‘ఏదీ చిన్నగా ఆలోచించకూడదు. పెద్దగా ఆలోచించాలి. విస్తృతంగా ఆలోచించాలి. విభిన్నంగా ఆలోచించాలి. అంతే స్థాయిలో కచ్చితమైన ప్రణాళికలు వేసి అమలు చేయాలి’- ఇదే కేసీఆర్ నమ్మిన సూత్రం. తాను నమ్మిన ఆ సూత్రాన్ని ఆచరణలో పెట్టి చూపారు. ఆరు దశాబ్దాల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు జలదృశ్యం కేంద్రంగా 2001 ఏప్రిల్ 27న పిడికెడు మంది తెలంగాణవాదులతో కేసీఆర్ ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ని ఏర్పాటు చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా అలుపెరుగని పోరాట స్ఫూర్తితో 14 ఏండ్ల పాటు ఉద్యమించి రాష్ర్టాన్ని సాధించారు.
‘తెలంగాణ ఉద్యమానికి నేను కాపలాగా ఉంటాను. కష్టపడి తెచ్చి న తెలంగాణ వెనుక కోట్లాది ప్రజల ఆకాంక్షలు, వేలాది అమరుల త్యాగం, తల్లుల గుండెకోత ఉన్నవి. ఈనగాచి నక్కల పాలు చేసినట్టు కాకూడదు తెలంగాణ అని తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి కూడా నేనే నాయకత్వం వహిస్తాను’ అంటూ పరిపాలన బాధ్యతలను ఒక మహా సంకల్పంతో భుజానికెత్తుకొన్నారు కేసీఆర్. ఈ తొమ్మిదేండ్ల స్వయంపాలనలోనే ఘన చరిత్రను సృష్టించారు. తెలంగాణ సాధించిన ప్రగతి ఇవాళ దేశానికి దిక్సూచిలా మారింది. ఆ స్ఫూర్తితోనే కేసీఆర్ యావత్ దేశానికే దశాదిశ చూపెట్టడానికి బయలు దేరారు. ఈ తొమ్మిదేండ్ల కాలంలో తెలంగాణలో అమలైన సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, వ్యవసాయ అనుకూల విధానాలు దేశమంతా అమలు కావాలని, దేశ రాజకీయాల్లోనూ తెలంగాణ కీలక భూమిక పోషించాలని కేసీఆర్ టీఆర్ఎస్ను భారత రాష్ట్ర సమితిగా మార్చారు. దేశ రాజకీయాల్లో ఇది ఇప్పుడు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నది.
టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన ఉద్యమ పార్టీ ఈ ఇరువై రెండేండ్ల ప్రస్థానంలో ఎన్నో ఎత్తు పల్లాలను చవి చూసిం ది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా టీఆర్ఎస్ కంటే ముందే అనేక పార్టీలు ఈ గడ్డ మీద పుట్టాయి, పోరాడాయి. కానీ అప్పుడున్న కొన్ని అననుకూల పరిస్థితులు, రాజకీయ చిత్తశుద్ధి లేకపోవడం వంటి కారణాలతో ఆ లక్ష్యం నెరవేరలేదు. అలా అనేక పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయి. దాంతో టీఆర్ఎస్ కూడా మఖలో పుట్టి పుబ్బలో పోయే పార్టీ అని ఎందరో ఎద్దేవా చేశారు. ఆ సందర్భంలో కేసీఆర్ ఆ విమర్శలను పట్టించుకోలేదు.
ప్రత్యేక రాష్ట్రమే ఏకైక ఎజెండాగా ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ ప్రయాణంలో అనేక ఒడిదుడుకులు, విజయాలు ఉన్నాయి. తెలంగాణ నినాదం గల్లీ నుంచి ఢిల్లీ దాకా వినిపించడంలో, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను వ్యాపింపచేయడంలో టీఆర్ఎస్ కీలకపాత్ర పోషించింది. అప్పటివరకు మేధావుల ఆలోచనలు, విద్యార్థుల ఆవేశంలో మాత్రమే అంతర్లీనంగా ఉన్న ఉద్యమ స్ఫూర్తిని, ఉద్యమ కాంక్షను టీఆర్ఎస్ ఊరూరు, గడప గడపకు తీసుకుపోయింది. పార్టీ స్థాపన నుంచి ప్రత్యేక రాష్ట్రం సిద్ధించే వరకు ఉద్యమ ఆకాంక్ష చల్లారకుండా ప్రజలను చైతన్యం చేసింది. ‘స్ట్రీట్ ఫైట్ స్థానంలో స్టేట్ ఫైట్ ఉండాల’ని, అందుకు వాహకంగా పార్టీని తీర్చిదిద్దారు కేసీఆర్.
ఉద్యమ సమయంలో లక్షలాది మందితో బహిరంగ సభలు నిర్వహించి రికార్డుల కెక్కిన ఘనత టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. ఎన్నికలు, ఉప ఎన్నికలు ఇలా వచ్చిన ప్రతి అవకాశాన్ని టీఆర్ఎస్ ఉపయోగించుకున్నది. రాజీనామాలను రాష్ట్ర కాంక్షను రగిల్చే ఆయుధంగా మార్చి ప్రజలను ఏకతాటి మీదకు తెచ్చింది.
ఒక శక్తిమంతమైన నాయకుని నేతృత్వంలో పుట్టిన పార్టీ ఆ ప్రాంతపు వారందరినీ శక్తిమంతుల్ని చేస్తుంది. బీఆర్ఎస్ కూడా అంతే. ఉద్యమమే ఎజెండాగా పుట్టిన పార్టీ ఈ గడ్డ మీది అందరినీ ఉద్యమంలో భాగస్వామ్యం చేసింది. తెలంగాణ సాధన ఈ గడ్డ మీది ప్రతి ఒక్కరి బాధ్యత అనే భావన కలిగించింది. అమరుల ఆకాంక్షలకు జీవం పోసింది. చివరికి తన గమ్యా న్ని ముద్దాడింది. చిరకాల ఆకాంక్ష అయిన ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని సాధించింది. ఉద్యమ పార్టీ ప్రస్థానాన్ని కేసీఆర్ వ్యక్తి త్వం నుంచి విడదీసి చూడలేము. ఒక నిర్ణ యం తీసుకునే ముందే దాని గురించి కూ లంకషంగా ఆలోచించడం ఆయన నైజం. మాటలతో ప్రజలను చైతన్యపరచడంలో ఆయనది అనితరసాధ్యమైన శైలి. ఉద్యమ నాయకుడే ప్రభుత్వ సారథిగా ఉంటే సాధించే ప్రగతి ఏ విధంగా ఉంటుందో ఈ తొమ్మిదేండ్ల తెలంగాణ రాష్ర్టాన్ని చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది.
అనేక దీర్ఘకాల సమస్యలకు తక్కువ సమయంలోనే శాశ్వత పరిష్కారం చూపించారాయన. మన సంక్షే మం, అభివృద్ధి పథకాలు కేంద్రానికి, వివిధ రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచాయి. నీళ్లు, నిధు లు, నియామకాలే నినాదాలుగా పుట్టిన పార్టీ ఈ రోజు ఆ నినాదాలను నిజం చేసి తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించిన వారి ముందు తలెత్తుకుని నిలబడింది.
గుజరాత్ మాడల్ గుబాళించలేదని, డబు ల్ ఇంజిన్ సర్కార్లు సాధించిందేమీ లేదని దేశానికి అర్థమవుతున్న ఈ సమయంలో ‘75 ఏండ్ల స్వతంత్రం తర్వాత కూడా భార త్ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఎందుకున్నదన్న’ ప్రశ్నను కేసీఆర్ దేశం ముందుంచారు. అభివృద్ధి అంటే ఎన్నికల నినాదమో, రాజకీయపార్టీల ఎజెండానో కాదని, మనసు పెట్టి చేస్తే అదెంత అందంగా ఉంటుందో తెలంగాణలో చేసి చూపించారు కేసీఆర్. అందుకే తెలంగాణ అభివృద్ధి నమూనా కోసం యావత్ భారతదేశం ఎదురుచూస్తున్నది.
(వ్యాసకర్త : శాసన మండలి సభ్యులు)
శేరి సుభాష్ రెడ్డి