చక్కెర వ్యాధి ఉన్నవారు దానిని నియంత్రణలో ఉంచుకోకుంటే నెమ్మదిగా గుండె, రక్తనాళాల సమస్యలు, కిడ్నీ, కండ్లు, నరాలు, పాదాలు, చిగుళ్లు, చర్మ సమస్యలతో పాటు హియరింగ్ లాస్, డిప్రెషన్, ఆల్జీమర్స్ వంటి ప్రమాదాలకు దారితీస్తాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా టైప్-2 డయాబెటిస్ సమస్యను ఎదుర్కొంటున్నది.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం, వాటిని చట్టబద్ధం చేస్తామని ఆ పార్టీ అగ్రనేతలు హామీ ఇచ్చారు. రెండున్నరేండ్లు గడుస్తున్నా వాటి ఊసే లేదు. ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రజాపాలన, ప్రగతి నివేదిక పేరుతో గ్రామసభలు, ఇతర కార్యక్రమాలు చేపడుతున్నది. రైతుభరోసా ఎగ్గొట్టింది. రుణమాఫీ చేయలేదు. ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదు. మూసీ సుందరీకరణ, హైడ్రా పేరిట పేదల ఇండ్లను కూల్చివేసింది. కళ్యాణలక్ష్మి, తులం బంగారం ఎగ్గొట్టింది. నిరుద్యోగులకు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలని నమ్మబలికి కేవలం 11 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది. ఆసరా పింఛన్లు రూ.4 వేల నుంచి రూ.6 వేలు చేస్తానని చెప్పిన మాట నిలబెట్టుకోలేదు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2,500, నిరుద్యోగులకు రూ.4 వేల భృతి ఊసెత్తడం లేదు. విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డులు, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు, మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ఎగ్గొట్టింది. కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేలు, రైతు కూలీలకు, ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని చెప్పి మోసం చేసింది. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, రూ.12 లక్షల దళితబంధును నిలిపివేసింది. సంక్షేమ గురుకుల పాఠశాలలను గాలికి వదిలేయడం చూస్తే ఇది పూర్తిగా ప్రజాకంటక పాలనగా మారింది.
కేవలం తొమ్మిదిన్నరేండ్లలో కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారు. కానీ గత రెండున్నరేండ్లలో రూ.3.47 లక్షల కోట్లు అప్పు చేసిన రేవంత్రెడ్డి పాత పథకాలు అమలు చేయకపోగా, కొత్త పథకాలు చేపట్టకుండా నిరంతరం మాజీ సీఎం కేసీఆర్ మీద నిందలు వేయడమే పనిగా పెట్టుకున్నారు.
ఆరు గ్యారెంటీల అమలు సంగతి ఏమో గానీ ఏడో గ్యారంటీ మాత్రం పక్కాగా అమలు చేయాలని కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తున్నది. హైడ్రా పేరుతో పేదల ఇండ్లను నిర్ధాక్షిణ్యంగా కూలుస్తున్నారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను పేదలకు అందించలేక, ఎలాంటి నోటీసులు లేకుండా ప్రభుత్వం కూలుస్తున్నది. పథకాల అమలుకు, ఇచ్చిన హామీలకు నిధులు లేవని పేద అరుపులు అరుస్తున్న ప్రభుత్వం మూసీ సుందరీకరణకు లక్షన్నర కోట్లు ఖర్చు పెడతామని పట్టుబడుతున్నది. మొదటి విడతలో పది వేల ఇండ్ల కూల్చివేతకు సిద్ధం కాగా ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇప్పుడు మంచిరేవులలో రూ.700 కోట్లతో ఓంకారేశ్వర ఆలయం, 100 అడుగుల శివుని విగ్రహం, మూసీ పరివాహకంలోనే మసీదు, చర్చి, గురుద్వారా నిర్మిస్తామని ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నది.
పథకాలు అమలు చేయాలని, హైడ్రా పేరుతో ఇండ్లు కూల్చవద్దని పేదలు కోరుతున్నా, అక్రమ కేసులతో వేధించవద్దని రైతులు, ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నా, ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆశాలు, అంగన్వాడీ కార్యకర్తలు నిరసనలు తెలుపుతున్నారు. రైతుభరోసా ఇవ్వాలని, కరెంటు సక్రమంగా ఇవ్వాలని, యూరియా అందుబాటులో ఉంచాలని, తమ భూములు లాక్కోవద్దని రైతాంగం కోరుతున్నా ఈ ప్రభుత్వం చెవికెక్కడం లేదు. విద్య, వైద్యం, ఉపాధి, ఆర్థిక రంగాల్లో తెలంగాణ నాడీవ్యవస్థను దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర ప్రతిష్టను దిగజారుస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలను తెలంగాణ సమాజం గ్రహిస్తున్నది. దీనికి సమాధానం చెప్పే సందర్భం కోసం ఎదురుచూస్తున్నది.
– డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి