బీజేపీకి ప్రతి ఎన్నిక ఒక జుమ్లాగానే ఉంటుంది. అవి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, లోక్‌సభ ఎన్నికలు కావచ్చు. ఒక్కోసారి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు. సామాజిక సమీకరణలను ఆయుధాలుగా చేసుకుని ప్రత్యర్థులపై యుద్ధం చేయడం ఆ పార్టీకి ఆనవాయితీగా మారింది. తెలంగాణ ఎన్నికల్లో కూడా ఇదే ఫార్ములా ప్రయోగిస్తున్నది.
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సభలో ప్రధాని మోదీ బీసీ మంత్రం జపించడాన్ని ఈ కోణంలో నుంచే పరిశీలించాలి. వెనుకబడిన తరగతులకు అనేక విధాలుగా ప్రయోజనాలు కల్పించే కులగణనను అటకెక్కించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ఎన్నికల్లో రాజకీయ లబ్ధికోసం బీసీ సంక్షేమాన్ని ఎత్తుకోవడం విడ్డూరమే.
ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేసే సామాజికవర్గాలపై కమలం పార్టీ కన్నేసింది. తెలంగాణ జనాభాలో 52 శాతంగా ఉన్న వెనుకబడిన తరగతులను ఆకర్షించడానికి వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తున్నది బీజేపీ. కిందటేడాది ఆగస్టులో రాజస్థాన్‌కు చెందిన జగదీప్ ధన్కర్ను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం కూడా బీజేపీ పొలిటికల్ గేమ్‌లో భాగమే. రాజస్థాన్‌లో జాట్లు బలమైన సామాజికవర్గం. దీంతో ఈనెలలో జరిగే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముందుచూపుతో జగదీప్ ధన్కర్ను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసింది. రాజస్థాన్‌లో జాట్ సామాజిక వర్గం కొంతకాలంగా బీజేపీకి దూరమైంది.
2018 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కారణం ఇదే. ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ మ్యాజిక్ పనిచేయలేదు. దాదాపు రెండేండ్ల కిందట మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో జరిగిన ఆందోళనల్లో కీలకపాత్ర పోషించింది జాట్లే. జాట్ సామాజికవర్గం మౌలికంగా వ్యవసాయంపై ఆధారపడ్డ సమూహం. కాగా నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా రైతులను పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన జగదీప్ ధన్కర్కు ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వడం ద్వారా దేశంలోని రైతన్నల ఆదరణ పొందవచ్చన్నది బీజేపీ ఆలోచన. ఇదిలా ఉంటే, తాజాగా తెలంగాణలో పాగా వేయడానికి బీసీల జపం చేస్తున్నది.
తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే బీసీ నేతనే ముఖ్యమంత్రి అవుతారని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కులాలవారీగా జనాభా లెక్కలు తీయడంలో బీజేపీ రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నది. 2010లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా బీసీ జనాభాను లెక్కించాలని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ డిమాండ్ చేసింది. దీనికి స్పందించిన కాంగ్రెస్ ప్రభుత్వం కులాల వారీగా లెక్కలు తీయడానికి అంగీకరించింది. అప్పటికే జనాభా లెక్కల ప్రక్రియ మొదలైంది. దీంతో ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి కులాలవారీ జనాభా లెక్కలను తీయించింది కాంగ్రెస్ సర్కార్.
అయితే రకరకాల కారణాలతో ఈ వివరాలు బయటకు రాలేదు. అధికారంలోకి వచ్చినంక బీజేపీ నాయకులు ఆ విషయాన్ని మరచిపోయారు. బీసీలకు సంబంధించిన లెక్కల వివరాలు లేకపోవడంతో రిజర్వేషన్ల శాతం నిర్ణయించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ లెక్కలు స్పష్టంగా లేకపోవడం వల్లనే సుప్రీంకోర్టు, హైకోర్టులు రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించలేకపోతున్నాయి.బీసీ కమిషన్లు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. 1931 తర్వాత ఎస్సీ, ఎస్టీ మినహా కులాలవారీగా జనగణన చేపట్టనే లేదు. వెనుకబడిన తరగతుల జనాభాపై ఇప్పటివరకు అంచనాలే తప్ప ఒక స్పష్టత అంటూ లేదు. దీంతో మొత్తం జనాభాలో వెనుకబడిన తరగతుల శాతం ఎంత అనేది ఒక అంచనాగానే మిగిలిపోతున్నది. కులగణన వంటి కీలకమైన అంశాలను బీజేపీ ఏమేరకు కాపాడగలదన్నది ప్రశ్నార్థకమే.
ఎస్. అబ్దుల్ ఖాలిక్
63001 74320