ఢిల్లీ పాలకుల గుండెల్లో రైళ్లు
ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ ఓటు ద్వారా పాలకులను ఎన్నుకుంటారు. కానీ పాలకులే ఓటర్లను ఎంచుకునే దుస్థితి వస్తే..! ఎవరు ఓటు వేయాలో, ఎవరు వేయకూడదో నిర్ణయిస్తే..! ఎన్నికల క్రీడలో అంపైర్‌గా ఉండాల్సిన ఎన్నికల సంఘం మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఉదంతాలు కనిపిస్తే..! అది అప్రజాస్వామిక పరిణామాలకు దారితీస్తుంది. నేడు దేశంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరిట జరుగుతున్న రాజకీయ వికృత క్రీడ అందుకు నిదర్శనంగా నిలుస్తున్నది.
రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ, హస్తిన పాలకులు ఆడుతున్న ప్రమాదకరమైన ఆట భవిష్యత్తు రాజకీయాలను నియంతృత్వ పోకడల వైపు మళ్లిస్తున్నది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను అడ్డుపెట్టుకుని ఆడుతున్న నాటకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.ఈ నేపథ్యంలో సర్ పేరిట జరిగిన అక్రమాలపై బాధ్యత వహిస్తూ సీఈసీ రాజీనామా చేయాలని యువతరం పోరుబాట పట్టింది. నేడు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద భారీ ఆందోళనకు సిద్ధమైంది. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ‘జెన్-జీ సీజన్-1’ ఆందోళన దెబ్బను రుచిచూసిన బీజేపీ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అందుకే ఢిల్లీకి వెళ్లే చాలా రైళ్లను రద్దు చేశారు.
ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వల్ల ఏర్పడే పాలనా వ్యవస్థ. ప్రజలే తమ పాలకులను ఎన్నుకునే గొప్ప విధానం. ప్రపంచంలో కాలక్రమంలో రాచరికం, నియంతృత్వం, సైనిక పాలన ఇలా ఎన్నో రకాల పాలనా పద్దతులు రాజ్యమేలాయి. కానీ మహోన్నతమైనది, అత్యాధునికమైనది ప్రజాస్వామ్యమే. కానీ ఈ వ్యవస్థలోనూ కొందరు నియంతృత్వ పోకడలు కలిగిన నేతలు ప్రవేశించడంతో సమస్యలు మొదలయ్యాయి. దేశ, రాజ్యాంగ నిర్మాతలు గొప్ప వ్యవస్థలను రూపొందించారు. కానీ పాలకులకు ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలపై విశ్వాసం లేకపోతే అవి అమలుకు నోచుకోవడం కష్టమే. కేంద్రంలో పద్నాలుగేండ్లుగా బీజేపీ పాలనలో ప్రజాస్వామిక విలువలు అపహాస్యం అవుతున్నాయి. ఏం చేసైనా, ఎంతకు దిగజారైనా అధికారం హస్తగతం చేసుకోవాలి, చేజిక్కిన అధికారాన్ని గుప్పిట్లోనే పెట్టుకోవాలి అనే అధికార, రాజ్యవిస్తరణ కాంక్షతో కమలం పార్టీ కార్యాచరణ అమలు చేస్తున్నది. దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమం, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనే సన్నద్ధత, శాస్త్ర, సాంకేతిక రంగాలకు ప్రోత్సాహం అవసరం. కానీ బీజేపీకి ఆ ధ్యాస లేదు. ఎంతసేపూ పగటివేషాలు, పడికట్టు పదాల ప్రసంగాలే పాలన అనుకుంటున్నది.
బీజేపీ విద్వేషాలు రెచ్చగొట్టి సమాజంలో చీలిక తీసుకొస్తున్నది. అభంశుభం తెలియని యువత మెదళ్లలో అసత్యాలతో విషం నింపి, వారిని అంధభక్తులుగా మార్చుతున్నది. ప్రజాతీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం, ఇతర పార్టీలు అధికారంలో ఉన్నచోట పాలకపక్షాలను చీల్చడం, తమ బుట్టలో వేసుకోవడం, పొత్తు పెట్టుకున్న పార్టీల్లోనూ చిచ్చుపెట్టడం చూస్తూనే ఉన్నాం.
ఇక బీజేపీ పాలకుల ‘వాషింగ్ పౌడర్ నిర్మా’ రాజకీయాల గురించి తెలిసిందే! దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని నేతలను తమ పంచన చేర్చుకోవడం, వారికి పదవులు కట్టబెట్టడం, ఆ తర్వాత కేసులు మాఫీ కావడం ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నది. అధికారం దక్కించుకోవడం కోసం దబాయింపులకు పాల్పడు తూ, ఫిరాయింపులను ప్రోత్సహిస్తూనే మరో పక్కన ఎన్నికల వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కంకణం కట్టుకున్నది.
ఆఖరికి ఓటరు జాబితా సమగ్ర సవరణ పేరుతో జరుగుతున్న ఓటర్ల ఏరివేత ప్రక్రియ తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది. ‘సర్’ అనేది బోగస్ ఓటర్లను తొలగించేదిగా సాగాలి. కానీ లక్షలాది అర్హులైన ఓటర్లను అకారణంగా తొలగించడం, తాము అర్హులని నిరూపించుకునేందుకు సమయం ఇవ్వకపోవడం, ఈ లోపు ఎన్నికల తంతు పూర్తి కావడం, ఇదంతా చూస్తూ కూడా తప్పొప్పులు చెప్పాల్సిన వ్యవస్థలు చోద్యం చూడటం మరో విషాదం. ప్రజాప్రాతినిధ్య చట్టం-1950లోని సెక్షన్ 22 ప్రకారం ఓటరు జాబితా నుంచి ఎవరి పేరైనా తొలగించాలంటే ముందుగా నోటీసు ఇచ్చి, వాదన విన్న తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి. ఒటరు మరణిస్తే తప్ప, నోటీసు ఇవ్వకుండా జాబితా నుంచి పేరు తొలగించకూడదు. లాల్ బాబు హుస్సేన్ వర్సెస్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కేసులో సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేసింది. ఇదే విషయాన్ని ఇటీవల నల్సార్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తేల్చిచెప్పారు.
కానీ గంపగుత్తగా ఓట్లను తొలగించడం, ఆ తర్వాత వాదన వినేందుకు టైమ్ ఇవ్వకపోవడం ఏం పద్ధతి? నోటీసులు ఇవ్వడం అంటే శాశ్వతంగా ఓటును తొలగించినట్టు కాదని అధికాలు సూక్తులు చెప్తున్నారు. విచారణ పూర్తయి, ఎప్పుడో తిగి జాబితాలో పేరు చేర్చుతారా? ఈ లోపు జరిగిన ప్రజాస్వామిక హననానికి ఎవరు బాధ్యులు? ఓట్ల తొలగింపు ఫలితాలు ఎలా ఉంటాయో బెంగాల్లో చూశాం. అక్కడ దాదాపు 91 లక్షల ఓట్లు తొలగించారు. అప్పీళ్లకు వెళ్లిన 27 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. రాష్ట్రవ్యాప్తంగా 65 మంది ఎన్నికల అధికారులు కూడా ఓటు హక్కును కోల్పోయారంటే పరిస్థితి అర్థంచేసుకోవచ్చు. ఎన్నికలు నిర్వహించడానికి అర్హత కలిగిన వాళ్లు, ఓటు వేయడానికి అర్హులు కాదన్నమాట. ఇదీ విచిత్రం. ఈ నేపథ్యంలో బీజేపీ 46 శాతం ఓట్లతో 206 సీట్లను దక్కించుకున్నది. చాలా నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్థి మెజారిటీ, తొలగించిన ఓట్ల కంటే తక్కువ. అంటే ఓట్ల తొలగింపుతో గెలుపోటములు ప్రభావితమయ్యాయని తేలింది. కానీ ఈసీ నిష్పక్షపాతంగా ఉన్నదంటే నమ్మాలంట! ‘నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు.. నా యిచ్ఛయే గాక నాకేటి వెరపు’ అనే కృష్ణశాస్త్రి కవిత గుర్తొస్తున్నది.
ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడే క్రమం కూడా వివిధ పరిణామాలను సంతరించుకున్నది. గతంలో దొంగ ఓట్లు వేయడం, పోలింగ్ బూత్‌లు ఆక్రమించి, రిగ్గింగ్‌కు పాల్పడటం, బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్లడం.. ఇలాంటి ఘటనలు జరిగేవి. ఇప్పుడు ఏకంగా ఓటర్లనే మాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు దేశంలో ప్రజాస్వామ్యం ఎటు పోతున్నది? ఇది నియంతృత్వానికి దారితీస్తున్నదా? అని అందరూ నిట్టూరుస్తున్న క్రమంలో ఒక ఆశాదీపంలా తళుక్కున మెరిసింది.. జెన్-జీ పోరాటం. పాలకపక్షాల అహంకార సౌధాలను కూల్చి, ప్రజాస్వామిక స్ఫూర్తిని చాటేందుకు సిద్ధమైంది. అప్రజాస్వామిక పాలన రాజ్యమేలుతుంటే ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ విఫలమైంది.
చేతగాని, చేవలేని ఆ పార్టీ నాయకత్వం పట్ల ప్రజల్లో ఆశలు అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ప్రజాస్వామిక హక్కులను బీజేపీ పాలకులు నడిబజారులో బేరానికి పెడుతుంటే, చూసి తట్టుకోలేక యువతరం కదం తొక్కింది. ‘ఇది మా దేశం, మా భవిష్యత్తును మేం కాపాడుకుంటాం’ అని పోరు నడుపుతున్నది. ఈ క్రమంలో ఈసీలో అంతర్గతంగా జరిగిన లుకలుకలు బయటపడుతున్నాయి.
కొత్త ఓటరు నమోదుకు సంబంధించిన ఫారం-6పై ఇద్దరు ఈసీల అభ్యంతరాలను సీఈసీ పరిగణనలోకి తీసుకోలేదని బయటపడ్డది. ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం సంచలనం సృష్టించింది. ఇక జెన్-జీ, ప్రజాపోరాటం ఉధృతమైంది. నేడు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జరుగనున్నది. దీంతో ఢిల్లీ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. రద్దీ ఏర్పడుతుందనే సాకులు చూపుతూ రైల్వేశాఖ పలు రైళ్లు రద్దు చేసింది. ప్రభుత్వం మెట్రో స్టేషన్లు మూసింది. బస్సులను నిలిపివేసింది. భారీ బలగాలను దింపింది. జెన్-జీకి, సీజేపీకి ప్రజల మద్దతు పెరుగుతున్నది. శ్రీశ్రీ చెప్పిన ‘పావన నవజీవన బృందావన నిర్మాతలు’ వీళ్లేనని జనంతా జేజేలు పలుకుతున్నరు… విజయీభవ అని ఆకాంక్షిస్తున్నరు.
ఇనుగుర్తి సత్యనారాయణ
97046 17343
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

