సగరులు నేటి నిర్మాణాలకు మూల పురుషులు. భారతీయ నిర్మాణ రంగపు చరిత్రకు అసలు సిసలైన వారసులు. ఆ రంగాన్ని కులవృత్తిగా చేసుకొని జీవనం సాగిస్తున్నవాళ్ళు.. భారతీయ చరిత్రకు నిర్మాణాల రూపంలో సరికొత్త హంగులు, రంగులు అద్దినవారు. నింగిని ముద్దాడే ఆకాశ హర్మ్యాల నుంచి వందల ఏండ్లు అయినా చెక్కు చెదరని రాజ భవంతుల దాకా సర్వం వారే, సకలం వారే. దివి నుంచి భువికి గంగను తెచ్చి సకల జనుల గొంతులు తడిపిన భగీరథ మహాముని వారసులు కూడా వారే.
కాకతీయుల హయాంలో చెరువులు, పట్టణాలు, దేవాలయాల నిర్మాణం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో సగరుల పాత్ర ఉన్నది. ఇంత గొప్ప వారసత్వం కలిగిన వారు కాల క్రమంలో యాంత్రీకరణ వల్ల ఇంజనీరింగ్ వ్యవస్థ అభివృద్ధి కావడంతోదెబ్బతిన్నారు. నిర్మాణ రంగంలో వచ్చిన మార్పుల కారణంగా నిర్మాణ రంగంపై ఆధారపడిన సగరుల జీవితం అతలాకుతలం అయింది. ఈ రంగాన్ని వీడి వివిధ రంగాల్లో ఉపాధి వెతుక్కుంటూ లక్షలాది మంది వలస పోయారు. వారంతా సంచార జీవితంలో భాగం అయ్యారనే చెప్పొచ్చు
ఎంతో చారిత్రక వారసత్వం గలిగినా ఉనికి లేని ఉప్పరుల(సగరుల) గురించి పట్టించుక్ను వారే లేరు. కానీ తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాంటి కులాల పట్ల, తెగలపట్ల మానవత్వాన్ని ప్రదర్శించి వారి ఉనికి కోసం తాపత్రయ పడ్డారు. ఆత్మగౌరవ భవనాల పేరిట వారి అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.
చరిత్ర కొన్ని సార్లు తనను తాను వెతుక్కుంటూ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నది కూడా అదే. తెలంగాణలో స్వయం పాలన ప్రారంభమయిన తర్వాత విస్మరణకు గురైన జనసమూహాలకు పునర్వైభవం కలిగిస్తున్న సందర్భం ఇది.
ఈ సందర్భంగానే తెలంగాణ ప్రభుత్వం సగరుల కోసం వారి ఆత్మగౌరవాన్ని మరింత ఇనుమడింప చేసేందుకు రాష్ట్ర రాజధాని నగరంలో భవనం నిర్మించేందుకు సంకల్పించింది. కోట్లాది రూపాయల విలువైన స్థలంలో భవన నిర్మాణానికి పూనుకున్నది.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా మార్పులు జరుగుతున్నాయి. అందులో సబ్బండ వర్ణాల వారికి భవన సముదాయాల నిర్మాణం కీలకాంశం. ఇవి కేవలం భవనాలు మాత్రమే కాదు. ఆయా సముహాల ఆత్మగౌరవానికి ప్రతీకలు కూడా. గత పాలకుల నిర్లక్ష్య, వివక్ష వైఖరులకు భిన్నంగా తమ ప్రజలకు అత్యున్నతమైన ఆసనం ఇవ్వడంగా దీన్ని అర్థం చేసుకోవాలి. వారు వీరు అనే తేడా లేకుండా అందరికీ ఆత్మగౌరవ భవనాలు హైదరాబాద్ నగరంలో రూపు దిద్దుకుంటున్నాయి. కొన్ని ఇప్పటికే దిద్దుకున్నాయి కూడా. సచివాలయానికి సమీపంలో ఆకాశాన్ని అందుకునే అంబేద్కరుడి విగ్రహం ఉన్నట్టుగానే ఆయన స్పూర్తితో ప్రతి సామాజిక వర్గానికి ఓ గుర్తింపు నిర్మాణ రూపంలో ఉండాలనే తలంపుతో ప్రభుత్వం ఈ కుల భవనాలు నిర్మిస్తున్నది. ఇందులో ఒక్కో సామాజిక వర్గానికి ఒక్కో చరిత్ర ఉన్నది.వందల వేల ఏండ్లుగా ఆయా సమూహాల ప్రజలు తీవ్రమైన నిర్లక్ష్యానికి, నిర్వేదనకు గురైన వారు. వారికి ఇప్పుడు స్వాంతన, స్వాభిమానం ప్రస్తుత ప్రభుత్వ చర్యల రూపంలో, కేసీఆర్ నాయకత్వంలో లభిస్తున్నది. ఇది ముమ్మాటికీ సరికొత్త చరిత్రకు ప్రారంభంగా చెప్పాలి. స్వయంపాలన ప్రభుత్వపు అద్భుత చర్యగా కూడా పరిగణించాలి.
సగరుల విషయానికి వస్తే కాకతీయుల కంటే ముందు నుంచే ఇక్కడ చిన్నా, పెద్ద రాజ్యాలుండేవి..రాజులు ఎవరైనా చెరువుల నిర్మాణం తప్పకుండా జరిగింది. కాకతీయుల హయాంలో చెరువులు, పట్టణాలు, దేవాలయాల నిర్మాణం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో సగరుల పాత్ర ఉన్నది. ఇంత గొప్ప వారసత్వం కలిగిన వారు కాల క్రమంలో యాంత్రీకరణ వల్ల ఇంజనీరింగ్ వ్యవస్థ అభివృద్ధి కావడంతోదెబ్బతిన్నారు. నిర్మాణ రంగంలో వచ్చిన మార్పుల కారణంగా నిర్మాణ రంగంపై ఆధారపడిన సగరుల జీవితం అతలాకుతలం అయింది. ఈ రంగాన్ని వీడి వివిధ రంగాల్లో ఉపాధి వెతుక్కుంటూ లక్షలాది మంది వలస పోయారు. వారంతా సంచార జీవితంలో భాగం అయ్యారనే చెప్పొచ్చు.
షట్ చక్రవర్తుల్లో ఒకరైన సగర చక్రవర్తి వారసులుగా ఎంతో ఘనకీర్తిని మూట కట్టుకున్న సగరులు తదనంతరం భగీరథుడి వంశస్థులుగా చరిత్రలో మిగిలిపోయారు. కాలక్రమేణా ఉనికి లేని ఉప్పర్లుగా మిగిలిపోయారు. కలియుగంలో ఒకపక్క ఉప్పు తయారు చేసే సాల్ట్ మేకర్స్ గా ఉంటూనే నాటి భగీరథుని వారసులుగా చెరువుల నుంచి పొలాలకు నీటిని వదిలే నీరటికారులుగా ఇప్పటికీ విధులు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణలో మంచినీటి పథకానికి మిషన్ భగీరథ పేరుతో ఆ సగర కులగురువు పేరును పెట్టి వారికి సముచిత స్థానాన్ని కల్పించిందీ ప్రభుత్వం. అయితే మెజారిటీ సగర జాతి నిర్మాణ రంగాన్ని కులవృత్తిగా చేసుకొని జీవనం సాగిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పాలమూరు తదితర జిల్లాల్లో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు రావడం పచ్చని పంట పొలాలు తిరిగి వారిని సగర్వంగా ఆహ్వానించడంతో రివర్స్ మైగ్రేషన్ జరిగి అనేకమంది తమ ప్రాంతాలకు తిరిగి వచ్చి తమ కులవృత్తిని సైతం పక్కనపెట్టి ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయాన్ని చేసుకుంటూ జీవితం గడపడాన్ని కండ్లెదుట చూస్తున్నాము.
ఇక్కడ ఇంకో విషయం గుర్తించాలి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చెరువులు మళ్లీ ప్రాణం పోసుకున్నాయి. మిషన్ కాకతీయ పేరుతో చెరువులకు పునరుజ్జీవం కల్పించిన ప్రస్తుత ప్రభుత్వం ఆ చెరువులను ఆధారం చేసుకున్న నీరటికార్లకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో స్థానం సైతం కల్పించింది.
వారి ఉనికిని, వారి నిర్మాణాలను, వారి చరిత్రను మరోసారి నేటి తరానికే కాదు ముందు తరాలకు గుర్తుండిపోయేలా ఉండాలని శాశ్వతమైన భవనాన్ని నిర్మించేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నది.. ఇది ఎలా ఉందంటే శిల్పిని గుర్తించి ఆ శిల్పి పేరుమీదనే రామప్ప దేవాలయం అనే నామకరణం చేసిన కాకతీయ ప్రభువుల తర్వాత అంతటి చరిత్రకు నిర్మాతలైన సగరులను గుర్తించి వారి కోసం ఆశ్రయం ఇవ్వడం స్వయంపాలన ప్రభుత్వపు సమ దృష్టికి నిదర్శనంగా చెప్పుకోవాలి.
ఎవరనుకున్నారు తెలంగాణ రాష్ట్రం సాధ్యం అవుతుందని, ఎవరునుకున్నారు తెలంగాణలో ఇంత మార్పు వస్తుందని, ఎవరనుకున్నారు అసాధ్యం సుసాధ్యం అవుతుందని, ఎవరనుకున్నారు సబ్బండ వర్గాల వారికి రాజధానిలో సగౌరవ సముచిత స్థానం దొరుకుతుందని. ఇదీ కేవలం స్వయం పాలన, ఉద్యమ నాయకత్వం వల్లనే సాధ్యం అవుతుందని, అయిందని మన కండ్ల ముందరి పాలన రుజువు చేస్తున్నది. జనరంజక పాలకులు ఎక్కడున్నా సర్వజనహిత పాలన సాగుతుందనేందుకు ఇది దీన్ని నిదర్శనంగా చెప్పొచ్చు. తెలంగాణలో జరుగుతున్నది ఇదే. ఈ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు…..వేస్తున్న అడుగులు యావత్ భారతావని చరిత్రలో మైలు రాళ్లుగా చెప్పక తప్పదు.
అపరభగీరథుని వారసులుగా ఈ ప్రభుత్వ నిర్ణయానికి, సగరులకిచ్చిన సముచిత గౌరవానికి వినమ్ర నమస్సులు. దార్శనికులకు…చరిత్రలో నిలిచే వారికి మాత్రమే సాధ్యమయ్యే పనులు చేసే నాయకులను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు…కేవలం భవనాల రూపంలోనే కాదు…భవిష్యత్తు మార్గదర్శనంలో కూడా.
(వ్యాసకర్త : చైర్మన్,సగర ఆత్మగౌరవ భవన సంక్షేమ ట్రస్ట్)
( ఈ నెల 11న సగర ఆత్మగౌరవ భవనానికి శంకుస్థాపన)
అస్కాని మారుతీ సాగర్
90107 56666