1955లో ఫజల్ అలీ కమిషన్ నివేదికను పార్లమెంట్లో ప్రవేశపెట్టి, దానిపై చర్చించినప్పుడు అనారోగ్యంతో ఉన్న అంబేద్కర్ తాను పాల్గొనలేనందుకు విచారం వ్యక్తం చేశారు. తన అభిప్రాయాలను ‘థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్’ అనే పుస్తకం ద్వారా ప్రజల ముందుంచారు. అందులో అన్ని రాష్ర్టాల గురించి చర్చించారు. ఆ ప్రమాణాల ప్రకారం భారతదేశంలోనే ఇతర ఏ రాష్ర్టాలకు లేని హంగులతో, ప్రకృతితో దీవింపబడిన ప్రాంతం తెలంగాణ అనుకోవచ్చు. ఆ వివరాలు ఇవీ…
1.దక్కన్ పీఠభూమి మధ్యలో ఎత్తయిన ప్రదేశంలో తెలంగాణ ఉన్నది. వరదలు రావు. సముద్రతీరం ఎలాగూ లేదు కాబట్టి, వాతావరణం బాగుంటుంది. వాతావరణ ఆటుపోట్లు రావు. 2.భౌగోళికంగా త్రిభుజాకారంగా ఉండి, రవాణాకు అనువుగా ఉంటుంది. విస్తీర్ణం కూడా మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు. భారతదేశంలోని 16 రాష్ర్టాల కంటే తెలంగాణ పెద్దది. అలా అని బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అంత పెద్దది కాదు. పటిష్ఠమైన పాలనకు అనువైన విస్తీర్ణం కలిగి ఉంది. 3.జనాభా కూడా పరిపాలించదగిన సంఖ్యలో ఉంది. 4. అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఆర్థిక స్వావలంబనలో మిగతా రాష్ర్టాల కంటే మెరుగైన స్థితిలో ఉన్నది. రూ.22 కోట్ల వార్షికాదాయం ఉన్న ఆంధ్ర. రాష్ట్రం బొగ్గు వంటి ఖనిజాలు లేని ప్రాంతం. రూ.120 కోట్ల వార్షికాదాయం ఉన్న తెలంగాణతో ఆంధ్రను కలిపితే, తెలంగాణ దోపిడీకి గురవుతుంది.
చాలామందికి తెలియని ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం అవసరం. ఇప్పటిదాకా మానవ చరిత్రలో అత్యంత ధనవంతుడు హైదరాబాద్ పాలకుడు నిజాం. అంతేకాదు, ఆయన కళలు, సంస్కృతి, శిల్పకళ, భవన నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చాడు. ఓయూ నిర్మించాలని నిశ్చయించినప్పుడు నిజాం తన రాజ్యంలోని 10 మంది ఇంజినీర్లని, ఆర్కిటెక్ట్‌లను గ్రీసు, ఈజిప్ట్, ఇటలీ వంటి దాదాపు 11 దేశాలకు పంపించాడు. ఆయా దేశాల భవనాలు, కోటలు, స్మారక చిహ్నాలను పరిశీలించి రమ్మన్నాడు. వారు తిరిగొచ్చి రూపుదిద్దిన యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీని 1924లో మొదలుపెట్టి, 1929లో పూర్తిచేశారు. ఈ భవనం శిల్పకళలు పలురకాలుగా, అత్యద్భుత సౌందర్యంతో ఉంటాయి. (బహుశా పూర్వజన్మలో చంద్రబాబు హైదరాబాద్ నిజాంకు స్నేహితుడై ఈ సలహాలన్నీ ఇచ్చి ఉంటాడు.)
అన్నిరకాలుగా దేశంలోనే అత్యంత సంపన్నమైన తెలంగాణలోకి దూరాలన్న దురాలోచనలో ఆంధ్ర రాజకీయ నాయకులు నెహ్రూ మీద ఒత్తిడి పెంచారు. అది తట్టుకోలేక తెలంగాణ నాయకులతో సమావేశమై, వారిని ఒప్పిస్తే ముందుకు వెళ్లవచ్చని నెహ్రూ సలహా ఇచ్చాడు. ఇక ఆ మార్గదర్శకత్వంలో తెలంగాణ నాయకులను బతిమిలాడి, బామాలి, పుంఖాను పుంఖాలుగా రక్షణలిస్తామని చెప్పి (ఇప్పటి 6 గ్యారెంటీలు, సూపర్ సిక్స్లాగా) వారిని చర్చలకు ఒప్పించారు. వారి అన్ని సమావేశాల వివరాలు అప్రస్తుతం కాబట్టి, చివరి సమావేశం గురించి చూద్దాం. నిజాం కట్టిన హైదరాబాద్ అతిథి గృహంలో 1956లో జరిగిన సమావేశంలో పెద్ద మనుషుల (?) ఒప్పందం జరిగింది. తెలంగాణ నేతలు బూర్గుల రామకృష్ణారావు, కె.వి.రంగారెడ్డి, జె.వి.నర్సింగరావు, మర్రి చెన్నారెడ్డి; ఆంధ్ర నేతలు బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, అల్లూరి సత్యనారాయణరాజు, గౌతు లచ్చన్న ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారు చర్చించిన అంశాలు క్లుప్తంగా ఇవి. వాటిని ఎట్లా ఉల్లంఘించారో కూడా చూడవచ్చు.
1.సాధారణ పరిపాలనా వ్యయాన్ని ఇరు ప్రాంతాలు నిష్పత్తి ప్రకారం భరించాలి. ఏ ప్రాంత ఆదాయాన్ని ఆ ప్రాంత అభివృద్ధికి కేటాయించాలి. ఉల్లంఘన: విలీన సమయానికి హైదరాబాద్ రాష్ట్ర మిగులు నిధులు రూ.67 కోట్లున్నాయి. నిజాం 44 చిన్న ప్రాజెక్టులు రూపొందించి రూ.12 కోట్ల వ్యయంతో వాటి నిర్మాణానికి పథకం రూపొందించాడు. 1956, నవంబర్ 1న జరిగిన విలీనం తర్వాత మార్చిలో బడ్జెట్ సమావేశంలో ఆ ప్రాజెక్టుకు ఉద్దేశించిన నిధులు విడుదల చేయాలని తెలంగాణ శాసనసభ్యులు అడిగారు. కానీ, తెలంగాణ ఖాతాలో నిధులే లేవని చెప్పారు ఆంధ్ర నాయకులు. అంటే 4 నెలల కాలంలో రూ.67 కోట్లు హాంఫట్ అయ్యాయి ఆ మాంత్రికుల చేతుల్లో. ప్రకాశం బ్రిడ్జి, ధవళేశ్వరం బ్రిడ్జి మరమ్మతులు పూర్తయ్యాయి.
2.రాష్ట్రంలో తెలంగాణ విద్యాసంస్థల్లో, అంటే అన్ని కళాశాలల్లోనూ, సాంకేతిక కళాశాలల్లోనూ ముఖ్యంగా తెలంగాణ విద్యార్థులకే అడ్మిషన్ ఇవ్వాలి. కానీ, ఏం జరిగిందో ప్రజలకు తెలుసు.
3.ఉద్యోగ నియామకాలు ఉభయ ప్రాంతాల నిష్పత్తి ప్రకారం జరగాలి. కానీ, 2013లో సచివాలయంలో 787 మంది సెక్షన్ ఆఫీసర్లకుగానూ 787 మంది ఆంధ్రులే ఉన్నారు. ఒక్క తెలంగాణ ఉద్యోగి ఆ స్థాయిలో లేడు. ఈ విషయం 610 జీవోలో రికార్డయి ఉంది.
4.ఉర్దూ భాష ప్రాధాన్యం చదువుల్లో, ఉద్యోగాల్లో అలాగే ఉండాలి. ప్రాధాన్యం సంగతి దేవుడెరుగు, ముస్లింలను శత్రువులుగా చూశారు ఆంధ్రులు. అంతేకాదు, తమకు అవసరమైనప్పుడల్లా 550 సంవత్సరాలు కలిసి ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య మతకల్లోలాలు సృష్టించారు. ఆంధ్ర, రాయలసీమ నుంచి రౌడీలను రప్పించి వారిని ఊచకోత కోయించారు.
5.ఉద్యోగాలను కూడా ప్రాంతీయత ప్రకారం భర్తీ చేయాలి. తెలంగాణలో ఉద్యోగం పొందడానికి 12 ఏండ్లు ఈ ప్రాంతంలో నివసించి ఉండాలి. ఉద్యోగాల రిక్రూట్మెంట్లో ఎంత అన్యాయం జరిగిందో అనుభవించిన తెలంగాణ యువతకు తెలుసు. ఇక కళాశాలల విషయంలో చూద్దాం. జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీని మొదట ఆంధ్రలో 1972లో స్థాపించారు. తర్వాత 1985లో అన్ని ప్రాంతాలు, ముఖ్యంగా దూరప్రాంతాల పిల్లల కోసం అనంతపురం (రాయలసీమ), కాకినాడ (ఆంధ్ర), వరంగల్(తెలంగాణ)లలో మూడు కళాశాలలు స్థాపించాలని నిర్ణయించుకున్నారు. అనంతపురం, కాకినాడలలో యథాతథంగా స్థాపించి, తెలంగాణకు నిర్ణయించినది మాత్రం హైదరాబాద్‌కు మార్చారు. ఇంకేముంది? రాజధాని కాబట్టి అందరికీ హక్కుండి ప్రొఫెసర్లు, విద్యార్థులు 90 శాతం ఆరోజు నుంచి ఈరోజు దాకా ఆ యూనివర్సిటీని తెలంగాణేతరులే ఏలుతున్నారు. ఇక విలీనమప్పుడున్న మెడికల్ కాలేజీలు తెలంగాణలో మూడే. 2014 దాకా అవే మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలున్నాయి. కానీ, 4 జిల్లాలున్న రాయలసీమలో మటుకు ప్రభుత్వ, ప్రైవేటు కలిసి 11 మెడికల్ కాలేజీలు. ఆంధ్రవారి పాలన ఎంత నిష్పక్షపాతంగా ఉన్నదో వీటిని చూసి తెలుసుకోవచ్చు.
6.తెలంగాణ హక్కులు కాపాడేందుకు ఒక ప్రాంతీ య మండలి ఉండాలి. జిల్లాల నుంచి 9 మంది మంత్రులు అందులో సభ్యులుగా ఉంటారు. తెలంగాణ ప్రాంత వ్యవసాయ భూముల అమ్మకం ఈ మండలి అధీనంలో ఉండాలి. మొదట తెలంగాణ ప్రాంతీయ మండలిగా పేర్కొన్న దీన్ని, 1985లో ఆంధ్రప్రదేశ్ రీజినల్ కమిటీగా మార్చేసి ఆంధ్ర నాయకుల పెత్తనంలోనే ఉంచుకున్నారు. ఇక ఆ తర్వాత జిల్లాల భూములే కాదు, హైదరాబాద్‌లో కబ్జాలు కూడా జరిగాయి! చంద్రబాబు అసెంబ్లీలో తెలంగాణ అన్న పదం నిషేధించడానికి ముందే 30 ఏండ్ల క్రితం నుంచీ ఆంధ్ర నాయకులు జాగ్రత్తపడ్డారు. (ఒకటే బుద్ధి, డీఎన్ఏ కదా!)
శకుని అనుయాయులైన ఆంధ్ర నాయకులు (కురుక్షేత్ర యుద్ధంలో ఆంధ్ర రాజులు అధర్మపరులైన కౌరవులకు మద్దతిచ్చి, వారి వైపు యుద్ధం చేశారు) మొదటి నుంచి జాగ్రత్తపడ్డారు. ‘తెలంగాణ’ అన్న పదం ప్రజలకు వినపడకూడదని, ఉమ్మడి రాష్ర్టానికి ఢిల్లీలో నిర్ణయించిన పేరు ‘ఆంధ్ర-తెలంగాణ’ రాష్ట్రమైతే, ఢిల్లీలో చర్చల అనంతరం విశాలాంధ్రకు మద్దతుగా రాష్ట్ర విలీన నిర్ణయం జరిగాక, రాజకీయ నాయకులందరూ హైదరాబాద్‌లో విమానం దిగేటప్పటికి ఉమ్మడి రాష్ట్రం పేరు ‘ఆంధ్రప్రదేశ్’ అయింది. తెలంగాణ అన్న పదం గాలిలో కొట్టుకుపోయి ఆకాశంలో చేరింది. ఇప్పుడు ఆలోచించండి. ఇది పెద్దమనుషుల ఒప్పందమా? నేరస్థుల వాగ్దానాలా? తెలంగాణకు ఆ రోజు నుంచి ఆంధ్ర రాజకీయ నాయకులు ప్రతినాయకులయ్యారే తప్ప, ఎవరూ తమ వాగ్దానాల్లో ఒక్కటీ నెరవేర్చలేదు.
తమాషా ఏమంటే తెలంగాణ స్థానిక నాయకుడు ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నికల్లో చెప్పనివి ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేశారు. కేవలం రూ.720 కోట్లు వెచ్చించి మూడేండ్లలో ఇంద్రభవనం లాంటి సచివాలయం నిర్మించారు. మరి ఆంధ్ర రాజకీయ నాయకులు 1953 నుంచి వారి సొంత ప్రజల పట్ల ఇప్పటి ముఖ్యమంత్రి దాకా ప్రతినాయకులలాగానే వ్యవహరిస్తున్నారు. పైగా ఏమీ తెలియనట్టు ఇప్పుడు ఎన్నికల్లో గెలిచాక ‘మీకు ఇచ్చిన వాగ్దానాలు తీర్చాలంటే ఆంధ్రను అమ్మేయాలి’ అని నిస్సిగ్గుగా చెప్తున్నారు. మరి 72 ఏండ్లు వారి ప్రజలకే ఒక సాధారణమైన రాజధానిని ఏర్పర్చలేని నాయకులు.. ఇక పరాయి ప్రాంతానికి ఏం మేలు చేస్తారు? ఆంధ్రనైతే అమ్మేస్తారు, అమరావతి భూముల లాగా. కానీ, ఆ వచ్చిన ఆదాయం ప్రజలకు గాని, ప్రజాహిత పథకాలకు గాని ఖర్చుపెట్టరు. ఆ రకంగా హైదరాబాద్‌ను ఆక్రమించి ఆంధ్ర విశాలమైంది, తెలంగాణ కుంచించుకుపోయింది.
విలీన సమయంలో ఆంధ్ర నేతలకు నెహ్రూ ఒక స్పష్టమైన సలహా ఇచ్చాడు. తెలంగాణను అన్ని రకాలుగా అభివృద్ధి చేసి వారి సంపద వారి ప్రాంతంలోనే ఖర్చుపెట్టి తెలంగాణ ప్రజల నమ్మకాన్ని, అభిమానాన్ని చూరగొనాలని!
ఆంధ్ర నాయకులు లోలోపల నవ్వుకొని ఉంటారు ‘మన సంగతి పెద్దాయనకు ఇంకా తెలియలేదు’ అని. 12 మందితో మొట్టమొదటి మంత్రివర్గం ఏర్పడినప్పటి నుంచి ఆంధ్ర నాయకులు నెహ్రూ సలహాకు సరిగ్గా వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చారు. సంకుచితంగా, ‘నిలువెల్లా ఖలునికి విషమే’ అన్న నానుడిని నిజం చేస్తూ కక్షపూరితంగా ప్రవర్తించారు. మంత్రుల ఎంపికలో కూడా తెలంగాణ కావాలన్న మర్రి చెన్నారెడ్డి వంటి వారిని తప్పించి, విశాలంధ్రకు మద్దతిచ్చిన స్థానిక నేతలను ఆదరించారు. పైగా ఆంధ్రవారు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర నుంచి ఉప ముఖ్యమంత్రి అవ్వాలన్న నిబంధనను తుంగలో తొక్కారు. ముందురోజు దాకా ఉపముఖ్యమంత్రిగా ఉన్నాయన ఆ స్థానాన్ని ఆరో వేలుతో పోల్చాడు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే.. ఇటు బూర్గుల రామకృష్ణారావును, అటు బెజవాడ గోపాలరెడ్డిని పక్కకునెట్టేసి, ఎస్సెల్సీ పరీక్షలో కాపీ కొడుతూ పట్టుబడి, ఐదేండ్లు పరీక్ష రాయకుండా నిషేధం ఎదుర్కొన్న మహా నిజాయితీపరుడు నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు!
-కనకదుర్గ దంటు
89772 43484