ఏ చేను చూసినా ఏమున్నది ఆశ!
వ్యవసాయ సంక్షోభం అంటే అది కేవలం రైతులకు పరిమితమైన సమస్య కాదు. ఇది మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై దుష్ప్రభావాన్ని చూపుతుంది. పాలకుల దూరదృష్టి లేని విధానాలు, అస్తవ్యస్తమైన ప్రణాళికలు, బాధ్యతారాహిత్య వైఖరిపై రైతులు కష్టాల్లో పడ్డారు.
వర్షాకాలం ఆరంభమైన నాటి నుంచి మా అందోల్ నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండలాల్లో విస్తృతంగా పర్యటించాను. కరువు నేపథ్యంలో క్షేత్రస్థాయిలో రైతన్న కష్టాలను చూశాను, ఆవేదనను విన్నాను. పుల్కల్ , చౌటకూర్, ఆందోల్, టేక్మాల్ మండలాల్లో వరి పంటనే ఎక్కువగా సాగు చేస్తుంటారు. అల్లాదుర్గం, వటపల్లి మండలాల్లో అక్కడక్కడ వరి వేస్తే మిగతా గ్రామాల్లో పత్తి వేస్తారు. ఇక రైకోడ్, మునిపల్లి మండలాల్లో 90 శాతం పత్తి పంటనే సాగు చేస్తారు. పత్తి, వరి, కంది పంటలతో పాటు కూరగాయలు సాగు చేసిన రైతుల పొలాల గట్ల వెంబడి నడుస్తూ వారి గోడును విన్నాను. ఎల్-నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరించినా ప్రభుత్వం కనీస ముందస్తు ప్రణాళికలు గానీ, ప్రత్యామ్నాయ చర్యలు గానీ చేపట్టలేదు. పాలకుల ఈ ఘోర నిర్లక్ష్యం అన్నదాతల పాలిట శాపంగా మారింది. ప్రకృతి కన్నెర్రజేస్తే ఆదుకోవాల్సిన బాధ్యతాయుతమైన ప్రభుత్వం, తన కర్తవ్యం నుంచి పూర్తిగా తప్పుకొన్నది. మూడు నెలల నా పర్యటనలో, రైతులతో జరిపిన ప్రతి సంభాషణలోనూ వారి ఆవేదన, ఆక్రందన, ఆగ్రహం స్పష్టంగా కనిపించాయి.
వ్యవసాయ సంక్షోభం అంటే అది కేవలం రైతులకు పరిమితమైన సమస్య కాదు. ఇది మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై దుష్ప్రభావాన్ని చూపుతుంది. పాలకుల దూరదృష్టి లేని విధానాలు, అస్తవ్యస్తమైన ప్రణాళికలు, బాధ్యతారాహిత్య వైఖరిపై రైతులు కష్టాల్లో పడ్డారు. రాష్ట్రంలో ఏ రైతును కదిలించినా తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. మా ఆశను ప్రభుత్వమే చంపేసింది అని అన్నదాత కృష్ణయ్య గద్గద స్వరంతో చెప్తుంటే కన్నీళ్లు ఆగలేదు. పాలకుల నిర్లక్ష్యానికి, కరెంటు సరఫరా వైఫల్యానికి ఫలితంగా ఆ రైతుకు ఏకంగా రూ.15 లక్షల భారీ పంట నష్టం వాటిల్లింది. ‘రోజుకు పది సార్లు కరెంటు పోతుంది సార్. వచ్చిన కొంచెం సేపు కూడా లో-వోల్టేజ్‌తో మోటర్లు నడువవు.
బోర్లు ఎండిపోతున్నయి, నిలబడ్డ పంట మాడిపోతున్నదని మరో రైతు ఆవేదన చెందాడు. టెక్మాల్ మండలం కుసంగి, దన్నారం గ్రామాల మీదుగా వెళ్తుంటే దారిలో మానెమ్మ అనే మహిళ, డిగ్రీ పూర్తి చేసిన ఆమె కుమారుడు కరుణాకర్ కనిపిస్తే వారితో మాట్లాడాను. రెండెకరాల పొలాన్ని కాపాడుకోవడానికి లక్ష రూపాయల అప్పు చేసి 700 మీటర్ల దూరం నుంచి పైపులు వేస్తున్నారు. సంక్షోభంలోనూ పంటను బతికించుకోవాలనే వారి ఆశ నన్ను కదిలించింది. బిడ్డల్లాంటి పైరును ఎండబెట్టుకుంటే ఎట్లా బతకాలి? అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
పొలం గట్టున దిగులుగా నిలబడ్డ బాలయ్య అనే రైతుతో మాట్లాడాను. పంట పొట్ట దశ దాటి గింజ కట్టిన సమయంలో ఇంకొక్క తడి అంది ఉంటే, అది పూర్తిస్థాయిలో మేలైన దిగుబడిని ఇచ్చేది. కానీ చివరి దశలో చుక్క నీరు అందక, గింజలో బలం లేక పైరంతా నేలకొరిగిపోయింది. యువ రైతు దుర్గయ్య పరిస్థితి చూస్తే గుండె బరువెక్కుతుంది. అతనికి ఉన్న సొంత ఐదెకరాల పంట పూర్తిగా ఎండిపోయింది. కౌలుకు తీసుకున్న ఐదెకరాలు కూడా మాడిపోయింది. కరువు విళయం, సర్కార్ నిర్లక్ష్యంతో ఎందరో రైతులు ఎన్నో ఆశలతో వేసిన వరి చేలను పశువుల గ్రాసం కోసం కోసేశారు. మరికొందరైతే కోత కోయించడానికి కూడా చేతిలో పైసల్లేక, పశువులనే చేలలోకి తోలి మేపుతున్నారు. అలా పశువులను మేపుతున్న ఒక రైతును పలుకరిస్తే విస్తుపోయే నిజాన్ని చెప్పారు. కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైందని వాపోయారు. అన్నదాతల బాధ ఇట్లా ఉంటే పాలక పెద్దలకు చీమ కుట్టినట్టయినా లేకపోవడం సిగ్గుచేటు.
వరి రైతుల పరిస్థితి ఇలా ఉంటే, పత్తి రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. మార్గమధ్యలో ఒక పత్తి చేనులోకి వెళ్లి పరిశీలిస్తే ఆందోళనకరమైన వాస్తవాలు కనిపించాయి. సరిపడా నీటివసతి, అనుకూల వాతావరణం ఉంటే ఒక్కో పత్తి చెట్టుకు దాదాపు 60 కాయల వరకు కాస్తాయి. కానీ ఈ వర్షాభావ పరిస్థితుల్లో అక్కడ చెట్టుకు కనీసం 20 కాయలు కూడా లేవు. గతంలో ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి వచ్చేది. కానీ ఇప్పుడు దుర్భిక్ష పరిస్థితుల్లో ఎకరాకు కేవలం 2 నుంచి 3 క్వింటాళ్లు వస్తే అదే గొప్ప అన్నట్టు ఉన్నది పరిస్థితి. ఎకరాకు వేల రూపాయల పెట్టుబడులు పెట్టి, పురుగుల మందులు కొట్టి అప్పులపాలైన పత్తి రైతులకు కనీసం పెట్టిన పెట్టుబడిలో నాలుగో వంతు కూడా తిరిగి రాని దారుణ పరిస్థితి నెలకొన్నది.
మా నియోజకవర్గంలోని సింగూర్ , పోచారం, ముద్దాయిపేట, పుల్కల్, మింపూర్, కోడూరు, ఐసోజిపేట, గొంగళూర్, ఇసాజిపేట, చక్రియల్, శివంపేట్, వెండికోల్, లింగంపల్లి, కోరిపోల్ నుంచి కోరంపల్లి గ్రామం పక్కనే మంజీరా నది ప్రవహిస్తుంది. గతంలో కేసీఆర్ హయాంలో రైతుల కోసం ఈ నదిపై చెక్ డ్యామ్ నిర్మించారు. ఏటా ఈ చెక్‌డ్యామ్‌లో నీళ్లు నిండుగా కళకళలాడుతూ ఉండేవి. కానీ నేడు చూస్తే ఆ చెక్ డ్యామ్ చుక్క నీరు లేక పూర్తిగా ఎండిపోయి, నెర్రలు వారి దర్శనమిస్తున్నది. ఈ దారుణ దుస్థితికి అసలు కారణం పాలకుల అనాలోచిత వైఖరే. సింగూరు ప్రాజెక్టులో ఏకంగా 22 టీఎంసీల నీటి నిల్వ ఉన్న సమయంలో, మరమ్మతుల పేరుతో దిగువకు భారీగా నీటిని వదిలేసి ప్రాజెక్టును ఖాళీ చేసేశారు. నిజానికి ఆ సమయంలో కనీస జ్ఞానంతో ఆలోచించి ఉంటే, ఆ నీటితో ఆందోల్ నియోజకవర్గంలోని పరిసర చెరువులు, కుంటలు, కాలువలు, మంజీరా చెక్‌డ్యామ్‌లను ముందుగానే నింపి నిల్వ చేయాల్సింది. కానీ ప్రభుత్వం ఎలాంటి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోలేదు. ఫలితంగా నేడు భూగర్భ జలాలు అడుగంటిపోయాయి, జలాశయాలు వట్టిపోయాయి.
కోరంపల్లి ఏటా వేల క్వింటాళ్ల మేలైన వరి ధాన్యాన్ని రాష్ర్టానికి అందించే అన్నపూర్ణ లాంటి ఊరు. నది పక్కనే ఉంటుంది కాబట్టి పరిస్థితి మె రుగ్గా ఉంటుందేమో అనుకున్నాం. కానీ గ్రామంలోకి అడుగుపెట్టగానే ఊరి కూడలిలో పదుల సంఖ్యలో రైతులు గుమిగూడి దిక్కుతోచని స్థితిలో ఒకరి బాధలు ఒకరు చెప్పుకొంటున్నారు. దాదాపు 20 మంది రైతులతో కలిసి కిలోమీటరు మేర నడుచుకుంటూ వెళ్తుంటే, అడుగడుగునా ఎండిపోయి న పైర్లు, బీటలు వారిన నేలలే దర్శనమిచ్చాయి. ప్రభుత్వం కరవు మండలాలను ప్రకటిస్తామని చెప్తున్నది కదా.. పంట నష్టాన్ని అంచనా వేయడానికి ఎవరైనా అధికారులు వచ్చారా? అని అడిగితే, ఆ రైతులు చెప్పిన మాటలు ప్రభుత్వ ఉదాసీనతను కండ్లకు కట్టాయి. ప్రభుత్వం తరఫున పలకరించిన దిక్కు లేదని అన్నదాతలు వాపోయారు. ఇవన్నీ క్షేత్రస్థాయిలోని అసలు వాస్తవాలు.
చాలా మంది రైతుల పంట మొత్తం ఎండిపోయి పైసా ఆదాయం వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. తీవ్ర కష్టాలకోర్చి పంటను కాపాడుకున్న రైతులకు 50 శాతం కూడా దిగుబడి దక్కలేదు. సాధారణ రైతులే ఎకరానికి దాదాపు రూ.50,000 వరకు అప్పులు చేయగా, కౌలు రైతులకైతే కౌలు రూ.15,000రూ.20,000తో కలిపి మొత్తం రూ.65,000 నుంచి రూ.70,000 వరకు పెట్టుబడి ఖర్చయింది. దీనికితోడు ప్రభుత్వమేమో దొడ్డు వడ్లు వేయొద్దు… సన్న వడ్లే వేయాలి అని రైతులకు ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ మాట నమ్మి రైతులంతా సన్న రకాలు సాగు చేస్తే, వాటికి చీడపీడలు, తెగుళ్లు ఎక్కువై పురుగుల మందులకే అదనంగా వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. దిగుబడి మాత్రం సగానికి పడిపోయింది. పాలకుల అనాలోచిత విధానాల వల్ల అన్నదాతలు నష్టపోయారు.
ప్రభుత్వాన్ని నిరంతర, నాణ్యమైన విద్యుత్తు అడిగినా వ్యర్థం. కాంగ్రెస్ పాలకులకు అది చేతగాదని అర్థమవుతున్నది. మేడిగడ్డ నుంచే నీళ్లెత్తని అసమర్థ పాలకులు వ్యవసాయానికి నీళ్లు ఇవ్వలేరని స్పష్టమవుతున్నది. కనుక రైతులకు ఉపశమనం కోసమైనా కొన్ని చర్యలు చేపట్టాలి. రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో మండలాల వారీగా సమగ్ర సర్వేలు నిర్వహించి, ఎండిన వరి, దెబ్బతిన్న పత్తి పంటలకు ఎకరాకు కనీసం రూ.25,000 నుంచి రూ.30,000 తక్షణ పరిహారం చెల్లించాలి.
రైతులు వేసిన కొత్త బోర్లు, పైప్లైన్ల ఖర్చులకు ప్రత్యేక సబ్సిడీ ప్రకటించాలి. తాగు, సాగునీటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన చేపట్టాలి. రైతులు, కౌలు రైతుల పంట రుణాలను తక్షణమే రీషెడ్యూల్ చేసి, ఈ ఏడాది వడ్డీని మాఫీ చేయాలి. వర్షాభావం తీవ్రంగా ఉన్న అన్ని మండలాలను తక్షణమే అధికారికంగా కరవు మండలాలుగా ప్రకటించి, ఉపాధి హామీ పనులను ముమ్మరం చేయాలి. పాలకులు నిర్లక్ష్యంతో రైతులు బలి చేస్తుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. సహాయ చర్యలు చేపట్టకపోతే, రైతుల పక్షాన నిలబడి పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే)
చంటి క్రాంతి కిరణ్
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

