తెలంగాణలో ఏ మూల చూసిన రైతుల అరిగోసలు, ఆర్తనాదాలే వినపడుతున్నయి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం యూరియా కోసం నిలబడ్డోళ్లు రైతులు కానే కాదని చెప్తున్నది. హస్తం పాలకుల మాటలు వింటున్న అన్నదాతల గుండెలు పగులుతున్నయి. కేసీఆర్ హయాంలో అన్నపూర్ణ లాంటి తెలంగాణ రాష్ట్రంలో అసలు ఎందుకిలా జరుగుతున్నది? రైతులకు సకాలంలో ఎరువులు అందించాల్సిన ప్రభుత్వం ఏం చేస్తున్నది?
బీఆర్ఎస్ హయాంలో రైతులు ఎన్నడూ ఇలాంటి కష్టాలను చూడలేదు. దార్శనికుడైన పాలకుడు ఉండటమే అందుకు కారణం. కాంగ్రెస్ పాలకులకు ఓట్లు, సీట్ల పాకులాట తప్ప, అభివృద్ధి.. ఉపాధి.. ప్రజల అవసరాలు.. రైతుల బాధలు పట్టవు. ఎన్నడైనా వ్యవసాయం చేసిన మొఖాలైతే కదా సాగు గురించి తెలియడానికి. యూరియా ఎప్పుడు అవసరమవుతుందో తెలియడానికి. వర్షాలు పడ్డాక పదను మీద యూరియా చల్లితేనే ఫాయిదా ఉంటది. అది మొక్కకు అంది ఏపుగా పెరుగుతుంది. కాంగ్రెస్ పాలకుల నిర్వాకంతో ఎప్పుడో అదను దాటింది. ఇప్పుడు సిగపట్లు పట్టినా యూరియా అందటం లేదు. అందినా ఏం లాభం అదను దాటాక.
తెలంగాణ రైతు భూమిని తల్లి అని అనుకుంటడు.తన చెమట చుక్కలను గంగగా కురిపించి పంటను పెంచుతడు. కానీ, ఈ రోజు రైతు కష్టానికి ఫలితం లేకుండాపోయింది. పంటలు ఏసినా ఎరువులు అందక బిక్క మొఖం ఏసుకుని చిక్కిపోతున్నడు రైతు. పంట పండించేందుకు రక్తం
ధారపోసి ఎరువుల కోసం ఆరాట పడుతున్నడు.
కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఎరువుల కొరత, విత్తనాల నకిలీ, మార్కెట్లో మద్దతు ధరల్లో కోత.. అన్నీ కలగలిపి అన్నదాతను నిండా ముంచుతున్నయి. ఎరువుల కోసం ఎండలో కిలోమీటర్ల కొద్దీ క్యూలు, విత్తనాల కోసం దుకాణాల ముందర పోరాటం, పంట అమ్మబోతే దళారుల దోపిడీ.. కాంగ్రెస్ పాలనలో రైతుల నిత్య కష్టాలివీ. మద్దతు ధర కోసం వేచి చూసినా, భరోసా పథకాల కోసం ఎదురుచూసినా, రైతుకు చివరికి మిగిలేది ఋణాల భారం, ఆత్మహత్యల వేదనే. బంగారు పంటలు పండించినా రైతు చేతిలో చిల్లిగవ్వ మిగలని పరిస్థితి నెలకొన్నది. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం పూర్తిగా ఆగమైపోయింది. రైతును అభివృద్ధి దిశగా నడపాల్సిన ఎవుసం అందుకు బదులుగా శ్మశానం దిశగా నడిపిస్తున్నది. రైతుల అవస్థలను పట్టించుకోని ప్రభుత్వం, పాలకులు ఉండటమే అన్నదాతల ప్రస్తుత దుస్థితికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. కాంగ్రెస్ పాలకులు రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నారే తప్ప, రైతుల కష్టాలను తీర్చేందుకు కనీసం కృషి చేయడం లేదు. రైతు కష్టపడి పండించిన పంటకు విలువ ఇవ్వని ప్రభుత్వం, రైతుల హక్కులు, రైతులను కాపాడలేని నాయకత్వం, తత్ఫలితంగా రోజురోజుకు దివాళా తీస్తున్న వ్యవసాయ విధానం.. ఇవన్నీ కాంగ్రెస్ వైఫల్యాలకు ప్రతీకలు.
రైతుల కష్టాలు తెలిసిన, అనుభవించిన నాయకత్వం ఉంటేనే రైతుల కష్టాలు తీరుతాయి. రైతుల సమస్యలను తన సమస్యలుగా భావించే ప్రభుత్వాధినేత ఉంటేనే సాగు సవ్యంగా ముందుకు సాగుతది. సకాలంలో అన్నదాతలకు అన్ని సమకూరుతయి. అంతేతప్ప, ఏడ లంకె బిందలు దొరకుతయ్, ఎక్కడ బంగారు ఖజానా దొరుకుతదనే ఆలోచనలున్న నాయకుడు ప్రభుత్వాధినేతగా ఉన్నంతకాలం అన్నదాతలకు ఈ కష్టాలు తప్పవు.
-సల్వాజి మాధవరావ్
90525 63147