మొన్నటి పొద్దు, ఆగస్టు 22. పాత్రికేయ లోకానికో దుర్దినం. పాలక వికృతిని ఎత్తిచూపిన పాత్రికేయం మీద గుండాలు తెగబడ్డ రోజు.
రాజ్య కర్కశం మీద అక్షరాయుధాలు సంధించిన జర్నలిస్టులను పాలకులు పగబట్టిన దినం. తెలంగాణ తొలితరం పాత్రికేయుడు షోయబుల్లా ఖాన్ చేతులు తెగనరికి, ఆయన్ను హత్య చేసింది ఆగస్టు 22నే. ‘ఉనే నహీ లిఖ్నా.. లిఖ్తేసో హాతోన్కో కాడ్దో’ అని నిజాం రాజు తాబేదారు ఖాసీం రజ్వీ 1948లో ఆగస్టు 19న హుకుం వేస్తే… ఆగస్టు 22 తెల్లవారుజాము కల్లా షోయబ్ కుడిచేతిని నరికి దారుణంగా హత్య చేశారు.
కాంగ్రెస్ శిబిరం ఎత్తుకున్న ఓ పాట ఎన్నికల్లో జనంలోకి బాగా వెళ్లింది. ‘మూడు రంగుల జెండా పట్టి.. సింగమోలే కదిలినాడు’ అనే పల్లవితో మొదలై.. ‘ఆనాటి రోజులు తెస్తాడు..’ అనే చరణంతో సాగుతుంది ఆ పాట. నల్లగొండ గద్దర్ జీవం పోసిన ఆ పాటకు పల్లె ఊగింది. ఆకట్టుకునే జానపద బాణికి జనం పడిపోయారు. అటు రాజకీయ వ్యూహకర్తల పాచిక.. ఇటు పాట కలగలిసి జనం కండ్ల చుట్టూ త్రిశంకు పొరల్లా అల్లుకున్నయి. నిలబడి ఓట్లు గుద్దేశారు. కాంగ్రెస్ పార్టీని అందలమెక్కించారు. ఇక అక్కడినుంచి కాలచక్రం గిర్రున తిరిగింది. వెలుగు దివ్వెలను తడుముకుంటూ అభివృద్ధి పథంలోకి కాదు, చీకట్లను పులుముకుంటూ తిరోగమనంలోకి జా రింది. అటునుంచి అటే తిరిగి ఆనాటి ఆగస్టు 22ను వాపస్ తీసుకొచ్చింది. మళ్లీ అదేరోజున జర్నలిస్టుల మీద దాడికి తెగబడటం కాకతాళీయమే అయినా.. ఏమరుపాటు మాత్రం కాదు. పక్కా పథకం ప్రకారమే జరిగిన దాడి. ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతోనే జరిగిన దాడి. రాజ్యం ప్రేరేపించిన దాడి.
ఒకవైపు పంట రుణాలన్నీ మాఫీ చేశామని సర్కారు ఊదరగొడుతున్నది. మరోవైపు తమ రుణాలు మాఫీ కాలేదని రైతాంగం ఎదలు బాదుకుంటున్నది. వేలమంది రోడ్లమీదికొచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నరు. అది 41 లక్షల మంది అన్నదాతల భవిష్యత్తు సాగు సంకటం. ఈ నేపథ్యంలో మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డి ప్రజల్లోకి వెళ్లి పాలనా తీరుకు అద్దం పట్టే ప్రయత్నం చేసిండ్రు. వాస్తవ పరిస్థితి అంచనా కోసం ముఖ్యమంత్రి సొంతూరు కొండారెడ్డిపల్లి వెళ్లిండ్రు. అది జర్నలిస్టులుగా వారి కర్తవ్యం. దీనికే పాలకుల కడుపు మండింది. దాడికి పూనుకున్నారు. ఆ ఊరిలో నిజంగా సంపూర్ణ రుణమాఫీ అయినట్టయితే.. జర్నలిస్టులను సాదరంగా ఆహ్వానించి, ‘ఇదీ మా ఘనత’ అని తొడగొట్టి ప్రపంచానికి చాటొచ్చు. ‘ఇక రాజకీయాలు వదిలెయ్ కేటీఆర్.. నువ్వు రాజీనామా చెయ్ హరీశ్‌రావు’ అని జనం నుంచే డిమాండ్ పెట్టొచ్చు. ఇది చేయకపోగా మహిళలనే సోయి లేకుండా మూకదాడికి తెగబడటం నీతిమాలినతనం.
ఇదే రోజున జరిగిన మరో ఘటన.. రుణమాఫీ కోసం రోడ్డెక్కిన రైతుల మీద రాళ్ల దాడి. అది తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో జరిగింది. సోషల్ మీడియాలో వైరలైన వీడియోలను చూస్తుంటే.. గతం కండ్లలో మెదిలింది. మా ఊరు కర్విరాల కొత్తగూడెం. తుంగతుర్తి నియోజకవర్గం. ఇక్కడ బతకాలంటే బండయినా కొట్టి పొట్ట పోసుకోవాలే.. లేదంటే రాజకీయ హత్యలు చేసైనా పూట గడుపుకోవాలె. రాయలసీమ జిల్లాలను మించిన కరువు, రాజకీయ ఫ్యాక్షనిజం తుంగతుర్తి పల్లెల్లో ఉండేది. ఎదిగిన పోరలకు పని దొరక్కపోయేది. గోటికి మీసం అందకముందే అనివార్యంగా చేతికి ఆయుధం అందేది. వేల ఎకరాల భూములున్నయి కానీ, నీళ్లు లేవు. చినుకులు కురిసి సెక్క తడిస్తే.. ఇంత ధాన్యం చేతికి వచ్చినట్టు, లేకుంటే లేదు. పూట గడవటమే గగనం. చదువుకు పొమ్మని ప్రోత్సహించే కుటుంబాలు అతి తక్కువ. ఆకలి ఉండి, అడ్డూ అదుపు లేని పోరలను రెండు ప్రధాన రాజకీయ పార్టీలు టార్గెట్ చేసేవి. ఇంత కూర పెట్టి, పావు సారా పోసి చేరదీసేవి. నాలుగు రోజులు తిరక్కుండానే చేతికి కర్రో, కత్తో ఇచ్చి వేసి రమ్మంటే ఊరు ఊరంతా రణరంగమయ్యేది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాయలసీమలో ఫ్యాక్షన్ హత్యలు ఆగినాయి కానీ.. తుంగతుర్తి పల్లెల్లో మాత్రం రాజకీయ అరాచకాల పరంపర అట్లానే కొనసాగింది. కొత్తగూడెం, గుమ్మడవెల్లి, కుక్కడం, అన్నారం కుంటపల్లి, వెలుగుపల్లి, గోరంట్ల, సంగెం మొదలైన ఏటివతలి గ్రామాల్లో నిత్య హత్యలతో తెల్లారేది. రాజకీయ కార్పణ్యాలతో ఇక్కడి భూమి నెత్తురుతో తడిసి ప్రతీకార విత్తులు మొలిచేవి.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తుంగతుర్తి బాగుపడ్డది. తన మెదడుకు పదునుపెడితే బీడుకు తడి తాకింది. కాళేశ్వరం కట్ట మీంచి తల్లి గోదారమ్మ వచ్చి నెత్తుటి కాళ్లను కడిగింది. మిషన్ కాకతీయతో ఊరూరా చెరువులు, కుంటలు నిండినయి. ప్రతి మడి తడిసింది. పల్లె పచ్చబడ్డది.. బీడు పండింది. కరువు తీరింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ తన, మన అనే భేదం లేకుండా రాజకీయ కక్షలు, కొట్లాటల మీద ఉక్కుపాదం మోపారు.
సగటు మనిషి బువ్వకు, బతుక్కు భరోసా దొరికింది. మలితరం పిల్లలు బడిబాట, పెద్దలు మడిబాట పట్టిండ్రు. రాజకీయ కార్పణ్యాలు, హత్యలు ఆగిపోయినయి. సుఖశాంతులు వెల్లివిరుస్తున్నయి. మా ప్రాంతంలో ఇది తెలంగాణ వచ్చినప్పటి కంటే గొప్ప విప్లవం. ఇది 1789 ఫ్రెంచ్ విప్లవ భావజాలం కంటే మరింత విస్తృతమైనది. దీన్ని సాధించిన నవతరం విప్లవకారుడు కేసీఆర్.
అటువంటి నియోజకవర్గంలో ఇన్నాళ్ల తర్వాత మళ్లీ రాజకీయ గొడవలు అనగానే గుండె గుభేల్మన్నది. ఆనాడు ఇంతే.. ఎక్కడో మండల కేంద్రంలో కొట్లాటలైతే.. అది రాత్రికిరాత్రే పడగ విప్పి పల్లెలకు విస్తరించేది. గృహ దహనాలు, లూటీలు, పంట విధ్వంసాలయ్యేవి. నెత్తుర్లు చిందేవి. ఇప్పుడు దసరా పండుగ, పంచాయతీ ఎన్నికలు కలిసి వస్తున్నయి. పెద్ద పండుగకు యమగండమే పొంచి ఉన్నది. ఆయుధ పూజ అనంతరం తంతు ఏ దారుణానికి దారితీస్తుందో..! దసరా పూజ కాడ వేటపోతును కొట్టి, తుపాకీ పేల్చటం ఆనవాయితీ. ముదిరాజులు వీరకత్తి పట్టి పోతును కొట్టి పూజ ఆరంభిస్తే.. ఊరి పెద్ద తుపాకీ పేల్చి క్రతువు ముగిస్తాడు. గ్రామాల్లో ఇది పెద్దరికపు ఆధిపత్య సింబల్. ఇగో ఈ ఈగో కోసమే ప్రతి ఊరులో రెండు గ్రూపులు మోపైతున్నయి. ఎవరి పంతం వాళ్లదే. ఎవరి ముఠా వాళ్లకే. దీనికి సర్పంచ్ ఎన్నికలు తోడు వచ్చినయి. నివురుగప్పిన నిప్పులా ఉన్న రాజకీయ కక్షలు మళ్లీ ఆనాటి పరిస్థితులకు దారితీస్తాయేమో అనే భయం నాలాంటి సగటు తుంగతుర్తి వాసిని భయపెడుతున్నది. పోలీసుల అప్రమత్తత, వారి బాధ్యతాయుతమైన విధులే మా ప్రాంతానికి ఇక రక్షక కవచం
-వర్ధెల్లి వెంకటేశ్వర్లు