ఇటీవల తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డిల ఫొటోలు పక్కపక్కనే పెట్టి ‘విద్య, వైద్యమే ఇక ప్రభుత్వాల ప్రాధాన్యం.. సమర్థించేవారు షేర్ చేయండి!’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్టులను షేర్ చేసేది ఇద్దరు సీఎంలు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల కార్యకర్తలు, మద్దతుదారులు, అభిమానులు, కులాభిమానులే. ఈ ప్రాధాన్యాలను కాసేపు పక్కనపెడితే.. ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన వీరిద్దరి ప్రాధాన్యాలు ఏడాదిన్నరలోనే మారడం వెనుక ఆంతర్యం ఏమిటి?
తెలంగాణ, ఏపీలలో కాంగ్రెస్, టీడీపీలు ఆరు గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాయి. ఏడాదిలోనే రెండు ప్రభుత్వాలు చెరో రూ.లక్ష కోట్లకు పైగా అప్పు చేశాయి. అయినా ఆరు గ్యారెంటీలు అమలుకు నోచుకోలేదు. గురుశిష్యులిద్దరూ తమ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడిన నిస్పృహ, నిరాశాపూరిత మాటలు, సందర్భాలు వేరు కావచ్చు. కానీ, వారి మాటల వెనకున్న అర్థం ఒక్కటే. అంతరార్థం మాత్రం చేతులెత్తేశామని చెప్పడమే. బహుశా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న పోస్టుల వెనుక ఉన్న పరమార్థం డైవర్షన్ పాలిటిక్స్ కావచ్చు.
చిత్రంగా డైవర్షన్ పాలిటిక్స్‌లో వీరిద్దరి రాజకీయ గురువు మన ప్రధాని మోదీ కావడం విశేషం. ప్రజల్లో అసంతృప్తి పెరిగినప్పుడు దర్యాప్తు సంస్థలను ప్రతిపక్షాలపైకి ఉసిగొల్పడం, విచారణల పేరిట ఇబ్బంది పెట్టడం, అవసరమైతే అరెస్టు చేయడం, జైళ్లలో వేయడం, వారి ప్రతిష్టను దెబ్బతీయడం.. ఢిల్లీ నుంచి గల్లీ దాకా షరామామూలే. ఇది గుజరాత్ మోడల్ రాజకీయ విద్య మరి! ప్రతిపక్ష నేతలు, గత ప్రభుత్వానికి విశ్వాసంగా పనిచేసిన అధికారులు, రిటైర్డ్ అధికారులను అరెస్టు చేయడం లాంటి సరికొత్త నిర్బంధ విధానం రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట ఏపీలో నడుస్తున్నది. ఢిల్లీ పాలకులను ఆదర్శంగా తీసుకొని అక్కడ లిక్కర్ కుంభకోణాన్ని తెరమీదికి తీసుకొచ్చారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట విచారణ తంతును నడిపిస్తున్నారు. తెలంగాణలోనూ రిటైర్డ్ అధికారులు, ఉన్నతాధికారుల ఇండ్లపై ఏసీబీ దాడులు, పోలీసు విచారణ కొనసాగుతున్నది. ప్రతిపక్ష నేతలను అందులోకి లాగేందుకు శతవిధాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ప్రభుత్వాలు మారితే తమ గతేమిటని ఇరు రాష్ర్టాల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు లోలోన ఆందోళన చెందుతున్నారు.
సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నందున చంద్రబాబు, లోకేష్‌లు ఢిల్లీకి వెళ్లి మోదీ, అమిత్ షాలను అప్పుడప్పుడు కలుస్తున్నారు. కానీ, మన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం గతంలో ఏ తెలుగు ముఖ్యమంత్రి వెళ్లనన్ని సార్లు ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారు. ఆ పర్యటనల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో ఆయనకు తప్ప మరొకరికి తెలియదు.
ఇరు రాష్ర్టాల్లో భూసేకరణ విధానంలోనూ పెద్దగా తేడా లేదు. ప్రమాదకరమైన పరిశ్రమలకు భూములను కేటాయించడాన్ని నిరసిస్తూ రెండు ప్రాంతాల్లోనూ ప్రజలు ప్రతిఘటిస్తున్నారు. ఇక భూముల కేటాయింపుల్లోనూ సారూప్యత కనిపిస్తున్నది. విశాఖపట్నంలో కోట్ల రూపాయల విలువైన భూములను ఓ కంపెనీకి అక్కడి పాలకపక్షం గజం రూపాయి చొప్పున కట్టబెట్టిందనే ఆరోపణలుండగా, తెలంగాణలోనూ లీజు పేరుమీద అనామక సంస్థలకు విలువైన భూములను కట్టబెడుతున్నారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ భూముల పందేరం గతంలో పట్టణాల్లోనే కనిపించేది. ఇప్పుడు ఆ జాఢ్యం గ్రామాలకూ పాకిందని చెప్పవచ్చు. ఇలా రెండు రాష్ర్టాల పాలకులు వేరైనా, పాలనా విధానంలో మాత్రం పెద్దగా తేడా లేదు. ఇద్దరికి ‘నోటుకు ఓటు’ అనుబంధం ఉన్నది. వీరిద్దరికీ కేంద్రంలో మోదీ అవసరం ఉండనే ఉన్నది.
– (వ్యాసకర్త: రచయిత, సీనియర్ జర్నలిస్టు)
ఎన్.తిర్మల్ 94418 64514