INSV Kaundinya : సముద్రయానంలో భారత్ మరో అరుదైన ఘనత సాధించింది. INSV కౌండిన్య అనే కుట్టు నౌక.. పూర్తిగా తెరచాపల సాయంతో పయనించి మస్కట్‌కు చేరుకుంది. ఇటీవల గుజరాత్‌లోని పోరుబందర్ నుంచి బయలుదేరిన ‘ఐఎన్ఎస్వీ కౌండిన్య (INSV Kaundinya)’.. బుధవారం ఒమన్‌లోని మస్కట్‌కు సక్సెస్‌ఫుల్‌గా రీచ్ అయ్యింది. ఎలాంటి ఇంజిన్ లేకుండా పూర్తిగా తెరచాపల సాయంతో పయనించి తన గమ్యాన్ని ముద్దాడింది.
ఎలాంటి రేకులు, మేకులు వాడకుండా చెక్కలు, కొబ్బరితాళ్లతో తయారు చేసిన ఈ నౌక దాదాపు 1400 కిలోమీటర్ల దూరపు ప్రయాణాన్ని 17 రోజుల్లో పూర్తి చేసింది. మస్కట్‌కు చేరుకున్న అనంతరం ఓడలోని సిబ్బంది సంబురాలు చేసుకున్నారు. అజంతా గుహల్లోని 5వ శతాబ్దం నాటి పెయింటింగ్‌లో ఉన్న ఒక నౌక నుంచి ప్రేరణ పొందిన ఆధునిక భారత నిపుణులు.. ‘ఐఎన్ఎస్వీ కౌండిన్య’ రూపంలో దాన్ని పునఃసృష్టించారు.
ఈ నౌక తయారీలో పురాతన విధానాలనే అవలంభించారు. లోహాలు, మేకులను ఉపయోగించలేదు. చెక్కలను వినియోగించారు. ఆ చెక్కలను కొబ్బరి పీచుతో తయారుచేసిన తాళ్లతో గుదిగుచ్చారు. అందుకే ఆ నౌకను ‘స్టిచ్డ్ షిప్’ గా కూడా పిలుస్తున్నారు. ఇదిలావుంటే సముద్ర ఉప్పు నీటి నుంచి రక్షణ కోసం ఈ నౌకకు సహజసిద్ధ జిగురు పూతను పూశారు.