‘ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)’ అంటేనే ఓ యుద్ధభూమి. అనేక సామాజిక ఉద్యమాలకు పురిటిగడ్డ.వందేమాతర ఉద్యమం మొదలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేవరకు సాగిన మలిదశ ఉద్యమం వరకు అనేక పోరాటాలకు ఒక వేదిక. ఇక్కడ చదివే విద్యార్థుల్లో ఎక్కువ శాతం బడుగు, బలహీనవర్గాల నుంచి వచ్చినవారే. రాష్ట్రంలో నలుమూలల నుంచి నాణ్యమైన విద్యను అభ్యసించడానికి ఇక్కడికి వస్తుంటారు. అటువంటి యూనివర్సిటీలో అధ్యాపక పోస్టులు భర్తీచేయక పుష్కర కాలం దాటింది. దాదాపు 75 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయని, త్వరలో నియామకాలుంటాయన్న వార్తలు నిత్యకృత్యమయ్యాయి కానీ, కార్యరూపం మాత్రం దాల్చడం లేదు. ఇటీవలే ఓయూలో పార్ట్‌టైమ్ అధ్యాపకుల కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. అందులో విధి విధానాలపై స్పష్టత లేదు. ఏదో నోటిఫికేషన్ ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు ఉంది.
సిలబస్ లేకుండా పరీక్షలను నిర్వహించారు. సబ్జెక్టులవారీగా నిర్వహించిన పరీక్షల్లో అభ్యర్థికి వచ్చిన మార్కుల ఆధారంగా కాకుండా, హాజరైన ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూకు పిలిచారు. పెట్టిన పరీక్షకు అసలు ఎన్ని మార్కులు కేటాయించారు? పీజీ, పీహెచ్‌డీతో పాటు నెట్/ సెట్ లాంటివాటికి ఎన్ని మార్కులను కేటాయించారో స్పష్టత లేదు. వాస్తవానికి యూనివర్సిటీల్లో అధ్యాపకుల పోస్టులను యూజీసీ నియమ, నిబంధనల ప్రకారం భర్తీ చేయాల్సి ఉంటుంది. కానీ, వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. చాలా విభాగాల్లో పీహెచ్డీ పూర్తిచేసి నెట్/ సెట్ వంటి వాటిల్లో అర్హత సాధించిన వారికి కాకుండా సామాజిక సమీకరణల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్టు ఉన్నదని పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓయూ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు హామీలు ఇచ్చారు. అందులో ప్రధానంగా ఓయూ తెలంగాణ రాష్ర్టానికి గుండెకాయ లాంటిదని, దాన్ని కాపాడుకోవాలని చెప్తూ ఓయూ అభివృద్ధికి రూ.1000 కోట్లను మంజూరు చేస్తూ జీవోను కూడా విడుదల చేశారు. రానున్న రోజుల్లో ఈ నిధులను ఏ మేరకు సద్వినియోగం చేస్తారో చూడాలి. ఇక నియామకాలను అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం లేకుండా, కులమతాలకతీతంగా చేపట్టాలని తెలిపారు. రెగ్యులర్ పోస్టులు దేవుడెరుగు, పార్ట్‌టైమ్ అధ్యాపకుల నియామకాలను కూడా కుల, వర్గ ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారంటే సీఎం రేవంత్ మాటలకు యూనివర్సిటీ అధికారులు ఎంత విలువ ఇస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు.
ఈ ఏడాది యూనివర్సిటీల్లో అధ్యాపకుల భర్తీకి జీవో 21ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ జీవోలో వంద మార్కులకుగాను డిగ్రీ, పీజీలతో పాటు పీహెచ్‌డీకి కూడా మార్కులను కేటాయించారు. పలు సబ్జెక్టుల్లో జాతీయస్థాయిలో నెట్ ఉత్తీర్ణతకు, రాష్ట్రస్థాయిలో సెట్ ఉత్తీర్ణతకు కూడా మార్కులను కేటాయించారు. వాస్తవానికి దేశవ్యాప్తంగా నిర్వహించే నెట్లో ఉత్తీర్ణత సాధించడం, రాష్ట్రస్థాయిలో నిర్వహించే సెట్‌తో పోల్చితే కొంత కఠినంగా ఉంటుంది. కనీసం ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ జీవో 21 ప్రకారం పార్ట్‌టైమ్ అధ్యాపకుల నియామకాలు జరుపకపోవడం శోచనీయం. నియామకాలు పారదర్శకంగా, పోటీ ఆధారంగా జరగాలి. ఇలా జరుగకుంటే యూజీసీ నిబంధనల ప్రకారం నెట్/ సెట్, పీహెచ్డీ వంటి అర్హతలు సాధించిన అభ్యర్థులకు అవకాశాల్లేకుండా పోతాయి. తెలంగాణలో వేలమంది అభ్యర్థులు జేఆర్ఎఫ్, నెట్ ఉత్తీర్ణతతో పాటు పీహెచ్డీ పూర్తిచేసి అధ్యాపక ఉద్యోగాల కోసం ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. వారిని కాదని ఇంటర్వ్యూ ప్యానెల్లో ఉన్న వారు మా కులం వాడని, మా మతం వాడని, మా ప్రాంతం వాడని, లేదా మా భావజాలం వాడని ఇష్టం వచ్చినట్టు అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తే ఇక మెరిట్ సాధించినవారి పరిస్థితి ఏమిటి?
ఇదిలా ఉంటే రెగ్యులర్ అధ్యాపకుల భర్తీ కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 21లో కొన్ని మార్పులు చేయాలని ఉద్యోగార్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వారి సూచనలకు సానుకూలంగా స్పందించి యూజీసీ నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేస్తే వేలమంది అభ్యర్థులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. తెలంగాణ వర్సిటీలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలంటే, అత్యుత్తమ ప్రతిభావంతులైన అధ్యాపకులను భర్తీచేయాల్సి ఉంటుంది.లేదంటే ప్రభుత్వ యూనివర్సిటీలు రాజకీయ నిరుద్యోగ పునరావాస కేంద్రాలుగా మిగిలే ప్రమాదం ఉన్నది.
ఇంతవరకు అన్ని వర్సిటీల్లో పూర్తిస్థాయి పాలక మండళ్లు కొలువుదీరలేదు. అన్ని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న వేల ఉద్యోగాలు కాకుండా 450 అధ్యాపకుల పోస్టులను మాత్రమే భర్తీ చేస్తారని పలు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. అది కూడా కాంట్రాక్ట్, పార్ట్‌టైం అధ్యాపకులను మినహాయించి అంటే ఇక నిరుద్యోగులకు మిగిలే పోస్టులెన్ని? ఈ నేపథ్యంలో మరొకసారి ఖాళీలను గుర్తించి పూర్తిస్థాయిలో యూనివర్సిటీ అధ్యాపకులను భర్తీ చేసినపుడే బడుగు, బలహీనవర్గాలకు నాణ్యమైన విద్యను అందించినట్టవుతుంది. కేంద్రం, యూజీసీ నుంచి రావాల్సిన నిధులు కూడా సకాలంలో విడుదలయ్యే అవకాశం ఉంటుంది. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు లోబడి పారదర్శకంగా, రాజకీయాలకతీతంగా, ఆశ్రిత పక్షపాతం లేకుండా యూనివర్సిటీల్లో ఆచార్యుల నియామకాలు చేపట్టాలన్న నిరుద్యోగ యువత ఆకాంక్షలకనుగుణంగా ప్రభుత్వం అడుగులు వేయాలి. అదేవిధంగా ఇటీవల జరిగిన పార్ట్‌టైమ్ అధ్యాపకుల నియామకాల్లో అవకతవకలు జరిగాయన్న అంశంపై యూనివర్సిటీ అధికారులు స్పందించి అర్హులైన ఉద్యోగార్థులకు న్యాయం చేయాలి.
-యం.అర్జున్