2023, జూలై నెల. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరంగల్లోనూ వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అదే నెల 26వ తేదీ అర్ధరాత్రి. మేఘ విస్ఫోటనం జరిగింది. మొగులు పగిలింది. ఏడాదిపాటు కురవాల్సిన వాన ఆ ఒక్క రాత్రే ఆకాశానికి చిల్లులు పడినట్టుగా కురిసింది. మోరంచ వాగు ఉగ్రరూపం దాల్చింది. అర్ధరాత్రి పల్లె గాఢ నిద్రలో ఉండగా, పక్కనే ఉన్న మోరంచపల్లి మీద మోరంచ వాగు విరుచుకుపడింది. క్షణాల్లోనే ఊరిని వరద ముంచెత్తింది. ఇంట్లోకి జొరబడి మంచాలను ముద్దాడితే కానీ, వారికి తెలియలేదు మోరంచ మహోగ్రరూపం.
తేరుకున్న ఆ గ్రామ ప్రజలు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. చూస్తుండగానే మోరంచ అందర్నీ తనలో కలిపేసుకుంటున్నది. విషయం తెలుసుకున్న అధికార యంత్రాంగం ఆ ఊరికి చేరుకున్నది. కానీ, ఆ వరద ఉధృతిలో ముందుకు వెళ్లలేని పరిస్థితి. హుటాహుటిన రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం చేరవేశారు. అత్యవసర పరిస్థితిని తెలుసుకున్న కేసీఆర్ రాత్రికిరాత్రే పదుల సంఖ్యలో బోట్లు, రెండు హెలికాప్టర్లను అక్కడికి పంపించారు. స్థానిక ఎమ్మెల్యే గండ్ర, అప్పటి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాలను అప్రమత్తం చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులను ఆగమేఘాలపై అక్కడికి పంపించారు. ప్రాణాలకు తెగించి మరీ వరదలో కొట్టుకుపోతున్న, నీళ్లల్లో చిక్కుకున్న, చెట్టు, పుట్టలను పట్టుకొని వేలాడుతున్న వెయ్యి మందికి పైగా ప్రజలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. అక్కడే వారికి మూడు పూటలా భోజనం ఏర్పాటు చేయించారు.
మరుసటి రోజు ఉదయం వరద ఉధృతి తగ్గాక జిల్లా మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్ అక్కడే మకాం వేశారు. కొట్టుకుపోయిన రోడ్లను 48 గంటల్లోగా బాగు చేసి రాకపోకలకు మార్గం సుగమం చేశారు. కరెంట్ స్తంభాలను నిలబెట్టి విద్యుత్తు సరఫరా పునరుద్ధరించారు. ఫైరింజన్లు తెప్పించి ఇండ్లల్లో పేరుకుపోయిన బురదను శుభ్రం చేయించారు. ఆ తర్వాత ప్రభుత్వం తరఫున ప్రతి ఇంటికి రూ.10 వేల తక్షణ సాయాన్ని కేసీఆర్ సర్కార్ అందించింది. ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, బట్టలు, ఇతర వసతులు కల్పించి సొంతిళ్లకు పంపించింది. వైద్య శిబిరం ఏర్పాటు చేసి, అందరికీ వైద్యం అందించింది. ఇదీ నాడు వరదలు వచ్చినప్పుడు కేసీఆర్ సర్కార్ స్పందించిన తీరు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఏం చేస్తున్నది?
గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలు నీటమునిగాయి. మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ అతలాకుతలమవుతున్నది. కామారెడ్డి, మెదక్,సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలు గజగజ వణుకుతున్నాయి. జిల్లాలు జిల్లాలే నీటమునిగాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. వంతెనలు తెగిపోయాయి. ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి.
కామారెడ్డిలో మొదటి అంతస్తు వరకు వరద ముంచెత్తింది. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు. నీరోను మించిపోయిన సీఎం రేవంత్‌రెడ్డికి ఇవేమీ పట్టవు. జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లోనే కాలక్షేపం చేసిన ఆయన ప్రజలను వరదకు వదిలేశారు. చస్తే చావండి అన్నట్టుగా వ్యవహరించారు.
రాష్ట్రంలో గత వారం రోజులనుంచి వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ, మతిలేని సర్కార్ మొద్దు నిద్ర వీడలేదు. కనీసం ఒక్కసారైనా సమీక్షించలేదు. 2 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్లు వాడే ప్రజాప్రభుత్వంలోని మంత్రులకు వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు మాత్రం హెలికాప్టర్లు దొరకలేదు. హెలికాప్టర్లు సమయానికి అందుబాటులో ఉంచి ఉంటే నలుగురి నిండు ప్రాణాలు బలయ్యేవి కావు. మరో ఆరుగురు గల్లంతయ్యేవారు కాదు. కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు మూటలు ముట్టజెప్పే ‘ముఖ్య’నేత ఈ సారి ఏకంగా రాష్ట్ర సర్కారు వాడే హెలికాప్టర్‌ను బీహార్ ఎన్నికల కోసం వాళ్ల కాళ్ల కాడ పెట్టారు. అందుకే రాష్ట్రంలో వరద బాధితులను రక్షించేందుకు గాలిమోటరు గాల్లో ఎగరలేదు. రాష్ట్రం వరదల్లో మునుగుతుం టే, ముఖ్యమంత్రికి మాత్రం కమీషన్ల మూసీ సుం దరీకరణపై మనసు మళ్లింది. స్పోర్ట్స్ పాలసీ ముద్దయ్యింది. నెల రోజుల క్రితం కూడా హైదరాబాద్ ను వరద ముంచెత్తుతుంటే, ప్రక్షాళన పేరిట మూ సీలోనే ఆయన మునిగితేలిన విషయం తెలిసిందే.
వరదలో మునిగిన ప్రాంతాలను సీఎం మాత్రమే కాదు, కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోలేదు. ఏ ఒక్కరూ ఆ ప్రాంతాల దరిదాపుల్లోకి పోలేదు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. వరద ముంపు ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించలేదు. ఇలా అన్నింటా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కేటీఆర్ మాత్రం తన బాధ్యతను మర్చిపోలేదు. వరదల సమయంలో ఎలా వ్యవహరించాలో, ఏ విధంగా బాధితులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చాలో తెలిసిన ఆయన మరోసారి ప్రజలు ఆదుకున్నారు. వరద గురించి తెలుసుకున్న ఆయన వెంటనే బీఆర్ఎస్ శ్రేణులను అప్రమత్తం చేశారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆయన కూడా స్వయంగా సిరిసిల్ల జిల్లాతో పాటు వివిధ ముంపు ప్రాంతాలను సందర్శించారు. బాధితులను పరామర్శించారు. వరద మిగిల్చిన నష్టాన్ని ప్రభుత్వానికి తెలిసేలా చేశారు.
గతంలో వర్షాలకు గోదావరి తీవ్ర ఉగ్రరూపం దాల్చడంతో చెన్నూరు దగ్గర ఇద్దరు వ్యక్తులు వరదలో ఇరుకున్న విషయం తెలుసుకున్న నాటి చెన్నూరు శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ వెంటనే స్పందించి, ఆర్మీ హెలికాప్టర్‌ను తెప్పించి వారిని కాపాడారు. గతంలో ఎప్పుడూ వర్ష సూచన ఉన్న కూడా హైదరాబాద్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి స్వయంగా అర్ధరాత్రి వరకు పరిస్థితిని సమీక్షించే వారు. దానికి ప్రత్యక్ష సాక్షిని నేనే. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు మనోధైర్యం కల్పించేవారు. కరీంనగర్ జిల్లాలో పర్యటించి పంటలు పూర్తిగా దెబ్బతిన్న రైతులకు అక్కడికక్కడ రూ.10 వేల చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు. అదే విధంగా ఇంటెలిజెన్స్ అధికారులు వారించినా వినకుండా అధికారులను తీసుకొని భూపాలపల్లి, భద్రాచలం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటించారు.
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. బురదలో దిగకుండానే గాలిమోటర్లో వరద ప్రభావిత ప్రాంతాలను చూసొచ్చారు. వరదలోనూ తనకు బురద రాజకీయాలే ఇష్టమని మరోసారి నిరూపించుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. లక్షల ఎకరాల్లో పంట నీటమునిగింది. రోడ్లు తెగిపోయాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. ఇండ్లు నీటమునిగి చాలా మంది నిరాశ్రయులయ్యారు. కానీ, ఇవేవీ ఆయన కంటికి కనిపించలేదు. బాధితుల గోడు వినిపించలేదు. పీకల్లోతు వరద నీటిలో ప్రజలు మునిగి ఉంటే, ఆయన మాత్రం పీకల వరకు కాళేశ్వరంపై ఉన్న ఆక్రోశాన్ని మరోసారి వెళ్లగక్కారు. వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించకుండా ఎల్లంపల్లికి వెళ్లి గోదావరి జలాలకు పూజలు చేసి మంగళహారతులు పట్టారు. ఇక్కడ కూడా కాళేశ్వరంపై పాత పాటే పాడటం ఆయన కపటబుద్ధికి నిదర్శనం. గతంలో ఖమ్మం నగరాన్ని వరద ముంచెత్తినప్పుడు కారులోంచి చేతులు ఊపుకుంటూ వెళ్లిపోయిన ఆయన ఇప్పుడు కూడా వరద నష్టపరిహారంపై నోరెత్తకుండా మరోసారి మొండిచెయ్యి చూపించడం హేయం.
(వ్యాసకర్త: బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
-షేక్ ఫారెజ్
96661 74738