మహారాష్ట్రలో ముస్లిం సత్యశోధక్ మండలి వ్యవస్థాపకుడు, ముస్లిం లౌకిక, ప్రజాస్వామ్య, సంస్కరణవాది హమీద్ దల్వాయి ఇస్లాం మత, సామజిక, రాజకీయ చరిత్రతో పాటుగా ముస్లిం మనస్తత్వాన్ని ఎలాంటి అపోహలు లేకుండా నిస్పాక్షికంగా విశ్లేషిస్తూ ‘లౌకిక భారతదేశంలో ముస్లిం రాజకీయాలు’ అనే గ్రంథాన్ని రాశారు. ఈ పుస్తకాన్ని ఆనందేశి నాగరాజు తెలుగులోకి అనువదించారు.
నేటి భారతంలో ఒకవైపు అన్నిరకాల అభివృద్ధి నిరోధక, ఛాందస, పునరుద్ధరణ సంప్రదాయవాదులు, మరోవైపు ఆధునిక ఉదారవాదుల మధ్య నిజమైన సంఘర్షణ జరుగుతున్నది. భారతీయ రాజకీయ నాయకులు దూరదృష్టి లోపించి స్వార్థ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వారు ఎల్లప్పుడూ సంప్రదాయవాదాన్నీ, మతతత్వాలను బుజ్జగిస్తారు. ఏనాడూ వాటిని వ్యతిరేకించరు. అందువల్ల, అన్ని రకాల మతతత్వాలపై రాజకీయాలకతీతంగా ఉమ్మడి పోరు చేయడానికి అన్నివర్గాల ఉదారవాద మేధావుల మధ్య అంగీకారం ఏర్పడాల్సిన అవసరం ఉన్నది. ఇదిగనుక జరగకపోతే, భారత దేశంలో ఉదారవాదం, ప్రజాస్వామ్యం క్రమంగా నశించి తీరుతాయి.
దల్వాయి భారతదేశంలోని సెక్యులర్ పార్టీల నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తూ ఇలా అన్నాడు… భారతదేశంలో మతతత్వాన్ని సమూలంగా నిర్మూలించడానికి ఏ రాజకీయ పార్టీ కూడా కచ్చితమైన చర్యలు తీసుకోవడం లేదు. వారు ముస్లింలను సంతృప్తి పరచడానికే చూస్తారు. నా సొంత పార్టీ ఎస్ఎస్పీ కూడా ఇందుకు మినహాయింపు కాదు. రాజకీయాలకతీతంగా ఈ సమస్య పరిష్కారం కోసం ఒక సంస్థ ఏర్పడాలి.
హమీద్ దల్వాయి మహారాష్ట్రలోని ఒక పల్లెటూరులో నిరుపేద ముస్లిం కుటుంబంలో 1932లో జన్మించారు. మూడుసార్లు తలాక్ (విడాకులు) పదాన్ని ఉచ్చరించి ముస్లిం వివాహితకు భర్త యథేచ్ఛగా విడాకులు ఇవ్వవచ్చని చెప్పే ముస్లిం వ్యక్తిగత షరియా చట్టాన్ని ఆధునీకరించాలనీ, ముస్లింలలో బహు భార్యత్వాన్ని నిషేధించాలనీ, ఉమ్మడి పౌర చట్టాన్ని రూపొందించాలనే డిమాండ్‌తో దేశంలోనే మొట్టమొదటి సారిగా ఉద్యమించిన నిజమైన లౌకికవాద ముస్లిం మేధావి, సాంఘిక సంస్కర్త హమీద్. హేతువాది అయిన దల్వాయి అన్ని మతాల్లోని మూఢ నమ్మకాలను ప్రశ్నించి పౌర సమాజంలో అన్నిరకాల మత ప్రమేయాన్ని నిషేధించాలని కోరారు. మొదట జయప్రకాశ్ నారాయణ నేతృత్వంలోని ఇండియన్ సోషలిస్ట్ పార్టీలో పనిచేసినా, తర్వాత రాజకీయ పార్టీలకు అతీతంగా ముస్లిం సమాజంలో సాంఘిక సంస్కరణల కోసం అవిశ్రాంతంగా కృషిచేశారు. పత్రికా విలేకరిగా పనిచేసినా, మరాఠీలో కథలతో పాటుగా జాతీయ సమగ్రత, లౌకిక, ప్రజాస్వామ్య వ్యవస్థల ఏర్పాటుకు ముస్లిం సమాజంలో, హిందువులలో సాంఘిక సంస్కరణల ఆవశ్యకతపై మరాఠీలో గ్రంథాలు రాశారు.
అన్ని మతాల బోధనలలో శాంతి, సహనంతో పాటుగా కాలంచెల్లిన అశాస్త్రీయ భావాలూ, లౌకిక, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమైన అంశాలూ ఉంటాయి. ఆయా మతానుయాయులలో ఆధునిక మానవీయ, లౌకికవాద, ప్రజాస్వామ్య భావాలతో ప్రేరేపితులైన వ్యక్తులు కాలానుగుణంగా తమ తమ మతాలలో సంస్కరణలు తెచ్చినట్టయితే, ఆ మతస్థులు దేశ లౌకిక, ప్రజాస్వామిక వ్యవస్థలో భాగస్వాములవుతారని దల్వాయి చెప్తూ నేను కొందరు ముస్లింల వైఖరిని విమర్శిస్తున్నానంటే, అది తమ మత విశ్వాసాలతో సంబంధం లేకుండా సమస్త భారతీయుల, దేశ విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్న విమర్శ మాత్రమే. ముస్లింలందరిపై చేస్తున్న విమర్శ కాదని స్పష్టం చేశారు.
భారతదేశంలో లౌకికవాదానికి దిశా నిర్దేశం చేస్తూ భారతదేశంలోని నాగరీకులందరికి ఉమ్మడి పౌర స్మృతిని ఏర్పాటుచేయాలని పట్టుబట్టాలి. దేశంలోని అన్ని వివాహాలను ఉమ్మడి పౌర స్మృతి ప్రకారం నమోదు చేయడాన్ని తప్పనిసరి చేయాలి. మత మార్పిడులను అనుమతించరాదు. రహదారులలో రాకపోకలకు ఇబ్బందికరంగా నిర్మించిన మందిరాలనూ, మసీదులను, ఇతర ప్రార్థనా స్థలాలను తొలగించాలి. అన్ని మతాల ఆస్తులపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. వీటిద్వారా వచ్చిన ఆదాయాన్ని కేవలం విద్య, సంక్షేమ పథకాలపైనే వెచ్చించాలి. కశ్మీర్‌కు ఇచ్చిన ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేయాలి. ఉర్దూ భాషాభివృద్ధికి అవకాశాలు కల్పించాలి. పూర్తిగా ఉర్దూ మాధ్యమంలో బోధించే పాఠశాలలకు పూర్తి భద్రత కల్పించాలి. అయితే, రాష్ర్టాల్లో ఉర్దూను 2వ అధికార భాషగా ప్రకటించాలనే డిమాండ్‌ను కచ్చితంగా తిరస్కరించాలి.
భారత దేశంలోని మహిళల స్థాయిని, హక్కులను ఒకే ఒక ఉమ్మడి పౌరస్మృతి ప్రకారం నిర్దేశించాలి. ముస్లిం మహిళలు ధరించే పరదా (బురఖా) విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలి. దేశ ఆర్థిక, వ్యవసాయరంగాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే గోవధనిషేధంపై నిర్ణయం తీసుకోవాలి.
కుటుంబ నియంత్రణను పౌరులందరికీ తప్పనిసరి చేయాలి. తమ మతం కారణంగా ఈ సంస్కరణలను వ్యతిరేకించే ముస్లింలకు షరియా చట్టంలోని అన్ని అంశాలను కచ్చితంగా వర్తింపజేయాలి. భారతదేశ ప్రజలందరినీ లౌకిక విలువలతో సమైక్య పరచడం ఒక్కటే భారత మతతత్వ సమస్యకు పరిష్కారం అని ప్రతిపాదించారు. ఇస్లాం మతంలో సంస్కరణల ఆవశ్యకతను హమీద్ దల్వాయి ఈ పుస్తకంలో వివరించాడు. నిజమైన ప్రజాస్వామ్య, లౌకికవాదం మన దేశంలో వేళ్లూనుకోవాలంటే హమీద్ దల్వాయి రచనలు ప్రతీ భారతీయుడు చదివి తీరాలి.
– నచికేత