కామన్ వెల్త్ క్రీడల నిర్వహణలో సురేష్ కల్మాడీ చేసిన కుంభకోణం ప్రపంచం ముందు భారత్‌ను తల దించుకునేలా చేసింది. వీటితోపాటు కాంగ్రెస్ పాలనలో మధ్య తరగతి ప్రజల జీవితాలు కుదేలైపోయాయి. నిత్యావసరాల నుంచి వైద్య సేవలవరకు అన్ని రకాల వస్తువులపై పన్నులు పెంచుకుంటూపోయింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు లెక్క లేకుండా పెరిగాయి. రూపాయి విలువ అంతకంతకు పతనమై ద్రవ్యోల్బణం ఆకాశానికి చేరుకున్నది. ఫలితంగా దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పక్కకు పెట్టారు.
కాంగ్రెస్ పార్టీని అవినీతి, కుటుంబ పార్టీగా ప్రచారం చేసి 2014లో మోదీ ఆధ్వర్యంలో బీజే పీ అధికారంలోకి వచ్చింది. తన పదేండ్ల పాలనలో అన్ని రంగాలు కుదేలౌతూ వస్తున్నవి. ఆర్థ్ధిక రంగం, వ్యవసాయ రంగం, నిర్మాణ రంగంతోపాటు అనేక రంగాలు మోదీ పాలనలో బేలచూపులు చూస్తున్నాయి.
2014లో 60 రూపాయలున్న డాలర్ విలువ ఘోరంగా పతనమైంది. 1948 నుంచి 2014 వరకు కేంద్ర ప్రభుత్వాలు చేసిన మొత్తం అప్పు రూ.50 లక్షల కో ట్లయితే కేవలం ఈ తొమ్మిదేండ్లలో మోదీ చేసిన అప్పు రూ.155 లక్షల కో ట్లు. ఇది దేశ జీడీపీలో 60 శాతం. డాలర్ ధర పెరగడం వల్ల చమురుపై ఈ ప్రభావం చూపుతున్నది. ఫలితంగా నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయి. 6 శాతంగా ఉన్న సెస్‌లు 20 శాతానికి పెరిగాయి.
దేశంలో లాభదాయకమైన ప్రభుత్వరంగ సంస్థలైన షిప్పింగ్ కార్పొరేషన్ మొదలుకొని ఎల్ఐసీ, రైల్వేస్, బీఎస్ఎన్ఎల్ వంటిసంస్థలే కాకుం డా, కేంద్ర ఆధీనంలోని బొగ్గు గనులు, జాతీయ రహదారులు, ఎయిర్ పోర్ట్స్, రైల్వేస్టేషన్స్ చివరకు క్రీడా స్టేడియాలను కూడా తెగనమ్మి సొమ్ము చేసుకుంటున్నది. అయితే ఈ సొమ్ము మొత్తం కేవలం అదానీ, అంబానీలకు తప్ప పేద ప్రజలకు చేరడంలేదు. ఇక ఈ దేశంలో 70 శాతం ప్రజలు ఆధారపడ్డ వ్యవసాయరంగాన్ని ధ్వంసం చేసి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని చేసిన కుయుక్తిని ఈ దేశ రైతులు తిప్పికొట్టిన వైనం ప్రపంచమంతా చూసింది. దేశంలో గడిచిన 4, 5 ఏండ్ల నుంచి రియాలిటీ, ఐటీ రంగం రోజురోజుకూ క్షీణించిపోతున్నది. ఫలితంగా కొన్ని లక్షల మంది నిరుద్యోగులుగా మారారు.
2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ దేశంలో ప్రజాస్వామ్యం క్రమంగా బలహీన పడుతూవచ్చింది. దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి కొనసాగుతున్నది. దేశంలోని ప్రభుత్వ ఏజెన్సీలను రాజ్యాంగ బద్ధ సంస్థలను స్వతంత్రంగా పనిచేయనీకుండా వాటిని కేవలం ప్రతిపక్షాలపైనా తన మాట వినని నాయకులపై నా, పార్టీలపైనా ప్రయోగిస్తూ వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నది. చివరికి అత్యంత ఉన్నతమైన గవర్నర్ల వ్యవస్థని సైతం వివాదాస్పదం చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిది. రాజ్యాంగ పరిరక్షకులుగా ఉండాల్సిన గవర్నర్లు తమ పరిధి దాటి రాజకీయాల్లో, కార్యనిర్వహణ వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నారు.
భారత దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఎన్నో దేశాలు భారత దేశాన్ని ఆదర్శంగా తీసుకుంటాయి. భిన్నత్వంలో ఏకత్వం అనే మౌలిక సూత్రం ఆధారంగా ఈ దేశంలో వివిధ మతాలు, ప్రాంతాలు, వర్గాల ప్రజలు సామరస్యంతో జీవిస్తూ వస్తున్నారు. కానీ బీజేపీ ఈ దేశంలో ప్రజలను మతం ఆధారంగా విడగొట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నది.
దేశంలో గుణాత్మక, నిర్మాణాత్మక మార్పు తీసుకువచ్చి ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపాలనే తలంపుతో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదం తో ముందుకు వెళుతున్నారు. దేశ ప్రజలు తెలంగాణ నమూనాను చూసి కేసీఆర్ వెంట నడిస్తే రేపు తెలంగాణ మాడల్ భారత మాడల్ అవుతుంది.
-రాగి శ్రీనివాసరెడ్డి
99850 98432