గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో కొంతమంది ఆకతాయిలు ‘కుల’గజ్జిని ప్రదర్శిస్తూ చేసిన కామెంట్లపై తెలంగాణ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.పేర్ల పక్కన కులాన్ని తగిలించుకొని చేసే ఇలాంటి కామెంట్లు తెలంగాణ జెన్‌జీకి అస్సలు నచ్చలేదు. అందుకే వారిని సోషల్ మీడియాలో రఫ్పాడిస్తున్నారు. తెలంగాణలో.. ముఖ్యంగా హైదరాబాద్‌లో మొదటి నుంచి కులపిచ్చి ఉండదు. ఇక్కడిది అందరినీ కలుపుకొనిపోయే ‘అలయ్-బలయ్’ సంస్కృతి.
హైదరాబాద్ సంస్కృతి, ఆహారపు అలవాట్లు, జీవనశైలికి స్పష్టమైన భౌగోళిక కారణాలు ఉన్నాయి. ‘అమెరికన్ డ్రీమ్’ వర్సెస్ ’హైదరాబాద్ డ్రీమ్’.. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన సామాజిక కోణం ఉన్నది. నేటి మిలీనియల్స్ (1981-1996 మధ్య జన్మించినవారు), జెన్‌జీకి ‘అమెరికన్ డ్రీమ్’ ఎలాగో, అప్పట్లో ఆంధ్రా వారికి ‘హైదరాబాద్ డ్రీమ్’ అలా ఉండేది. హైదరాబాద్‌లో జాబ్ సంపాదించడం, ఇల్లు కట్టుకోవడం, ఆస్తులు కూడబెట్టడం వారి జీవితాశయాలు. పైసా పైసా కూడబెట్టి ఆస్తులు కొనడమే లక్ష్యంగా బతికేవారు. అందుకే బంధువులు, స్నేహితులకు టీ ఇవ్వడం, భోజనం పెట్టడం లాంటివి కూడా కొన్నిసార్లు వాళ్లకు దుబారా ఖర్చుల్లానే అనిపించేవి. కాస్త స్థోమత ఉన్నవారైతే, ఆంధ్రాలో పొలాలు అమ్మి ఇక్కడ ప్లాట్లు కొనడం సర్వసాధారణం. తెలంగాణ వారికి హైదరాబాద్‌లో సెటిల్ అవ్వాలనేది ఒక పెద్ద కల ఏమీ కాదు. ఎందుకంటే వారికి హైదరాబాద్ ఎప్పుడూ దూరం అనిపించలేదు. ఇంట్లో శుభకార్యం జరిగినా, అనారోగ్యం వచ్చినా హైదరాబాద్ వారికి ఒక సహజమైన గమ్యస్థానం (నేచురల్ డెస్టినేషన్). అందుకే వారిలో ‘ఉన్నన్ని రోజులు దర్జాగా ఉందాం, కుదిరితే ఉంటాం.. లేదంటే ఊరెళ్లిపోతాం‘ అనే స్వభావం ఎక్కువగా ఉండేది.
ఒకప్పుడు హైదరాబాద్ గల్లీల్లో మగవారు లుంగీలు కట్టుకుని తిరిగే సంస్కృతి లేదు. చదువుకోవడానికి వచ్చిన యువకులు పైజామాలు వేసుకునేవారు, పెద్దవారైతే ప్యాంటు వేసుకుని బయటకు వచ్చేవారు. మటన్ షాపునకు వెళ్లాలన్నా, సెలూన్‌కు వెళ్లాలన్నా ఇదొక అప్రకటిత డ్రెస్ కోడ్‌గా పాటించేవారు.
ఇక్కడి జీవనశైలి, వేషధారణలో ఒక రకమైన హుందాతనం అంతర్భాగంగా ఉండేది. కాలనీల్లోని షాపుల ముందు లుంగీలతో ప్రజలు కనిపించడం ఎన్టీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత (పెరిగిన వలసల వల్ల) మొదలైందని చెప్పవచ్చు. ఒకప్పుడు ఆదివారం వచ్చిందంటే హైదరాబాద్ రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉండేవి. షాపులన్నీ మూసేసి, ప్రజలు ఆ సెలవుదినాన్ని ప్రశాంతంగా గడిపేవారు. కానీ ఎన్టీఆర్ ప్రభుత్వ హయాం తర్వాత వలసలతో పాటు ఈ పని సంస్కృతి కూడా పూర్తిగా మారిపోయింది. ఆర్థిక లెక్కలు మొదలయ్యాయి. హైదరాబాద్ ప్రశాంతతను కోల్పోయింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ వలసలు, వ్యాపారాల ఆధిపత్యం మీద లోతైన చర్చలు జరిగినప్పుడు కొందరు ఆంధ్రా ప్రాంతం వారు ఒక వాదన తెచ్చేవారు.. ‘మా వాళ్లు ఇక్కడ ఇంతమంది స్థిరపడి ఉన్నప్పుడు, వారి అవసరాలు తీర్చడానికి మావాళ్లే వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటే తప్పేంటి?’ ప్రశ్నించేవారు. దీనికి తెలంగాణవాదులు చాలా పదునైన, లాజికల్ సమాధానం ఇచ్చారు.
తెలంగాణ నుంచి ఏటా వేలాది మంది భక్తులు తిరుమల వెళ్తున్నారు కదా? మరి వారి అవసరాల కోసం తెలంగాణ వాళ్లను అక్కడ ఏమైనా బిజినెస్ చేసుకోనిస్తారా? అని ప్రశ్నించడంతో ఆ వాదనలకు చెక్ పడింది. ఒక్కమాటలో చెప్పాలంటే…హైదరాబాద్ బాగానే విస్తరించి ఉండొచ్చు, వ్యాపారాలు పెరిగి ఉండొచ్చు. కానీ ఈ క్రమంలో ఇక్కడి సంస్కృతి, భాష, బతికే విధానం పూర్తిగా ఇతరుల గుప్పిట్లోకి వెళ్లిపోయాయి. మొదట్లో చిన్నచిన్న అలవాట్లు, వేషధారణలతో మొదలైన ఈ మార్పు.. రానురాను ఆర్థిక దోపిడీకి దారితీసింది. స్థానికులకు దక్కాల్సిన ఉద్యోగాలు, ఉపాధి లేకుండా చేసింది. కేవలం వ్యాపారం, డబ్బు సంపాదనే లక్ష్యంగా వచ్చిన వలసల వల్ల… ఇక్కడి ప్రజలు తమ సొంత గడ్డపైనే పరాయివాళ్లుగా మారిపోవాల్సి వచ్చింది. ఎన్నో ఏండ్లుగా జరుగుతున్న ఈ అన్యాయం, వివక్ష తమను అణగదొక్కుతున్నారనే బాధే.. మలిదశ తెలంగాణ ఉద్యమానికి బలమైన కారణమైందని కచ్చితంగా చెప్పవచ్చు.
ఇక, సోషల్ మీడియాలో కుల అహంకారాన్ని ప్రదర్శించే ఆకతాయిల పోస్టుల విషయానికి వద్దాం.. వీళ్లు తెలంగాణ భాషను, యాసను వెక్కిరించే ప్రయత్నం మానుకుని… ముందు తమ ప్రాంతంలో వేళ్లూనుకుపోయిన అత్యంత జుగుప్సాకరమైన సామాజిక ఆచారాలపై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అదే… ద గ్రేట్ ‘రికార్డింగ్ డ్యాన్సులు’. వింతైన విషయం ఏమిటంటే, ఇదొక ఊరి పండుగలాగా అందరూ కలిసి కూర్చుని ఎంజాయ్ చేసే దౌర్భాగ్యపు అలవాటు. ఇంత బాహాటంగా జరుగుతున్నా అక్కడి మహిళలు ఈ సంస్కృతిని ఎందుకు ప్రతిఘటించడంలేదో అర్థం కాదు. వీటికి రాజకీయ పార్టీల నాయకుల అండదండలు ఉండటం మరీ విడ్డూరం. ఆధునిక ప్రపంచంలో, జెన్‌జీ తరంలో కూడా ఈ తరహా సంస్కృతి ఇంకా బలపడుతున్నదంటే… సగటు ఆంధ్రా యువత ఆలోచనా విధానంలో ఎక్కడో పెద్ద లోపం ఉన్నట్టే స్పష్టంగా కనబడుతున్నది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లి, రికార్డింగ్ డ్యాన్సులు చూసి, కోడిపందాల్లో డబ్బులు తగలేసి… పండుగవ్వగానే మళ్లీ హైదరాబాద్ వచ్చే ఆ యువత, తెలంగాణ సంస్కృతి, యాస, భాష గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.సిరారె