ఎమర్జెన్సీ విధింపులో కీలక పాత్రధారైన సిద్ధార్థ శంకర్ రే, షా కమిషన్ ముందు ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చి బయటకు వస్తూ, అదే రోజు విచారణకు హాజరవుతున్న మాజీ ప్రధానికి ఎదురుపడి ‘ఇవాళ మీరెంతో అందంగా కనపడుతున్నార’ని అనగానే, ‘అవును నువ్వు ఎంత చెడగొట్టాలని చూసినా కూడా..’ అని ఇందిరా గాంధీ ఘాటుగా బదులిచ్చి కమిషన్ విచారణ గదిలోకి వెళ్లిపోయిందట. బుధవారం బూర్గుల భవన్ ముందున్న రోడ్లన్నింటినీ ముంచేసిన జన ప్రవాహాన్ని గమనించిన తర్వాత కుసంస్కార సర్కార్ ఎన్ని విశ్వప్రయత్నాలు చేసినా, కేసీఆర్ కీర్తికి ఇసుమంత కళంకం కూడా అంటించజాలదని అర్థమైపోయింది.
ఎర్రవల్లి నుంచి కేసీఆర్ వెళ్లకముందే బీఆర్కే భవన్ ముందు ఇసుకేస్తే రాలనంత జనం పోగయ్యారు. నినాదాలు చేస్తూ, మధ్యలో సర్కార్‌కు శాపనార్థాలు పెడుతూ ఊగిపోతున్నారు. ఆ జనంలో నాకెదురుపడ్డ కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిల గ్రామం నుంచి వచ్చిన జములయ్య ‘రైతు రెక్కల కష్టం చూసే సీఎం ఎవడైనా ఇట్ల కోడీకలు లెక్క పెడతడా?, ఒకవేళ పది పైన పడ్డ అటీటైందాన్ని సరిచేస్తడు గాని’ అని విషాచరణ నడిపిస్తున్న రేవంత్ సర్కార్‌ను ఈసడించుకున్నడు. శ్రీశైలం జలాశయ బ్యాక్ వాటర్ ముంపు గ్రామమైన, ఎన్నో పోరాటాలు, సంచలన విషాదాల గతాన్ని కలిగిన సోమశిల నుంచొచ్చిన సీఎం సొంత జిల్లా సామాన్యుడెంత లోతుగా ఆలోచిస్తున్నాడో కదా?. అదీ జీవితం నేర్పిన అనుభవం, సంఘర్షణ అలవర్చిన పరిజ్ఞానం. అందుకే నీటి అవసరాన్ని ఒక్క వాక్యంలో వెల్లడించాడు. కేసీఆర్ ఘోష్ కమిషన్ విచారణకు హాజరవుతాడా లేదా? హాజరైతే ఎం చెప్తాడు? ఈ ఉబలాటం కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మాత్రమే ఉండింది.
ఏడాదిన్నరగా కమిషన్లపై ఆశలు పెంచుకొని, కాంగ్రెస్ సర్కార్ పెంచుకున్న రాజకీయ ఊహలను గమనించిన రాష్ట్రంలోని రైతులు మాత్రం పూర్తిగా భిన్నాభిప్రాయాన్ని స్థిరపరుచుకొని ఉన్నారు. అదే బూర్గుల భవన్ పరిసరాల్లో, తెలంగాణ రాష్ట్ర పల్లెల్లో బుధవారం ప్రస్ఫుటంగా కనిపించింది.
అసలు తెలంగాణ భౌగోళికంగానే కాక సామాజికంగా కూడా దేశంలో భిన్నమైన చారిత్రక వాస్తవికతను కలిగి ఉన్నదని అర్థం చేసుకునే లోతైన దృక్పథం కాంగ్రెస్ సర్కార్‌కు ఎక్కడిది? అందుకే ప్రభుత్వ లక్ష్యాలు, పాలనా వ్యవస్థ నిర్వహణ తదితర మౌలిక అంశాల్లోనే తప్పటడుగులు వేసింది. కాకతీయులు ముందుచూపుతో నిర్మించిన తెలంగాణలో గొలుసుకట్టు చెరువుల వంటి నీటి వనరుల నిర్మాణాలను మనం మరే ఇతర రాష్ర్టాల్లో చూడలేం.
కాళేశ్వరంపై ఏడాదిన్నర కాలంగా అనేక కోణాల్లో చర్చ జరిగింది. అలాగే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపైనా సర్కార్ ఎంత విష ప్రచారం చెయ్యాలో అంతా చేసేసింది. అన్నీ విన్న తర్వాతే, రెండు ప్రభుత్వాలను పోల్చుకున్న తర్వాతే ప్రజలు స్పష్టాతి స్పష్టంగా మళ్లీ కేసీఆర్ కావాలనే నిర్ణయానికి వచ్చేశారు.
చెరువులు, వాటి దీర్ఘకాలిక ఆర్థిక, సామాజిక లక్ష్యాల పట్ల స్పష్టమైన శాస్త్రీయ దృక్పథం ఉందికాబట్టే ఆనాడే వ్యయాలు, లాభాల అంచనాల పరిధిని దాటి గొలుసుకట్టు చెరువులు నిర్మించారు. అవి సాధించిన దీర్ఘకాలిక ఫలితాలను ఏ లెక్కల్లో ప్రస్తుత సర్కార్లు అంచనా వేయగలవు? అవి ఏ ప్రభుత్వాలకు అందని, ప్రజల జీవితానుభవంలో ఇమిడిపోయిన అనునిత్య ఆధారిత నిర్మాణాలుగా మారాయి. కానీ, తెగిపోయిన, పూడిపోయిన ఏ కొన్ని చెరువులనో పరిగణనలోకి తీసుకొని కాకతీయుల శ్రమ వెనుక మరేదో ప్రయోజనం దాగి ఉన్నదని నిందించడం మూర్ఖత్వమే అవుతుంది కదా! విజ్ఞులైన, జనాల పట్ల పట్టింపున్న కేసీఆర్ లాంటి పాలకులు మిషన్ కాకతీయ లాంటి పథకం ద్వారా తిరిగి వాటికి జీవం పోసి, కాళేశ్వరం వంటి వాటితో అమరత్వం కల్పించి, సామాజిక శాశ్వత సంపదగా స్థిరపరుస్తారు.
అంతేకానీ, రేవంత్ సర్కార్లా సాంకేతిక లోపాలనో, ఒకటో రెండో నిర్మాణానంతర ప్రమాదాలనో అడ్డం పెట్టుకొని ప్రజల వారసత్వ వనరులను, నిర్మాణాలను శిథిలమయ్యేలా కుట్రలు చేయరు. రేవంత్ సర్కార్ ఎంచుకున్న విధ్వంసక విధానమే స్వల్పకాలంలో హాస్యాస్పద సర్కార్‌గా నవ్వులపాలైపోవడానికి కారణమైంది. చరిత్రలో చాలా ప్రభుత్వాలు పాలనలో విఫలమవుతుంటాయి కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం ఫెయిల్యూర్ గానే కాక, జనం దృష్టిలో జోకర్ గవర్నమెంట్‌గా ముద్రపడిపోయింది.
సుదీర్ఘకాలం అమానవీయ ధోరణితో ఏలిన సర్కార్లు, తెలంగాణలో అమలుచేసిన విధ్వంసక నమూనా వల్ల ఎంత నెత్తురు పారిందో, ఎన్ని వేలమంది విలువైన జీవితాలను కోల్పోయారో నాయకులు మరిచిపోయినా ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరు. కొన్నిసార్లు జనాభిప్రాయంలో తొట్రుపాటు దొర్లొచ్చు కానీ బేరీజు వేసుకున్న తర్వాత స్థిరమైన అభిప్రాయానికే వస్తారు. దానివల్లనే మొన్న బూర్గుల భవన్ ముందు హుస్నాబాద్ నుంచి వచ్చిన లక్ష్మీ నారాయణ ‘చేతబడి చేసినట్టు చెరువులు పాడుపడ్డ నాడు పడిన కష్టాలు కాంగ్రెస్ సర్కారొల్లకేం ఎరుక? కేసీఆర్ రాకుంటే తెలంగాణ వల్లకాడయ్యేపోయేది’ అని మా అందరితో గట్టిగా అరుస్తూ పంచుకున్నాడు. ఆ మాటకొస్తే వానకాలం పంట పనులు ప్రారంభమైన సందర్భంగా పొలాల్లో, అవసరాలల్లో కలుస్తున్న గ్రామాలు కేసీఆర్ పేరు తీయకుండా ఒళ్లు వంచడమే లేదు. అదే సమయంలో హీరో గురించి చర్చిస్తున్న సందర్భంలో విలన్ వికృతాలు కూడా మాటల్లో దొర్లినట్టు రేవంత్ ప్రభుత్వ పనితనంపై కూడా ముచ్చటించుకుంటున్నారు.
ఎక్కడ గుమిగూడినా గుడ్డి సర్కార్‌ను దునుమాడుతూనే ఉన్నారు. ఇటీవల సర్కార్ సన్నబియ్యం కోసం క్యూలో నిలబడిన రైతులు మూకుమ్మడిగా రేవంత్ రెడ్డి సర్కార్‌పై ఎలా దుమ్మెత్తి పోస్తున్నారో వాళ్ల మధ్యలో ఉండి వినొచ్చిన హాలియా మండల వాసి సైదులు మొన్న ఒక మిత్రుడి పెళ్లిలో వివరిస్తుంటే ఆశ్చర్యం కలిగింది. ఈ హస్తం ప్రభుత్వం ఏ తాయిలాలు పంచినా, విరిగిన ప్రజల మనసులను తిరిగి గెలుచుకోలేదన్నది క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎవరికైనా సులభంగానే అర్థమైపోతున్నది.
రాష్ట్ర రైతుల అవసరాలను పట్టించుకోకపోగా, కేసీఆర్‌పై కక్షసాధింపు చర్యలకు దిగుతుండటం కూడా తెలంగాణ పల్లెల్లో ప్రభుత్వంపై వికారాన్ని పెంచుతున్నది. పైగా తుమ్మల వంటి అహంకార, పొంగులేటి వంటి అక్రమార్జిత మంత్రులు కాళేశ్వరం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలపై నిత్యం నోరు పారేసుకోవడం వల్ల కూడా ప్రజల్లో కాంగ్రెస్ సర్కార్‌పై వెగటు పెరగటానికి కారణం అవుతున్నాయి. కాళేశ్వరంపై ఏడాదిన్నర కాలంగా అనేక కోణాల్లో చర్చ జరిగింది. అలాగే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపైనా సర్కార్ ఎంత విష ప్రచారం చెయ్యాలో అంతా చేసేసింది. అన్నీ విన్న తర్వాతే, రెండు ప్రభుత్వాలను పోల్చుకున్న తర్వాతే ప్రజలు స్పష్టాతి స్పష్టంగా మళ్లీ కేసీఆర్ కావాలనే నిర్ణయానికి వచ్చేశారు.
దేశంలో ఇందిరాగాంధీ, అద్వానీ, పీవీ, కరుణానిధి, ఎన్టీఆర్ అంతెందుకు మోదీ, అమిత్ షా ఇలా అనేకమంది నేతలు వివాదాస్పద తీవ్ర ఆరోపణలపై కమిషన్ల విచారణకు హాజరయ్యారు. బహుశా తొలిసారి బహుళ ప్రజా ప్రయోజన భారీ చారిత్రక పథకం అమలుపరిచి కేసీఆర్ కమిషన్ విచారణకు హాజరయ్యారు. జస్టిస్ షా కమిషన్ నుంచి రంజిత్ సింగ్ సర్కారియా కమిషన్ వరకు సాగిన విచారణలు లక్ష్యాలు ప్రత్యేకమైనవి. కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఘోష్ కమిషన్ విచారణే సామాజిక, సామూహిక ప్రయోజనానికి, నేరాన్ని ఆపాదించే దిశగా నడుస్తున్నది.
ఘోష్ కమిషన్ ఘోస్ట్ గవర్నమెంట్ కనుసన్నల్లోనే ఒకవేళ తుది నివేదిక రూపొందిస్తే, భవిష్యత్ సర్కార్లకు ఫ్యాక్షన్ సంస్కారాన్ని అందించిన అన్యాయ ప్రక్రియగా అపఖ్యాతి మూటగట్టుకుంటుంది. ఘోష్ కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరైన బుధవారం సాయంత్రమే ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో వెళ్లగక్కిన అక్కసును పరిశీలిస్తే, సర్కార్ విషాచరణ ఎవరికైనా అసహ్యం కలిగించకమానదు. ఈ తతంగాలెన్ని నడిచినా, తెలంగాణ తలరాతను మార్చిన నిర్మాతగా కేసీఆర్ చరిత్రను ఇంకా బలంగా చర్చలో ఉంచగలవే గానీ పలుచన చెయ్యజాలవు.
– (వ్యాసకర్త: రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్)
డాక్టర్ ఆంజనేయ గౌడ్