‘ఈ పెద్దోళ్లున్నారే’ అనే నువ్వు నేను సినిమా డైలాగ్ ఇప్పుడు ఆంధ్రలో స్వల్ప మార్పుతో తెగ వాడేస్తున్నారు. ఏపీలో వైసీపీ ఓటమికి ప్రభుత్వ సలహాదారులే కారణమంటూ, ‘ఈ సలహాదారులున్నారే’ అనే విసుర్లు వెల్లువెత్తుతున్నాయి. జగన్‌ను ఎవరూ కలువకుండా సలహాదారులు దూరంగా పెడితే, ప్రజలేమో ఆయన్ని ప్రభుత్వానికి దూరంగా పెట్టారని సెటైర్లు విసురుతున్నారు. సలహాదారులేమో ‘ఆయన కలుస్తానంటే మేం ఏమైనా అడ్డుపడ్డామా?’ అని నసుగుతున్నారట.
బొకేకు డబ్బులు దండుగ
బొకేలు ఇవ్వడం కంటే మరేదైనా తీసుకరండని అప్పుడప్పుడు కొందరు నాయకులు అనడం విన్నాం. బొకేలకు డబ్బులు దండుగన్నది వారి అభిప్రాయం అయి ఉండవచ్చు కాబోలు. ఈ సూత్రాన్ని బీజేపీ నాయకులు మాత్రం అక్షరాల పాటిస్తున్నారు. చంద్రబాబు పదవీ స్వీకార కార్యక్రమానికి వచ్చిన అమిత్ షా తన కార్లో ఉన్న బొకేను చంద్రబాబు చేతికి ఇచ్చి, తిరిగి దానిని తన కార్లో పెట్టించారు. ఆ తర్వాత వచ్చిన జేపీ నడ్డా అదే బొకేను చంద్రబాబు చేతికిచ్చి తిరిగి దానిని తీసుకొని మళ్లీ కారులో పెట్టించారు. అదేరోజు సాయంత్రం ఒడిశా సీఎం ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. కొంపదీసి అదే బొకేను అక్కడికి తీసుకెళ్లారా ఏమిటని నెటిజన్లు జోకులు విసురుతున్నారు.
ఇదేమి కోరిక?
తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు అదేమి కోరికేమో కానీ ఆంధ్రలో ఎప్పటికీ కాంగ్రెస్ అధికారంలోకి రాకూడదని కోరుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా, ఏపీలో కాంగ్రెస్‌కు ఒక్క సీటు రాదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తేల్చేస్తే, తాజాగా బండ్ల గణేశ్.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు ఫొటోలు పక్కపక్కన పెట్టి ‘నా చంద్రన్న, నా రేవంతన్న ఎప్పటికీ ఇలానే ఉండాలి. రెండు రాష్ర్టాలనూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ’ అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంటే దీనర్థం ఆంధ్రలో ఎప్పటికీ కాంగ్రెస్ అధికారంలోకి రావద్దా? టీడీపీ సీఎంయే ఉండాలా? కాంగ్రెస్ నేతవై ఉండి ఇదేమి కోరికని కార్యకర్తలు మండిపడుతున్నారు.
‘మందే’ కారణమా?
కన్యాశుల్కం నాటకంలో దేశానికి స్వాతంత్య్రం వచ్చిందనంటే.. అయితే హెడ్డ్ (హెడ్ కానిస్టేబుల్) మారుతారా అని ఝట్కా బండివాడు అమాయకంగా ప్రశ్నిస్తాడు. ఆంధ్రలో ప్రస్తుతం సర్కార్ మారడంతో ఎక్కడచూసినా మందు బ్రాండ్లు మారుతాయా? కొత్త బ్రాండ్లు వస్తాయంటవా? అనే చర్చనే జరుగుతున్నదట. తాము అధికారంలోకి వస్తే మందు ధర తగ్గిస్తామన్న చంద్రబాబు హామీతో వైసీపీ ఓటు బ్యాంక్ టీడీపీకి మళ్లడమే జగన్ ఓటమికి కారణమని ఉండవల్లి అరుణ్‌కుమార్ విశ్లేషించడం గమనార్హం.
– వెల్జాల