‘ఆశావహ అంచనాకు, సాధించిన ఫలితానికి మధ్య ఉండే తేడా ఆశాభంగం తప్ప మరేమీ కాదు’ ఈ మాటలు చెప్పింది తత్వవేత్తో లేదా వ్యక్తిత్వ వికాస నిపుణుడో కాదు. సాక్షాత్తూ భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్. మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీల ఎన్నికల తేదీలు ప్రకటిస్తూ మంగళవారం ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఇదొకటి. ఇటీవలి హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వాస్తవ ఫలితాలకు భిన్నంగా ఉండటంతో ఈ అంశంపై ఈసీ అభిప్రాయాలు, పాత్ర గురించి తొలిసారి సీఈసీ విస్తృతంగా మాట్లాడారు.
హరియాణా ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున ఎన్నికల సంఘం కావాలని బీజేపీకి తొలి రౌండ్లలో ఆధిక్యం వచ్చేవరకూ ఆగి ఉదయం 9.30 గంటలకు తన వెబ్సైట్లో ఫలితాల సరళి వెల్లడించిందని కాంగ్రెస్ ఆరోపించడంతో ఈ వివాదం మొదలైంది. ఈ సందర్భంగా ఎగ్జిట్‌పోల్స్‌పై తమ నియంత్రణ ఏమీ ఉండదంటూనే ఇకనుంచి ఎగ్జిట్‌పోల్స్ లోపరహితంగా, కట్టుదిట్టంగా చేయాలని రాజీవ్‌కుమార్ చేసిన సూచన స్వాగతించాల్సిన అంశమే. కానీ, ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు ఎప్పటివరకు ప్రకటించకూడదో ప్రతిసారీ ఈసీయే నిర్ణయిస్తుంది.
వాస్తవానికి ఇండియాలో అత్యధికంగా నాలుగుసార్లు పార్లమెంటు ఎన్నికలు జరిగిన 1990 దశకంలో దశలవారీ పోలింగ్ ప్రక్రియ విస్తృతంగా నిర్వహించిన సంవత్సరాల్లో ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు లేదా అంచనాలను కూడా దశలవారీ పోలింగ్ ముగిసిన రోజుల్లోనే ప్రకటించేవి పోలింగ్ సంస్థలు, వాటికి సర్వే బాధ్యతలు అప్పగించిన టీవీ చానళ్లు లేదా దినపత్రికలు. అయితే, రెండు నుంచి ఆరేడు దశల్లో ఎన్నికలు జరిగినప్పుడు దశలవారీ ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు రెండో దశ నుంచి చివరి దశ పోలింగ్ వరకూ ఓటర్లను ప్రభావితం చేస్తాయనే కారణంతో ఎన్నికల సంఘం ఈ తరహా ఎగ్జిట్‌పోల్స్‌ను పాతికేండ్ల కిందటే రద్దుచేసింది.
ఈ దశలవారీ ఎగ్జిట్‌పోల్స్ అంచనాల వెల్లడి వల్ల ఓటర్లపై దుష్ప్రభావం ఉండనే ఉండదని రాజకీయ పండితులు, ఎన్నికల విశ్లేషకులు ఎందరు వాదించినా ఎన్నికల సంఘం పట్టించుకోలేదు. చివరికి ప్రసిద్ధ ‘హిందూ’ మీడియా గ్రూప్‌కు చెందిన ఎన్.రామ్ సహా అనేకమంది జర్నలిస్టులు సుప్రీంకోర్టుకు ఈ విషయంపై వెళ్లారు. అయితే, సర్వోన్నత న్యాయస్థానం ఈసీ నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పు ఇవ్వడంతో సాధారణ ఎన్నికల సమయంలో జరిపించిన ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను దాదాపు రెండు నెలలపాటు ఆగి ఒకేసారి ప్రకటించే పద్ధతిని గత పాతికేండ్లుగా ఇండియాలో అనుసరిస్తున్నారు.
ఐదేండ్లకోసారి జరిగే పార్లమెంటు ఎన్నికల (నాలుగైదు రాష్ర్టాల అసెంబ్లీలతో కలిపి) ప్రక్రియ షెడ్యూల్ విడుదల నుంచి చివరి దశ పోలింగ్ వరకూ దాదాపు రెండు నెలలకు పైగా ఉండటంతో చివరి దశ పోలింగ్ ముగిసిన అరగంటకు ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు విడుదలు చేయడం, అప్పటి నుంచి మూడు నాలుగు రోజులకు జరిగే ఓట్ల లెక్కింపులో అసలు ఫలితాల వెల్లడి కారణంగా ఎగ్జిట్ పోల్స్‌కు ప్రాధాన్యం తగ్గలేదు. కానీ, అతి కొద్దిరోజుల్లో ‘ఎగ్జిట్ పోల్స్’ ఫలితాలు రావడంతో పూర్వస్థాయిలో అవి ఆసక్తి, ఉత్సుకతను ప్రజల్లో రేకెత్తించలేకపోతున్నాయి. పోలింగ్‌కు ఎగ్జిట్‌పోల్స్ అంచనాల ప్రకటనకు మధ్య దూరం మరీ ఎక్కువవుతున్నది. పార్లమెంట్, పలు రాష్ర్టాల శాసనసభల ఎన్నికలకు సంబంధించి పలు పోలింగ్ (మార్కెటింగ్ సర్వే), మీడియా సంస్థలు జరిపే ఎన్నికల సర్వేలు, ఎగ్జిట్‌పోల్స్ 1980ల ఆరంభం నుంచి 1990ల చివరి వరకూ దేశ ప్రజల దృష్టిని మరింత ఆకర్షిస్తూ వచ్చాయి.
21వ శతాబ్దంలో దశలవారీ ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల ప్రకటనపై నిషేధం విధించినా అవి ప్రాధాన్యం కోల్పోలేదు. వాస్తవానికి ఇండియాలో రెండో సాధారణ ఎన్నికల్లో తొలిసారి ఎగ్జిట్‌పోల్స్ నిర్వహించారు. 1957 మార్చిలో జరిగిన ఈ ఎన్నికల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ ఎగ్జిట్ పోల్స్ పరిమిత స్థాయిలో నిర్వహించి అంచనాలు ప్రకటించింది.
1980లు, 1990ల చివరి మధ్య ప్రఖ్యాత సెఫాలజిస్టులు ప్రణయ్ రాయ్, యోగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎగ్జిట్‌పోల్స్ శాంపిల్ సైజు 20,000, 30,000ల మధ్య ఉండేది. 1996 పార్లమెంట్ ఎన్నికల్లో సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్) తొలిసారి దూరదర్శన్ కోసం చేసిన ఎగ్జిట్‌పోల్‌లో 17,604 మంది ఓటర్లను పోలింగ్ కేంద్రాల బయట కలిసి అంచనాలు రూపొందించింది.
2000 సంవత్సరం నుంచి అంటే గత పాతికేండ్లలో ఈ పోలింగ్ సంస్థలు ఓటేసి వచ్చేవారిని ప్రశ్నావళితో కలిసి వారెవరికి ఓటేశారో వాకబు చేసే పద్ధతి మారలేదు గాని ఈ సంస్థల ప్రతినిధులు కలిసే ఓటర్ల సంఖ్య నియోజకవర్గాల వారీగా బాగా పెరిగిపోయింది. ప్రశ్నావళి నాణ్యత పెరగడంతోపాటు పోల్స్టర్లు కలిసే ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరగడం వల్ల మెరుగైన ఫలితాలు రావడం మొదలయ్యాయి. అయినా, అప్పుడప్పుడూ ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు ఊహించనిరీతిలో తప్పుతున్నాయి.
14వ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై దాదాపు అన్ని సర్వే సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు తప్పని మూడు రోజుల తర్వాత జరిగిన ఓట్ల లెక్కింపులో తేలిపోయింది. మెజారిటీ సర్వే మీడియా సంస్థల ఎగ్జిట్‌పోల్స్ నాటి పాలకపక్షమైన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేదే గెలుపు అని జోస్యం చెప్పాయి. దేశంలో మొదటిసారి ఎగ్జిట్స్‌పోల్స్ భారీస్థాయిలో విఫలమైంది ఈ 2004 సాధారణ ఎన్నికల్లోనే. ప్రతి ఎగ్జిట్‌పోల్ ఫలితం ప్రకటించే ముందు తమ అంచనా ప్రకారమే ఫలితాలుండాలని లేదని చెప్పడం ఆనవాయితీయే.
2023 మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ ఎగ్జిట్‌పోల్స్ అంచనాలకు భిన్నంగా కాంగ్రెస్ భారీ మెజారిటీతో విజయం సాధించింది. అలాగే, 2024 లోక్‌సభ ఎన్నికల్లో పాలక ఎన్డీయే కూటమిని నడుపుతున్న బీజేపీ మెజారిటీ మార్క్ (మొత్తం 543 సీట్లకు గాను 272) సాధిస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్స్ జోస్యం చెప్పాయి. ఎలాంటి సర్వేలు లేకుండా వివిధ రాష్ర్టాల్లో పర్యటనలు, ప్రజలతో సంభాషణల ద్వారా రాజకీయ, ఎన్నికల విశ్లేషకుడు యోగేంద్రయాదవ్ ఒక్కరే బీజేపీకి ఈ ఎన్నికల్లో 240 సీట్లు మించవని అంచనా వేసి చెప్పడం, అది నిజం కావడం ఈ ఏడాది సంచలనంగా భావించవచ్చు.
అమెరికా విషయానికి వస్తే అక్కడ ఓటర్ల అభిప్రాయాల సేకరణ ద్వారా ఎగ్జిట్‌పోల్స్ సహా ఎన్నికల సర్వేలు జరిపే ఆర్గనైజేషన్లను పోలింగ్ సంస్థలు అంటారు. ‘పోలింగ్ పరిశ్రమ’గా అగ్రరాజ్యంలో ఇది పాతుకుపోయింది. అమెరికాలో ఎంతో ‘శాస్త్రీయ’ పద్ధతిలో కట్టుదిట్టంగా, పకడ్బందీగా ఎగ్జిట్‌పోల్స్ జరుపుతారని భావించినా వాటి జోస్యాలు కూడా తప్పని రుజువైన సందర్భాలు గత పాతికేండ్లలో అనేకం ఉన్నాయి.
ప్రధానంగా రేపొచ్చే నవంబర్ 5 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడైన డోనాల్డ్ ట్రంప్‌పై 2016 అధ్యక్ష ఎన్నికల్లో నాటి డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గెలుపు 90 శాతం ఖాయమని అత్యధిక ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేసి చెప్పాయి. కానీ, ఫలితం అందుకు విరుద్ధంగా వచ్చి ట్రంప్ సంచలన విజయం సాధించారు. ఈ ఏడాది ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలు, డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్ తొలి దశలో సాధించిన ఆధిక్యం ఆవిరై, ట్రంప్ నెమ్మది నెమ్మదిగా ఎక్కువ జనాదరణ సాధిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
దీనికి తోడు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, హమాస్, హిజ్బొల్లాల దూకుడు కారణంగా ఈ యూదు రాజ్యం దుర్మార్గ ధోరణులను వ్యతిరేకించే డెమొక్రాట్లు, లిబరల్స్ ఓటింగ్‌కు దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువ అని వస్తున్న వార్తల నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. మారిన పరిస్థితుల్లో ట్రంప్ విజయం ఎవరినీ ఆశ్చర్యపరచకూడదనే వాదన కూడా నేడు బలంగా వినిపిస్తున్నది.
మళ్లీ ఇండియా విషయానికి వస్తే సీఈసీ రాజీవ్ కుమార్ చెప్పినట్టు ఎగ్జిట్‌పోల్స్ నిర్వహిం చే సర్వే, మీడియా సంస్థలు మరింత స్వీయనియంత్రణ, ఆత్మపరిశీలన ద్వారా అసలు ఎన్నికల ఫలితాలకు దగ్గరగా తమ అంచనాలు ఉండేలా కృషి చేయడం ఎంతో అవసరం. తమ సర్వే ప్రక్రియలోని లోపాలు అర్జెంటుగా సరిచేసుకోవాలి. అయితే, మొన్నటి 18వ లోక్‌సభ ఎన్నికల మాదిరిగా తొలి దశ నుంచి చివరి దశ పోలింగ్ ముగియడానికి 45 రోజులు పడితే ఎగ్జిట్‌పోల్స్ నిర్వహణ లోపరహితంగా ఉండదు.
వాటి ఫలితాలు వాస్తవ విరుద్ధంగా ఉండే ప్రమాదమే ఎక్కువ ఉంటుంది. ఓటర్ల సంఖ్య దాదాపు నూరు కోట్లకు చేరిందని, పోలింగ్ సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దసంఖ్యలో సాయుధ బలగాలు అవసరమనే సాకుతో ఇలా దాదాపు రెండు నెలలపాటు సాధారణ ఎన్నికల ప్రక్రియ సాగితే ఎన్నికల ప్రజాస్వామ్యం అనుకున్న రీతిలో పరిణతి సాధించదు. ప్రాతినిధ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోని లోపాలు ఇప్పుడిప్పుడే తగ్గుతున్న నేపథ్యంలో తక్షణమే ఎగ్జిట్‌పోల్స్ నాణ్యత మెరుగుపడాలనుకోవడం అత్యాశే అవుతుంది.
నాంచారయ్య మెరుగుమాల