నిజం దాగదు.. వెనుకా ముందు బయటకు వస్తూనే ఉంటుంది. అట్లాగే కాంగ్రెస్ నిజస్వరూపం కూడా బయటపడింది. అమెరికాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఉచిత కరెంటు మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఉచితాలు సరికాదని, వ్యవసాయానికి 24 గంటల కరెంటు అవసరం లేదని, మూడు గంటలు కరెంటు ఇస్తే మస్తు అని రేవంత్రెడ్డి తన మస్తిష్కంలో ఉన్న ఆలోచనను బయటపెట్టారు.
రేవంత్ వ్యాఖ్యల పై సొంత పార్టీ నేతలూ ఖంగుతిన్నారు. ఈ వ్యాఖ్యలను నిరసి స్తూ రైతులు కన్నెర్ర జేయడంతో కాంగ్రెస్ రేవంత్రెడ్డి ఒక్కడిదే కాదని, ఆయన చేసిన వ్యాఖ్యలతో పార్టీకి సం బంధం లేదని, అతని వ్యక్తిగత వ్యాఖ్యలను ప్రజలు పరిగణనలోకి తీసుకోవద్దని మిగతా కాంగ్రెస్ నాయకులు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి మాట్లాడితే అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం ఎలా అవుతుందో కాంగ్రెస్ నాయకులే చెప్పాలి.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించేనాటికి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉండేది. కరువు, కాటకాలు తెలంగాణ ప్రాంతాన్ని కమ్ముకొని ఉన్నాయి. సాగు, తాగునీటి కోసం ప్రజలు అల్లాడిపోయారు. వందల ఫీట్లు తవ్వినా బోరు బావుల్లో చుక్క నీరు పడ్డ సందర్భాలు లేవు. కరెంటు కోతలు, లో వోల్టేజీ వంటి సమస్యలతో రైతులకు ఆత్మహత్యనే శరణ్యమైంది. ఉపాధి కరువై పొట్ట చేతపట్టుకొని విదేశాలకు వలసలు వెళ్లారు తెలంగాణ ప్రాంత రైతులు. ఈ గోస నుంచే కదా ప్రజలకు విముక్తి లభించాలని ఉద్యమనేత కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ చేశారు. తెలంగాణకు, ఉద్యమానికి సంబంధం లేని రేవంత్రెడ్డి లాంటి వాళ్లకు ఏం తెలుస్తుంది నాటి ప్రజల గోస.
నేడు తెలంగాణ రాష్ట్రం పచ్చని పంట పొలాలతో కళకళలాడుతున్నది. ధాన్యపు రాసులతో కాంతులీనుతున్నది. ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ ఎదిగింది అంటే రాష్ట్ర ప్రగతిని మనం అర్థం చేసుకోవచ్చు. ఇదంతా స్వయంగా రైతు బిడ్డ అయిన సీఎం కేసీఆర్ కృషి, పట్టుదలకు నిదర్శనం. పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ.10 వేలు అందిస్తూ, 24 గంటల నిరంతర, ఉచిత కరెంటు అందిస్తుండటంతో రైతుల జీవితాల్లో వెలుగులు ప్రజ్వరిల్లుతున్నాయి. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అందిస్తూ అత్యధిక విద్యుత్తు వినియోగం చేస్తున్న ఏకైక రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణ చరిత్ర సృష్టించింది. రైతు బీమా ద్వారా మరణించిన 99,297 మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.4,964 కోట్లు అందించి అండగా నిలిచింది తెలంగాణ ప్రభుత్వం.
ఉచిత కరెంటు మీద రేవంత్ మాట్లాడిన మాటలకు తెలంగాణ మొత్తం రైతుల ఆందోళనలతో అట్టుడుకుతుంటే, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నది. తెలంగాణలో కాంగ్రెస్కు బీ టీమ్ బీజేపీనా? అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నది. రేవంత్ వ్యాఖ్యలకు బీజేపీ లోలోన మద్దతు ప్రకటిస్తున్నట్టు కనిపిస్తున్నది. రైతు వ్యతిరేక పార్టీ అని నిరూపించుకున్న కాంగ్రెస్కు ప్రజలు రానున్నకాలంలో బుద్ధి చెప్తారనడంలో సందేహం లేదు.
జీడిపల్లి రాంరెడ్డి
96666 80051