మంచి పుస్తకాలు మన ఆలోచన పరిధిని పెంచుతాయి. మంచి ఆలోచనలు కలిగిస్తాయి. మంచి ఆలోచనలు సమాజంపై మంచి ప్రభావాన్ని చూపుతాయి. ప్రపంచాన్ని శాసిస్తున్న అభివృద్ధి చెందిన దేశాల్లో పుస్తక పఠనం చేసేవారి సంఖ్య ఎక్కువ. పఠనం వల్ల ఒత్తిడి దరి చేరదని, ఆయుష్షు పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది. కానీ నేటి యువత, విద్యార్థులు స్మార్ట్ ఫోన్ మాయలో పడి పుస్తక పఠనాన్ని అటకెక్కిస్తోంది. కానీ పుస్తకాలు జ్ఞాన ప్రదాతలని, నిజమైన నేస్తాలని తెలుసుకోవాలి.
పుస్తకాలు చదివే అలవాటున్న వాళ్లలో సామాజిక స్పృహ మెండుగా ఉంటుంది. పుస్తక పఠనం వల్ల పద సంపద పెరుగుతుందని ప్రముఖ రచయితల అభిప్రాయం. పఠనం వల్ల జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. మెదడు చురుగ్గా పని చేయాలని కోరుకుంటే పుస్తకాలతో స్నేహం చేయాలి. ప్రపంచంలో అద్భుతాలు చేసిన వారంతా దాదాపు పుస్తకాల ప్రేమికులే. చరిత్రలో విజయాలు సాధించిన వారంతా పుస్తకాల పురుగులే! సంపన్నుడైన నిరక్ష్యస్యుడి కంటే చదువుకున్న పేదవాడు గొప్పవాడని పెద్దలు చెప్తారు. జ్ఞానాన్ని ఆర్జించడం ప్రతి ముస్లిం స్త్రీ, పురుషుల విధి అని మహమ్మద్ ప్రవక్త తెలిపారు. ఇతర మతాలు కూడా జ్ఞాన సముపార్జనకు ప్రాధాన్యమిచ్చాయి. ఆ జ్ఞానాన్ని సముపార్జిచాలంటే పుస్తకాలు చదవాలి.
పుస్తకాలు, మేగజైన్లు, దిన పత్రికలు ఇలా జ్ఞానాన్ని అందించే అన్నింటిని చదవడం అలవాటు చేసుకోవాలి. పఠనానికి నిజమైన అర్థం అదే. మంచి పుస్తకాలనే ఎంపిక చేసుకుని చదవాలి. మన విజ్ఞానాన్ని పెంచే, నైతికతను ఇనుమడింపజేసే పుస్తకాలను చదవాలి. నవలలు, కథల పుస్తకాలు, చరిత్ర గ్రంథాలు, శాస్త్ర పరిశోధనలు, జీవిత చరిత్రలు ఇలా వివిధ అంశాలకు సంబంధించిన పుస్తకాలను తరచూ చదవాలి. విద్వేషం కలిగించే, చెడు మార్గం పట్టించే పుస్తకాల జోలికి వెళ్లకూడదు. కానీ నేటి కాలంలో చాలా మంది పిల్లలు కేవలం పాఠ్య పుస్తకాలు చదవడానికే పరిమితమవుతున్నారు. పాఠ్య పుస్తకాలు చదవడం వల్ల పరీక్షల్లో మంచి మార్కులతో పాసవగలరు. మహా అయితే ర్యాంకులు తెచ్చుకుంటారు. కానీ నైతిక విలువలు, సామాజిక సంబంధాలు, అనుబంధాలు, బంధుత్వాల గొప్పతనాన్ని గురించి పాఠ్య పుస్తకాలు చెప్పలేవు. విషయ పరిజ్ఞానం, వివిధ సబ్జెక్టులకు సంబంధించిన పుస్తకాలు చదివితే వృత్తి జీవితంలో రాణించవచ్చు. కానీ మంచి కుటుంబ సభ్యుడిగా, పౌరుడిగా మెలగాలంటే జీవిత పరమార్థాన్ని బోధించే పుస్తకాలు చదవడం అనివార్యం.
ఈ నేపథ్యలో చిన్న వయస్సు నుంచే పుస్తక పఠనం అలవాటు కావాలి. ఇందుకోసం బడుల్లో బుక్ రీడింగ్ కమిటీలు వేయాలి. పాఠ్య పుస్తకాలతోపాటు సామాజిక అంశాలు, ధార్మిక విషయాలతో కూడిన పుస్తకాలను విద్యార్థులు చదివేలా ప్రోత్సహించాలి. ఇతర అభిరుచుల(హాబీలు) కంటే పుస్తక పఠనం ఉత్తమమైనదని విద్యార్థులకు బోధించాలి. వృత్తిగత, వ్యక్తిగత, సామాజిక జీవితంలో రాణించాలంటే విద్యార్థులైనా, యువతరమైనా, మహిళలైనా, పిల్లలైనా, పెద్దలైనా ఎవ్వరైనా పుస్తకాలు చదవాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతోమంది మేధావులు, వ్యాపారవేత్తలు, శాస్త్రవేత్తలకు పుస్తకాలు చదవందే వాళ్ల రోజు ముగియదు. పుస్తకాలు చదవడం వల్ల మనలో తిష్ఠ వేసిన అజ్ఞానం దూరమై విజ్ఞానం పెరుగుతుంది. కాలేజీల్లో, యూనివర్సిటీల్లో, స్కూళ్లల్లో నేర్చుకోని విషయాలు పుస్తకాలు చదివి తెలుసుకోవచ్చు. జీవితంలో విజయాలు సాధించేందుకు విజయ గాథలు చదవాలని అమెరికా రచయిత జిమ్ రోమ్ సూచిస్తారు. పుస్తకాలు చదవడం వల్ల వ్యక్తిగత సామర్థ్యాలు పెంచుకోవచ్చు. ఏదైనా విషయం పట్ల సదవగాహన ఏర్పరుచుకోవచ్చు. ఏ విషయాన్ని అయినా సరిగ్గా ఊహించుకోవచ్చు. బుక్ రీడింగ్‌తో ఏ రంగంలోనైనా మన నైపుణ్యాలను సానబెట్టుకోవచ్చు. అయితే కేవలం పుస్తకాలను చదువుకుంటూ పోవడం వల్ల మనలో మార్పు రాదు. చదివిన మంచి విషయాలను ఆచరించాలి. అప్పుడే మనం అనుకున్నది సాధ్యమవుతుంది.
పుస్తకాలు చదవడం వల్ల కేవలం జ్ఞానమే దొరకదు. మానసిక, శారీరక ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కంటి నిండా నిద్రపడుతుంది. కాబట్టి ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో అనవసరంగా సమయం గడపకుండా ఆ సమయాన్ని పుస్తక పఠనానికి కేటాయిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. పుస్తకానికి మించిన నేస్తం మరొకటి ఉండదు. పుస్తకానికి మించిన గురువు మరొకరు ఉండరు! జీవితంలో ఎదురయ్యే కష్టాలకు, సవాళ్లకు పుస్తకాలు పరిష్కారం చూపిస్తాయి. డబ్బు, సంపద, ఆరోగ్యం, సౌందర్యం ఇవన్నీ ఏదో ఒకరోజు మనల్ని వీడి వెళ్లిపోతాయి. కానీ మనం అర్జించిన జ్ఞానం ఒక్కటే కడ వరకూ మన వెన్నంటి ఉంటుంది. పుస్తకాలు చదవడం వల్ల బుద్ధి కుశలత పెరిగి సమస్యలను పరిష్కరించే సామర్థ్యం మెరుగవుతుంది. పుస్తక పఠనం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. వయస్సు పైబడ్డాక వచ్చే అల్జీమర్ లాంటి వ్యాధులను నిరోధించుకోవచ్చు.
పుస్తకాలను చదవడం వల్ల కెరీర్, మానవ సంబంధాలు, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయాలు… ఇలా జీవితంలోని ఏ అంశంలోనైనా, ఏ రంగంలోనైనా రాణించవచ్చు. పుస్తకాలు చదివేంత తీరిక లేకపోతే ఆడియో రూపంలో ఉన్న పుస్తకాలను వినాలి. అంత తీరిక కూడా లేకపోతే ఆ పుస్తకాల సారాన్ని వీడియోల్లో తెలుసుకోవాలి. ఆధునిక సాంకేతికత, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు అనేక పుస్తక ప్రచురణ సంస్థలు ఇ-పుస్తకాలను, పీడీఎఫ్ పుస్తకాలను, పుస్తకాల యాప్‌లను అందుబాటులోకి తెచ్చాయి. స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ ఎక్కువగా ఉపయోగించేవారు ఈ సౌకర్యాలను ఉపయోగించుకోవచ్చు. కానీ వీటన్నింటి కంటే ముద్రించిన పుస్తకాలు కొని చదవడమే ఎంతో మేలు. పుస్తకం హస్త భూషణం. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని ప్రముఖ రచయిత కందుకూరి వీరేశలింగం చెప్పిన మాటలు గుర్తుంచుకోవాలి. పుస్తక పఠనాన్ని దిన చర్యలో భాగం చేసుకోవాలి.
-ముహమ్మద్ ముజాహిద్
96406 22076