బీజేపీ పాలనలో ఉన్న మణిపూర్ నేడు దేశంలోనే భద్రత లేని రాష్ట్రం. తమ అధికార దాహం కోసం కుకీలను వంచన చేసిన బీజేపీ ప్రభుత్వం నేడు వారిని పూర్తిగా విస్మరించింది. మైతీ మూకలను కుకీలపైకి ఎగదోసింది. దీంతో వారు రెచ్చిపోతున్నారు. మనుషులను చంపుతున్నారు. మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్నారు. వారిపై సామూహిక అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ‘భేటీ బచావో’ కాదు.. ‘భేటీ జలావో’ అనే నినాదం నేడు మణిపూర్‌లో చెలామణి అవుతున్నది. దేశ రక్షణ కోసం పోరాడిన ఆర్మీ జవాన్ భార్యకు దేశంలో రక్షణ లేకుండా పోయింది. 72 ఏండ్ల ప్రధాని మోదీకి మణిపూర్‌పై స్పందించడానికి 79 రోజుల సమయం పట్టిందంటే ఆశ్చర్యం వేస్తున్నది.
ఈశాన్య రాష్ర్టాలు ఇలా తగలబడిపోతుంటే సంబంధిత శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మాత్రం హైదరాబాద్‌లో పదవుల పందేరం ఆడుతున్నారు. ఓట్లు, సీట్ల గురించి లెక్కలు వేసుకుంటున్నారు. బాధ్యత తీసుకొని చక్కదిద్దాల్సిన ఈ మంత్రి కనీసం మీడియా ముందైనా స్పందించకపోవడం శోచనీయం.
మణిపూర్ అల్లర్లలో ఆందోళన కలిగించే విషయం రోజుకొకటి బయటకు వస్తున్నది. కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళల ను అత్యాచారం చేసి వివస్త్రలుగా ఊరేగించారు. ఈ అమానుష సంఘటన మరవకముందే విష్ణుపూర్ జిల్లాలో కుకీ తెగకు చెందిన డేవిడ్ థీక్ అనే వ్యక్తి తల నరికిన మైతీలు భయోత్పాతక వాతావరణాన్ని సృష్టించారు. కేంద్రం, మణిపూర్‌లోని బీజేపీ ప్రభుత్వాలు వారికి అండగా ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజుకో దారుణ ఘటన బయటకు వస్తుండటంతో అసలు మణిపూర్‌లో ఏం జరుగుతున్నదన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. దేశం కోసం రక్షణగా నిలిచి కార్గిల్ యుద్ధంలో పోరాడిన ఆర్మీ జవాన్‌కు సొంతూరిలోని ఆయన కుటుంబానికే రక్షణ లేకుండాపోయింది. నగ్నంగా ఊరేగించిన ఇద్దరు మహిళల్ల్లో ఒక బాధితురాలు రిటైర్డ్ జవాన్ భార్య కావడం యావత్తు దేశ ప్రజల మనసును తీవ్రంగా కలచివేసింది. దేశం కోసం పోరాడిన మాజీ ఆర్మీ జవాన్ ఈ అమానుషం నుంచి తన భార్యను రక్షించుకోలేకపోయాడు. ‘కార్గిల్ యుద్ధంలో దేశాన్ని రక్షించుకున్నప్పటికీ, తన కుటుంబాన్ని కాపాడుకోలేకపోయా’నని ఆ ఆర్మీ జవాన్ తట్టుకోలేకపోతున్నాడు. 72 ఏండ్ల వయస్సున్న ప్రధాని మోదీ పరిస్థితిని చక్కదిద్దడం అటుంచి కనీసం మణిపూర్ ఘటనపై స్పందించడానికి 79 రోజులు పట్టింది. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప మోదీలో చలనం రాలేదు. ‘భేటీ బచావో’ అని నినదించిన మోదీ ప్రభుత్వం, నేడు మణిపూర్‌లో ‘భేటీ జలా వో’ అన్నట్టు వ్యవహరిస్తున్నది. మహిళలు, మైనారిటీ తెగలను రక్షించలేని కేంద్ర సర్కార్ ఎం దుకున్నదనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది.
భారత్.. సార్వభౌమ, సర్వసత్తాక, లౌకికవాద దేశం. ఈ దేశంలో అన్ని మతాల వారికి స్వేచ్ఛగా జీవించే హక్కున్నది. ప్రధానంగా సర్వమతాల సమ్మేళనమే భారతదేశం. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. గత కేంద్ర ప్రభుత్వాలు వీటిని ఎంతో కొంత అమలుచేసినా బీజేపీ మాత్రం అమలు చేయడం లేదు. ఒకే మతానికి పెద్దపీట వేస్తూ మైనారిటీలను అణచివేయాలని చూస్తున్నది. ప్రార్థనా మందిరాలపై దాడులకు దిగుతుండటంతో మైనారిటీలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మణిపూర్‌లో గత కొద్దినెలల నుంచి మైతీ, కుకీ తెగల మధ్య అల్లర్లు జరుగుతున్నప్పటికీ కేంద్రం, ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. స్వలా భం కోసం రెండు తెగల మధ్య చిచ్చుపెట్టి ఎన్నికల్లో గెలిచిన బీజేపీ, నేడు ఆ చిచ్చును మరింత రాజేస్తున్నది.
మణిపూర్‌లో పరిస్థితి ఎంతలా ఉందంటే మాటల్లో చెప్పడం వర్ణనాతీతం. మహిళలను దేవతలుగా పూజించే ఈ పుణ్యభూమిలో కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలను సామూహిక అత్యాచారం చేసి వివస్త్రలుగా చేసి ఊరేగించిన దారుణంపై సభ్యసమాజం తలదించుకుంటున్నా బీజే పీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ దారుణ సంఘటన మే 4న జరిగింది. పోలీసుల సమక్షంలోనే జరిగిందని బాధితులు చెప్తుతున్నారు. నెలన్నర తర్వాత. జూన్ 21న కేసు నమోదు చేశారు. ఆ దారుణ వీడియో బయటకు వచ్చాకే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. అంటే.. ఘటన జరిగిన రెండున్నర నెలల వరకూ పోలీసులు స్పందించలేదు. ఒకవేళ ఈ వీడియో వెలుగులోకి రాకుండా ఉండి ఉంటే, ఆ అరెస్టులు కూడా జరిగి ఉండేవికావనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించిన దారుణ సంఘటనపై సుప్రీంకోర్టు స్వీయ విచారణ చేపట్టింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈ దారుణంపై స్పందించారు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. మతపరమైన ఘర్షణలు చెలరేగే ప్రాంతంలో మహిళలను సాధనంగా ఉపయోగించుకోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలా చేయడం రాజ్యాంగాన్ని తూలనాడటమేనన్నారు. సామాజిక మాధ్యమాల్లో బయటపడిన వీడియోలు తనను తీవ్రంగా కలచివేశాయన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే, తాము చర్యలు చేపడతామ ని హెచ్చరించారు. ఇలా ఎప్పుడైతే మణిపూర్ ఘటన పై సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైన బీజేపీ మీద ఆగ్రహం వ్యక్తం చేసిందో ఆ తర్వాత జూలై 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడంతో ప్రధాని మోదీ స్పందించాల్సి వచ్చింది. అది కూడా ఏదో తప్పనిసరిగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడినట్టుగా మోదీ ప్రసంగం ఉన్నది.
మణిపూర్‌లో ప్రభుత్వ ఉద్యోగులు దాడులకు భయపడి కార్యాలయాలకు రావడమే మానేశా రు. అక్కడి సర్కార్ నో వర్క్ నో పే రూల్‌ను అమలు చేస్తుందంటే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. స్వయాన మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ అల్లర్లను అదుపు చేయలేమని ప్రకటించి అక్కడి భయానక వాతావరణాన్ని ప్రపంచానికి తెలిసేలా చేశారు. ప్రాణాలకు భయపడి వేలాదిమంది పొట్ట చేతులు పట్టుకొని ఇతర రాష్ర్టాలకు వలసపోతున్నారు. ఉన్నచోట ఉండలేక పరాయిచోట బతుకలేక వారి బాధ వర్ణనాతీతం. ఇంత జరు గుతున్నా కేంద్ర సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం అత్యంత బాధ్యతారహిత్యం.
దేశం మొత్తం మణిపూర్ ఘటనను తీవ్రంగా ముక్తకంఠంతో ఖండిస్తున్నప్పటికీ బీజేపీ నేతలు నోరు మెదపడం లేదు. అసలు మణిపూర్‌లో అల్లర్లకు కారణాన్ని కనుగొని పరిష్కరించాల్సిన కేంద్రం నాకెందుకులే అన్నట్టుగా చోద్యం చూస్తున్నది. మైనారిటీలు ఏమైతే మాకెందుకులే అని మతం మత్తులో జోగుతున్నది.
ఇప్పటికైనా మణిపూర్ అల్లర్లను ఆపేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలి. మైనా రిటీలు స్వేచ్ఛగా జీవించేలా భరోసా కల్పించాలి. ధైర్యంగా, వారి స్వస్థలా ల్లో జీవించడం వారి ప్రాథమిక హక్కు. అందుకనుగుణంగా పరిస్థితులు చక్కదిద్దటం కేంద్రం, ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానిదే బాధ్యత.
(వ్యాసకర్త: తెలంగాణ ఫుడ్స్ చైర్మన్)
మేడె రాజీవ్‌సాగర్
92204 77777