చెప్పిన అబద్ధం చెప్పకుండా కొత్త అబద్ధాలతో ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేయడం, అది విఫలమైతే మాట మార్చడం కాంగ్రెస్ నేతలకు, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పరిపాటిగా మారింది. కర్ణాటక, తెలంగాణలో గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ నాయకులు మోసం చేశారు. మరోసారి మహారాష్ట్రలోనూ గ్యారెంటీల పేరుతో మోసం చేయబోయి బొక్కబోర్లా పడ్డారు. అక్కడ మహిళలకు ప్రతి నెల రూ.3 వేలు ఇస్తామని, రైతులకు రుణమాఫీ చేస్తామని హామీలు గుప్పించగా.. తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ నిర్వాకం తెలుసుకొన్న మహారాష్ట్ర ప్రజలు వారిని గట్టిగా తిరస్కరించారు.
తెలంగాణ సీఎంతో సహా పలువురు రాష్ట్ర మంత్రులు అక్కడికి వెళ్లి ప్రచారం చేస్తే ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా రేవంత్‌రెడ్డి 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం చేస్తే వాటిలో ఒక్క సీటులోనే కాంగ్రెస్ గెలిచింది. ఆయన మూడు సార్లు మహారాష్ట్ర వెళ్లి వారం రోజుల పాటు మకాం వేసినా ఫలితం లేకపోయింది. అక్కడ ఎదురైన పరాభవం తర్వాతనైనా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు జ్ఞానోదయం కలిగినట్టు లేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అమలుచేస్తామని జనాన్ని నమ్మించే ప్రయత్నం చేసినా వారు నమ్మలేదు.
మహారాష్ట్ర ఫలితం అలా ఉంటే, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా, ఇచ్చిన హామీలను అమలుచేయకుండా విస్మరించారు. మాట తప్పి కూడా, తాము పాలించిన ఏడాదిలో ఏదో ఘనకార్యం చేసినట్టు ఇప్పుడు వాడవాడలా సంబురాలు చేసుకొనేందుకు సమాయత్తం అవుతోంది తెలంగాణ కాంగ్రెస్. తాను ముఖ్యమంత్రి కాగానే మొదటి సంతకం 6 గ్యారెంటీలపైనే పెట్టి, వాటికి చట్టబద్ధత కల్పిస్తామని, బాండ్ పేపర్‌తో ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయండని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించలేదు.
ఎన్నికల సమయంలో 420 హామీలిచ్చారు. 11 నెలల పాలనలో ప్రజలకు ఏం చేశారో, ఏం సాధించారో ఒక స్పష్టత ఇవ్వకుండా సంబురాలు జరుపుకోవడంపై అనేక సందేహాలొస్తున్నాయి. ఆరు గ్యారెంటీలపై మోసం చేయడంతో పాటు పెంచుతామన్న పింఛన్లు, ఇస్తామన్న నిరుద్యోగ భృతి, విద్య భరోసా కార్డు, ఉద్యోగాలు ఏవీ రాలేదు. ఇప్పటివరకు ఒక విద్యార్థికి కూడా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ డబ్బులివ్వలేదు. దీంతో ఉత్తీర్ణులైన విద్యార్థులకు కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాయి.
రైతులకు రూ.2 లక్షల వరకు వర్తించేలా, రూ.31 వేల కోట్ల మేర రుణాలను మాఫీ చేస్తామని చెప్పి కేవలం రూ.17 వేల కోట్లతో సరిపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను దగా చేసింది. చేసిన అప్పులు తిరిగి కట్టలేక రాష్ట్రంలో 50 శాతం మంది రైతులు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఏర్పడింది. భూమి సాగుచేసే ప్రతి రైతుకు, రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు రూ.15 వేలు ఇస్తామన్న హామీ నెరవేర్చకపోవడంతో తెలంగాణ రైతులు కాంగ్రెస్ చేతిలో దగా పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారడంతో వారు రేవంత్ సర్కార్‌పై భరోసా కోల్పోయారు. పత్తికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి, ఇప్పటికీ ఇవ్వకుండా దాన్ని బోగస్ హామీగా మార్చారు. పత్తి కొనుగోలుపై ఇప్పటివరకూ ముఖ్యమంత్రి సమీక్ష చేయలేదు. పత్తితో పాటు మిర్చి రైతులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. కాంగ్రెస్ పాలనలో రైతులు నష్టపోయి, దళారులు లాభపడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏడాది వ్యవధిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నిరుద్యోగులకు రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని రాహుల్ గాంధీ ప్రజలను నమ్మించి, అధికారంలోకి వచ్చాక యువతను మోసం చేశారు. అశోక్‌నగర్ సెంటర్లో ఉద్యోగాల కోసం యువత ఉద్యమిస్తే పోలీసులు లాఠీలు ఝళిపించి, తలలు పగులగొట్టారు. అమ్మాయిలు అని కూడా చూడకుండా ఈడ్చుకెళ్లి జైలు పాల్జేశారు.
రాష్ట్రంలో వృద్ధులకు రూ.4 వేల చొప్పున పింఛన్ ఇస్తామని చెప్పి మాట తప్పారు. రూపాయి కూడా పెంచలేదు. మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు రూ.2,500 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. యువత, రైతులు, మహిళలు ఇలా విభిన్నవర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. కాంగ్రెస్ మోసాన్ని ఎక్కడికక్కడ జనం నిలదీస్తూ, ఇచ్చిన హామీలను అమలుపరచమని
అడుగుతుంటే అసహనంతో వారిపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ పేరుతో ‘హైడ్రా’ తీసుకొచ్చి నగరంలో ఇండ్లను నేలమట్టం చేస్తున్నారు. మూసీ సుందరీకరణ పేరు తో పేద ప్రజలు, దళితులు కట్టుకున్న ఇండ్లను కూల్చివేస్తున్నారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు వ్యయం అంచనాను లక్షా 50 వేల కోట్ల రూపాయలకు పెంచి, ఆస్థాన గుత్తేదారుల జేబులు నింపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాజెక్టుకు రూపురేఖలే లేవు. సమగ్ర ప్రాజెక్టు లేదు. పర్యావరణ ప్రభావం అంచనా లేదు. ఏదీ లేకుండానే… నిరుపేదల ఇండ్లు కూల్చే కార్యక్రమాన్ని మాత్రం ఠంచన్‌గా చేపట్టారు. కాంగ్రెస్ అంటేనే పేదల వ్యతిరేక ప్రభుత్వమని మరోమారు రుజువు చేశారు. దళితబంధు పథకాన్ని హుజూరాబాద్‌లో కేసీఆర్ ప్రారంభించి 18,500 దళిత కుటుంబాలకు సహాయ సహకారాలు అందజేశారు. ఈ పథకం కింద రెండో విడత డబ్బుల విడుదలపై ప్రశ్నించిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మీద అరాచకానికి పాల్పడ్డారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాలను ప్రవేశపెట్టడం మాట దేవుడెరుగు, ఇప్పటికే ఉన్న పథకాలను సైతం అమలు చేయలేకపోతున్నది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని లగచర్లలో జరిగిన ప్రభుత్వ దౌర్జన్యకాండను ప్రజలు గమనిస్తున్నారు. ఫార్మా విలేజీ కోసం బలవంతంగా భూ సేకరణకు పాల్పడటంపై రైతులు తిరగబడితే దౌర్జన్యంతో పోలీసులు వారిని భయ భ్రాంతులకు గురిచేసి, భూములు గుంజుకొనే ప్రయత్నం చేశారు. అయితే, రైతులు ఎదురు తిరగటం, ఈ అంశం జాతీయస్థాయిలో అలజడి సృష్టించడంతో రేవంత్‌రెడ్డి మాట మార్చారు. కొడంగల్‌లో ఏర్పాటుచేసేది ఫార్మాసిటీ కాదు, ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నారు. జూలై 19వ తేదీన ఇచ్చిన గెజిట్‌లో ఫార్మాసిటీ అని స్పష్టంగా పేర్కొన్నారు. ఆ గెజిట్‌ను వాపస్ తీసుకోకుండా ఇలాంటి అబద్ధాలతో ఎంతకాలం పబ్బం గడుపుతారు? తనను ఎన్నుకున్న ప్రజల వద్దకు వెళ్లి, వారికి నచ్చజెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి లేదా? సామరస్యంగా సమస్యను పరిష్కరించే సహనం లేదా? పచ్చటి పంట పొలాలను తొండలు గుడ్లు పెట్టని జాగలు అంటూ.. అబద్ధాలతో ఎవరి నోరు మూయించాలనుకుంటున్నారు?
కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేశారని, ఆ మొత్తాన్ని బీఆర్ఎస్ నాయకులు స్వాహా చేశారని ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రాజెక్టు కూలిపోయేందుకు సిద్ధంగా ఉందని, దానిలో ఒక ఎకరాకు కూడా కొత్తగా సాగునీరు ఇవ్వలేదంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. మరోవైపు కాళేశ్వరం నీళ్లతో మూసీ పునరుజ్జీవం చేస్తామని, ఇవే నీళ్లను హైదరాబాద్ తాగునీటి వసతి కోసం వినియోగిస్తామని చెప్తున్నారు. కూలిపోయే ప్రాజెక్టు నుంచి నీళ్లిస్తారా? అదెలా సాధ్యం ప్రజలు ఏ మాటలు నమ్మాలో రేవంత్‌రెడ్డే చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయే దశలో ఉందని చెప్తున్న కాంగ్రెస్ నేతలు కొండపోచమ్మ, మల్లన్నసాగర్ల నుంచి హైదరాబాద్ నగరానికి 20 టీఎంసీల నీటిని మిషన్ భగీరథ ద్వారా ఇవ్వాలని ఎలా ప్రణాళికలు చేస్తున్నారో అర్థం కావడం లేదు. పరస్పర విరుద్ధమైన మాటలతో పచ్చి అబద్ధాలు చెప్తూ పబ్బం గడుపాలని ఈ ప్రభుత్వం చేస్తున్న యత్నాలకు అంతేలేకుండా పోతున్నది. కుప్పకూలిందని చెప్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను ఇదే కాంగ్రెస్ సర్కార్ మల్లన్నసాగర్ నుంచి, రంగనాయక్‌సాగర్ నుంచి పంట పొలాలకు విడుదల చేయడం గమనార్హం.
తెలంగాణలో 1.61 కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండితే అది తమ గొప్పతనం అని కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. 2014లో తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తే, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో దాన్ని 141 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచి రాష్ర్టాన్ని ధాన్యాగారంగా మార్చింది. 50 ఏండ్లు కాంగ్రెస్ పార్టీ, 16 ఏండ్లు తెలుగుదేశం పార్టీ పాలనలో ఎందుకని కేవలం 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే తెలంగాణలో పండిందో చెప్పగలరా? తెలంగాణ నుంచి రికార్డు స్థాయిలో కోటి 60 లక్షల టన్నుల ధాన్యం వస్తే.. ఇది కాళేశ్వరం గొప్పతనం కాదని, 11 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ గొప్పతనమని చెప్పుకోవడానికి వారికి కనీసం సిగ్గయినా ఉండాలి.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్ల పాలనాకాలంలో తెలంగాణ ఆకాశమంత ఎత్తుకు ఎదిగితే, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలనాకాలంలో రాష్ట్రం అధఃపాతాళంలో కూరుకుపోయింది. ఇందుకు ఎన్నో కారణాలున్నా, మచ్చుకు కొన్ని మాత్రమే ఇక్కడ చర్చించాను.
కాంగ్రెస్ సర్కార్ తెలంగాణలో అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తున్నా, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, పచ్చి అబద్ధాలు-మోసపూరిత మాటలతో కాలయాపన చేస్తున్నది. రేవంత్ పాలనలో ప్రజలు ముఖ్యంగా బాధితులు తమకెదురైన అన్యాయాన్ని గట్టిగా నిలదీస్తే వారిపై దౌర్జన్యాలు చేస్తూ, కేసులు బనాయిస్తున్నారు. పూటకో మాట, రోజుకో మాట మారుస్తూ ఎంతకాలం ప్రజలను నమ్మించి మోసం చేస్తారు? ఉద్యమాలకు నెలవైన తెలంగాణలో ప్రజల సహనానికీ ఒక హద్దు ఉంటుంది. ప్రజల సహనాన్ని పరీక్షిస్తే వారి తరఫున ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ సదా సిద్ధంగా ఉన్నది. మున్ముందు మరిన్ని ప్రజా ఉద్యమాలను చేపట్టడం ఖాయం.
(వ్యాసకర్త: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే)
– తన్నీరు హరీశ్‌రావు