చరిత్రను విస్మరించిన ఏ జాతికీ భవిష్యత్తు ఉండదు. తెలంగాణ రాష్ట్రంలో నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ ఊరికే రాలేదు; దాని వెనుక ఒక నాయకుడి 14 ఏండ్ల ఉద్యమ తపస్సు ఉన్నది. పరాయి పాలకుల గుండెల్లో సింహగర్జన చేసి, ఢిల్లీ పీఠం మెడలు వంచి స్వరాష్ర్టాన్ని సాకారం చేసిన కేసీఆర్ పట్టుదల, రాబోయే తరాలకు ఒక దిక్సూచి. అలా అడ్డంకులనే ఆయుధాలుగా మార్చి స్వరాష్ట్రం కల నెరవేర్చిన చారిత్రక పురుషుడు కేసీఆర్’
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి అనునిత్యం, అడుగడుగునా జరుగుతున్న అన్యాయాన్ని చూసి చలించిపోయిన కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ సాధన ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారమని భావించి టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. 14 ఏండ్లు అలుపెరుగని పోరాటం చేసి, ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, దశాబ్దాల స్వరాష్ట్ర సాధన కలను సాకారం చేశారు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆనాటి ఉద్యమ చరిత్రను ఒకసారి అవలోకనం చేస్తే..
తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో జాతీయ పార్టీల నయవంచనను స్మరించుకున్నపుడు 1999 నాటి పరిణామాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. 1997 కాకినాడ సదస్సులో ‘ఒక్క ఓటు రెండు రాష్ర్టాలు’ అంటూ తెలంగాణ ప్రజలకు ఆశ కల్పించిన బీజేపీ, ఆ తర్వాత అధికారమే పరమావధిగా తెలంగాణ ఆకాంక్షలను ఏ విధంగా కాలరాసిందో నాటి చరిత్ర స్పష్టం చేస్తున్నది.1999 ఎన్నికల నాటికి కేంద్రంలో వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ మద్దతు అత్యంత కీలకంగా మారింది. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ వంటి పెద్ద రాష్ర్టాలను ముక్కలు చేసి ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి కొత్త రాష్ర్టాలను ఏర్పాటు చేసిన నాటి కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ విషయంలో మాత్రం చంద్రబాబు అభ్యంతరాల సాకుతో చేతులెత్తేసింది. ఒక జాతి ఆత్మగౌరవ పోరాటాన్ని, కేవలం ఒక ప్రాంతీయ నేత రాజకీయ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టటంపై నాడు తెలంగాణ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మోసంతో ‘కాకినాడ తీర్మానం కాకి ఎత్తుకపోయింది’ అనే అపప్రధను బీజేపీ మూటగట్టుకోవాల్సి వచ్చింది.
ఈ వైఫల్యం, తెలంగాణపై అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలాంటి జాతీయ పార్టీల ద్వంద్వవైఖరిని గమనించిన తర్వాతే, పరాయి పార్టీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడితే స్వరాష్ట్ర కల నెరవేరదని కేసీఆర్ గ్రహించారు. తెలంగాణ ద్రోహిగా ప్రజల ఎదుట నిలబడిన చంద్రబాబు నాయకత్వం నుంచి బయట పడాలని, తెలంగాణ కోసం పోరాడాలని నిర్ణయించుకున్నారు కేసీఆర్. ఉమ్మడి రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కరెంటు చార్జీలు పెంచారు. దీనిపై తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. పెంచిన విద్యుత్తు చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ, వివిధ సంఘాల ఆధ్వర్యంలో 2000 ఆగస్టు 28న చలో అసెంబ్లీ కార్యక్రమం జరిగింది. నిరసన తెలపటానికి అసెంబ్లీ వైపు దూసుకొస్తున్న ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉద్యమకారులు మరణించగా, ఎంతోమంది గాయపడ్డారు. పెంచిన విద్యుత్తు చార్జీలు సామాన్య ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ఎంతో భారమని, బోర్ల ద్వారా వ్యవసాయం చేసుకునే రైతులకు పెంచిన కరెంటు చార్జీలు భరించటం కష్టమని కేసీఆర్ వాదించారు. ఇదే విషయంపై తన నిరసన తెలుపుతూ చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు.
అడుగడుగునా అన్యాయానికి గురైన తెలంగాణ ప్రాంతంలో..ఆనాడు తెలంగాణ గురించి మాట్లాడటమే నేరం. శాసనసభలో టీడీపీ నుంచి హన్మకొండ సభ్యుడిగా ఉన్న దాస్యం ప్రణయ్ భాస్కర్ తెలంగాణపై కవిత రాసి చదివితే..సీమాంధ్ర సభ్యులు, నాయకులు దానిని జీర్ణించుకోలేకపోయారు. ఆ తర్వాత అసెంబ్లీలో తెలంగాణ పదాన్నే నిషేధించారు.
తెలంగాణ రాష్ట్రం గురించి ఎవరు మాట్లాడినా వారిని నక్సలైట్లుగా ముద్ర వేయటం సమైక్య పాలకులకు పరిపాటిగా మారింది. నక్సలైట్ ముద్ర వేస్తే తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయటం సులువైన మార్గమని వారు భావించారు. నక్సలైట్ ముద్రతో తెలంగాణవాదులను, తెలంగాణవాదాన్ని అంతమొందించటం యథేచ్ఛగా కొనసాగింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏది చెప్తే అదే రైట్, ఏం చేస్తే అదే కరెక్టు అని ఆయన జపాన్ని మీడియా చేస్తున్న రోజులు. మరోపక్క వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రతిపక్ష నాయకుడు. ఇద్దరూ ఇద్దరే.. తెలంగాణ బద్ధవ్యతిరేకులు. ఇద్దరికీ అర్థబలం, అంగబలం, కులబలం, రాజకీయబలం ఉన్నది.
తెలంగాణ కావాలని ఇక్కడి ప్రజలకు ఉన్నా, అది సాధించే మార్గం కానరాని అగమ్యగోచరం. తెలంగాణ కోసం ఎప్పుడు ఎవరు ఉద్యమించినా, సమైక్య పాలకులు అణచివేసే వారు. విభజించి, పాలించు పద్ధతితో తెలంగాణ సమాజాన్ని విడదీసేవారు. తెలంగాణ ఉద్యమ నాయకత్వంలో ఎవరున్నా వారి వ్యక్తిత్వాన్ని హననం చేసేవారు. ఆనాటి ప్రతికూల వాతావరణంలో తెలంగాణ సాధించటం కోసం అన్ని పదవులనూ వదులుకుని, తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో కేసీఆర్ పార్టీని స్థాపించారు. 2001 మే 11న తెలంగాణలోని అన్ని మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో తొలిసారిగా గులాబీ పతాకాలను ఆవిష్కరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు నీళ్లు, నిధులు, నియామకాల్లో జరుగుతున్న అక్రమాలను ఎత్తిచూపుతూ, 610 జీవో అమల్లో జరుగుతున్న జాప్యాన్ని ఎండగడుతూ మలిదశ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని కేసీఆర్ ఉరకలెత్తించారు.
తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ మాట తప్పటంతో విసిగిపోయిన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షనే అస్త్రంగా ఎంచుకున్నారు. ఆయన దీక్షతో తెలంగాణ ఊరూవాడా ఒక్కటైంది. పల్లె, పట్నం దిగ్బంధించటంతో దిగివచ్చిన కేంద్రం ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన చేసింది. కానీ, ఆంధ్రా నాయకులు రాజీనామాలతో బెదిరిస్తే కాంగ్రెస్ మళ్లీ వెనక్కి తగ్గింది. ఈ ఆవేదనతో వందలాదిమంది తెలంగాణ బిడ్డలు ప్రాణత్యాగాలు చేశారు. దీంతో చలించిపోయిన కేసీఆర్ అన్నిపార్టీలతో కలిపి జేఏసీని ఏర్పాటు చేసి, మూడేండ్లు ఉద్యమం నడిపించారు. వంటావార్పు, సాగరహారం, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మెలాంటి అస్ర్తాలను ప్రయోగించారు. సబ్బండవర్గాలను ఒక్కటి చేసి ఆంధ్రా నాయకుల కుట్రలను బద్దలు కొట్టారు.
తెలంగాణ ఉద్యమ ఉధృతితో దిగివచ్చిన కేంద్రం 2014 ఫిబ్రవరి 18న లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టగా, సీమాంధ్ర ఎంపీలు సభను అడ్డుకోవటానికి తీవ్ర ప్రయత్నం చేశారు. దీంతో లోక్‌సభలో ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేశారు. ఆ సమయంలో మూజువాణి ఓటుతో తెలంగాణ బిల్లు పాసయింది. రాష్ట్ర పునర్విభజన బిల్లు నెగ్గిందని స్పీకర్ మీరాకుమార్ ప్రకటించారు.
2014 ఫిబ్రవరి 20న హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే రాజ్యసభలో తెలంగాణ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెట్టారు. అక్కడ కూడా మూజువాణి ఓటుతో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది. ‘ది బిల్ ఈజ్ పాస్’ అని డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ ప్రకటించారు. లోక్‌సభ, రాజ్యసభల్లో బిల్లు ఆమోదం పొందటంతో తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల స్వప్నం సాకారమైంది. తెలంగాణ ప్రజలు సంబరాల్లో మునిగితేలారు. 2014 జూన్ 2న దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. ఉద్యమాన్ని నడిపిన చేతులే..ఉజ్వల భవిష్యత్తును నిర్మించగలవని విశ్వసించిన తెలంగాణ సమాజం, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్ర క తీర్పునిచ్చింది. కోట్లాది మంది ప్రజల ఆశ లు, ఆకాంక్షలకు ప్రతిరూపమైన కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకా రం చేశారు. నాడు శూన్యంతో మొదలైన ప్రస్థానాన్ని, తొమ్మిదిన్నరేండ్లపాటు తన అద్భుత పరిపాలనా దక్షతతో అగ్రపథాన నిలిపారు. వ్యూహాత్మక ఆర్థిక విధానాలతో ‘రాష్ట్ర సంపదను పెం చటం..ఆ సంపదను ప్రజలకు పంచటం’ అనే సరికొత్త ప్రగతి సూత్రానికి ప్రాణం పోశారు కేసీఆర్.
సమైక్య పాలనలో ఎండిపోయిన గుండెల్లో కాళేశ్వర జలాలను నింపి, రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లతో సంక్షేమంలో తెలంగాణను స్వర్ణయుగంగా మార్చారు. ఒకనాడు కరెంట్ కోతలతో, తాగునీటి కష్టాలతో అల్లాడిన రాష్ర్టాన్ని..తలసరి ఆదాయంలో, ఐటీ రంగంలో, వ్యవసాయ, పారిశ్రామిక ప్రగతిలో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపిన ఘనత కేసీఆర్‌దే. ఒక వీరోచిత ఉద్యమ నాయకుడిగా జైత్రయాత్రను ప్రారంభించి, అజేయమైన ప్రగతిశీల పాలకుడిగా తెలంగాణ అస్తిత్వాన్ని విశ్వవ్యాప్తం చేసిన కేసీఆర్ చారిత్రక పాలన..తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమై ఉంటుంది.
(వ్యాసకర్త: శాసనమండలి ప్రతిపక్ష నేత)
–సిరికొండ మధుసూదనాచారి