తెలంగాణ పోరాటాల గడ్డ. నాడు నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం, ఆ తర్వాత భూస్వాములపై జరిగిన శ్రామిక, రైతు పోరాటాలు చరిత్రలో నిలిచాయి. స్వతంత్ర భారతంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అందరూ చూశారు. ఈ పోరాటాల సమయంలో తెలుగు సాహిత్యం, ముఖ్యంగా తెలంగాణ సాహిత్యం తన ప్రత్యేక పాత్రను పోషించింది.
దీన్ని ఎవరూ తిరస్కరించలేరు. స్వరాష్ట్ర సాధనకు కేసీఆర్ చేసిన పోరా టం ఎవరూ మరిచిపోలేరు. ఈ పోరాటాలన్నింటికీ సాహిత్యమే నేపథ్యంలా నిలిచింది. అలాంటి తెలంగాణ గడ్డ మీద ఓ దళిత బహుజనుడి పోరాట గాథ ముందుగా హిందీలో ‘ఫాన్సీ’ (ఒక బహుజనుడి ఆత్మకథ-1918)గా వచ్చింది. తర్వాత డాక్టర్ కారం శంకర్ చేసిన తెలుగు అనువాదం ‘ఉరికంబం నీడలో’ కొద్దిరోజుల కిందట ఆవిష్కరించబడింది. ఈ పుస్తకం చాకలి కులానికి చెందిన కె.రాజన్న ఆత్మకథ.
ఆదిలాబాద్ జిల్లాలోని ఒక కుగ్రామంలో భూస్వాములు దమనకాండ సాగించడం, మహిళలపై అత్యాచారాలు ఆయన జీవితానికి నేపథ్యంగా ఉన్నాయి. దౌర్జన్యాన్ని సహించలేని రాజ న్న తప్పనిసరి పరిస్థితుల్లో కత్తి పట్టాల్సి వచ్చింది. ఆత్మరక్షణ ప్రయత్నంలో ఒక ప్రాణం బలైంది. తర్వాత కోర్టులు, ఉరికంబాలు, యావజ్జీవితాలూ, క్షమాభిక్షతో విడుదల కావడాలూ ఇదీ క్రమానుగతమైన ఘటనల పరంపర. రాజన్న జీవితం నిప్పుల కొలిమిలో కాకలు దీరింది.
చాకిరేవుకు వెళ్తున్న సమయంలో తన భార్యతో భూస్వామి అసభ్యంగా ప్రవర్తిస్తాడు. విషయం తెలుసుకున్న రాజన్న దొరను నిలదీస్తాడు. ఇది దొరకు కోపం తెప్పిస్తుంది. రాజన్నపై దాడి చేయాలని నిర్ణయించుకుంటాడు. దొర రాజన్నపై దాడి చేస్తాడు. కానీ, ఆ దాడిలో రాజన్నకు బదులు దొర చనిపోతాడు. ఊరి ప్రజలంతా మొదట రాజన్న చనిపోయాడనుకుంటారు. అంతేకాదు, మొదట ఆ శవంపై పడి రాజన్న భార్య ఏడుస్తుంది కూడా. దీపం వెలుతురులో చూస్తే చచ్చిపడి ఉన్నది దొర అని తెలుస్తుంది. ఆ తర్వాత పోలీసులు, న్యాయస్థానాలూ, జైళ్లూ రాజన్నను చుట్టుముట్టాయి. ‘ఇతడు ఒక ప్రమాదకరమైన వ్యక్తి. ఇతడు జీవించి ఉండటం ఈ సమాజానికి సురక్షితం కాదు. అందువల్ల ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారం ఇతడిని చనిపోయేంతవరుకు ఉరితీయాలి’ (పేజీ 31) అని జడ్జి తీర్పు చెప్పాడు.
ముషీరాబాద్ జైల్లో ఉన్నప్పుడు రాజన్న తండ్రి కొడుకుని ఉరి తీశారనుకొని గుండు గీసుకొని పిండ ప్రదానం చేశాడు. ఉరి తీయటానికి ముందే పెళ్లి చేసుకుంటానని భార్య అంటే రాజన్న ఒప్పుకొన్నాడు. దాంతో ఆమె వేరే పెళ్లి చేసుకుంది. రాజన్న ఉరిశిక్షను హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. ముషీరాబాద్ నుంచి రాజన్న చంచల్గూడ జైలుకు మారాడు. అక్కడే చదువు మీద ధ్యాస పెట్టాడు. అంతకుముందు 6వ తరగతి వరకు చదువుకున్న రాజన్న జైల్లో విద్యాభ్యాసం కొనసాగించాడు. 1990లో ఎన్టీఆర్ ప్రభుత్వం రాజన్నకు క్షమాభిక్ష ప్రసాదించింది. విడుదలైన తర్వాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసి ఓ ప్రముఖ హిందీ పత్రికలో చేరాడు. మళ్లీ పెండ్లి చేసుకున్నాడు. పిల్లలను చదివించాడు. పెంచి పెద్ద చేశాడు. ఇప్పటికీ రచనా వ్యాసంగం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇదీ క్లుప్తంగా రాజన్న జీవితం. దీన్ని తనకు బాగా అలవాటైన హిందీలో ‘ఫాన్సీ’ పేరుతో రాశాడు.
రాజన్న జీవితం ఆద్యంతం స్ఫూర్తిమంతమైన పోరాటాల మయం. 144 పేజీల పుస్తకంలో 16 ఫొటోలున్నాయి. దీన్ని ఎమెస్కో వారు ప్రచురించారు. ఎమెస్కో సంపాదకులు డాక్టర్ కె.చంద్రశేఖర్ రెడ్డి, నిఖిలేశ్వర్, అల్లం రాజయ్య, యాటకర్ల మల్లేశ్, అనువాదకులు కారం శంకర్ ముందుమాటలు, పుస్తక రచయిత సందేశాలు అందరినీ ఆలోచింపజేస్తాయి. ఒక్క మాటల్లో చెప్పాలంటే ప్రతి ఒక్కరూ చదవాలసిన పుస్తకం.
– (వ్యాసకర్త: సినీ గేయ రచయిత)
అక్కల చంద్రమౌళి 91775 41446