POWER HAS ONLY ONE DUTY- TO SECURE THE SOCIAL WELFARE OF THE PEOPLE
-BENJAMIN DISRAELI
( బ్రిటన్ మాజీ అధ్యక్షులు)
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ఏకైక కర్తవ్యం. అయితే ఈ మాట మన స్వయంప్రకటిత విశ్వ గురువుల వారికి రుచించదు. వారి దృష్టిలో పేదల సంక్షేమం కోసం చేసే ఖర్చు వ్యర్థం కింద లెక్క! ప్రధానమంత్రి పీఠం అధివసించినా, వ్యాపార స్వభావంతో కూడిన లాభాపేక్షనే తప్ప, సామాజిక ప్రయోజన దృక్పథం వారికి కలగలేదు. సంపన్నులకు మరింత సంపదను కట్టబెట్టడమే అభివృద్ధిగా భావించే వారికి, పేదల కడుపు నింపే చర్యలు ఉత్త ఉచితాలుగానే కనిపిస్తాయి.
అసలు ఏది ఉచితం? ఏది అనుచితం? పాలకులు ఎవరి పక్షం వహిస్తున్నారన్న విషయం మీద ఆధారపడే ఆర్థిక ప్రణాళికలు రూపొందుతాయి. పేదవాడికి ఇచ్చే కిలో బియ్యం ఉచితంగా, రాయితీగా కనిపించే వాళ్లకు పారిశ్రామికవేత్తలకు ఇచ్చే స్థలాలు, కరెంటు, పన్ను రాయితీలు ఉచితాలుగా ఎందుకు కనిపించవు? అవీ ఉచితాలే. కాకపోతే దేశాభివృద్ధికి అవసరమైన విధంగా సమతూకంలో అన్నివర్గాలను కాపాడుకుంటూ సంపదను పెంచడం, ప్రజలకు పంచడం సమర్థవంతంగా జరిగితేనే సమ్మిళిత అభివృద్ధి సాధ్యమవుతుంది.
పేదవాళ్లకు ఇచ్చే ఉచితాలతోనే దేశం దివాళా తీస్తుందనే దిక్కుమాలిన సిద్ధాంతాలు బీజేపీ ప్రభుత్వ కాలంలోనే విరివిగా ప్రచారమవుతున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవమో పరిశీలిద్దాం. ఉదాహరణకు కిలోబియ్యం తినే పేద కూలీ రోజంతా పనిచేసి వంద రూపాయలు సంపాదించి తిరిగి తన జీవన అవసరాల కోసం ఆ డబ్బులు వెచ్చించినపుడు పన్నుల రూపేణా ప్రభుత్వానికి సంపద సమకూరుతుంది. అటు తన శ్రమతోను, ఇటు తన ఆదాయంతోను రెండు విధాలుగా పేద కూలీ దేశ సంపదను పెంచడంలో భాగస్వామ్యం పంచుకుంటున్నాడనే సత్యాన్ని సౌకర్యవంతంగా విస్మరించడం పేదల వ్యతిరేక ఆలోచనాసరళికి నిదర్శనం తప్ప వేరేమీ కాదు. పేదవాళ్ల కడుపు కొట్టి పెంచేదే సంపద అయితే, ఆ సంపద ఎవరి కోసం? అపర కుబేరుల కోసమా? అంబానీ, అదానీల కోసమా? పార్టీల కోసమా? పాలకుల కోసమా?
ఉచితాలను వ్యతిరేకించే బీజేపీ నేతలు ‘దళితబంధు’ కింద ఇచ్చే మొత్తాన్ని పది లక్షల నుంచి 20 లక్షలకు పెంచాలని ఎందుకు డిమాండ్ చేశారో వివరించాలి. మోదీ ఉచితాలే వద్దంటారు.. రాష్ట్ర నేతలు పెంచమంటారు. ఇదా మీ నీతి? ఇదా మీ విధానం? ఇంతకన్న మోసం ఉంటుందా? మీకు నిజంగా నిజాయితీ ఉంటే… ‘మేం అధికారంలోకి వస్తే, మా మోదీ గారి సిద్ధాంతం ప్రకారం ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, కల్యాణలక్ష్మి తదితర పథకాలన్నీ రద్దుచేస్తాం’ అని ప్రకటించండి. లోపల ఒకమాట, పైకి ఒకమాట ఎందుకు?
ప్రజా శ్రేయస్సును విస్మరించే ప్రభుత్వాలున్నా, లేకున్నా ఒక్కటే. ప్రభుత్వ పథకాల ఫలాలను అట్టడుగువర్గానికి అందించడమే అసలు సిసలు బాధ్యత. ఎనిమిదేండ్లుగా మోదీ ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించింది. ఇది వారి పాలనలోని ప్రణాళికలు, పథకాల్లో స్పష్టమవుతున్నది. ఓవైపు కార్పొరేట్లకు భారీ లాభం చేకూర్చిన మోదీ ప్రభుత్వం ఇంకోవైపు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర పెరగనప్పటికీ పెట్రో ఉత్పత్తులపై ‘సెస్’లను పెంచుతూ వాటి ధర ఆకాశాన్నంటేలా చేసింది. ఇటీవల నిత్యావసర వస్తువులైన పాలు, పెరుగు, ఉప్పు, గోధుమపిండి తదితరాలపై జీఎస్టీ విధించారు. పేదలను కొట్టి, పెద్దలకు పెట్టాలన్న సిద్ధాంతాన్ని ఈ రీతిన బీజేపీ అమలుచేస్తున్నది. ఇది ఏ రకం రీతి? ఇది ఏ రకం నీతి?
మోదీ ప్రభుత్వ హయాంలోనే 2017-18లో జరిగిన ఎకనమిక్ సర్వేలో ‘యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్’ (యూబీఐ)ను ప్రతిపాదించారు. ప్రతీ పేద కుటుంబానికి ఏడాదికి రూ.72 వేల ఆదాయం తప్పనిసరిగా సమకూర్చే బాధ్యత ప్రభుత్వం వహించాలని, ఈ విధంగా దేశంలో 30 శాతం మందికి ఇవ్వాల్సి ఉందని సర్వే సిఫారసు చేసింది. అయితే, తాము నిర్వహించిన సర్వే సిఫారసులను సైతం మోదీ ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది.
మోదీ ప్రభుత్వం విస్మరించిన దాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆచరణలో పెడుతున్నదని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఈ మాట అంటున్నది నేను కాదు. నాడు కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారు అయిన అరవింద్ సుబ్రహ్మణ్యం, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘రైతుబంధు’, ‘ఆసరా పింఛన్లు’ వంటి పథకాలు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ కల్పనకు చక్కని ఉదాహరణలని ‘ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్’ పత్రికకు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ‘రైతుబంధు’ నిర్మాణాత్మకంగా రైతులకు అందిస్తున్న పెట్టుబడి సాయం. సంక్షోభంలో చిక్కుకున్న వ్యవసాయాన్ని గట్టెక్కించేందుకు, నిస్తేజంగా మారిన రైతాంగంలో నూతన విశ్వాసాన్ని నెలకొల్పేందుకు ఈ పథకం అద్భుతంగా ఉపయోగపడింది. గత ప్రభుత్వాల హయాంలో ప్రభుత్వం నుంచి ఏ మద్దతు అందని కారణంగా పెట్టుబడి వ్యయం పెరిగి అప్పుల ఊబిలో చిక్కుకొని రైతులు ఆత్మహత్యలకు పాల్పడేవారు. ‘రైతుబంధు’ పథకం వచ్చిన తర్వాత పరిస్థితుల్లో సంపూర్ణమైన మార్పు వచ్చింది. దీనికి తోడుగా సాగునీటి కల్పన, ఉచిత విద్యుత్తు, రైతుబీమా అందించడంతో వ్యవసాయరంగంలో నూతన ఉత్తేజం నెలకొన్నది. వ్యవసాయ ఉత్పత్తి ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది.
నేడు రాష్ట్ర ఆదాయంలో 20 శాతం వ్యవసాయరంగం నుంచే సమకూరుతున్నదంటే వచ్చిన అభివృద్ధిని అర్థం చేసుకోవచ్చు. దీన్ని ఉచితాలు ఇవ్వడం అంటమా!? రైతులను ఆదుకోవడం అంటమా? అదే సమయంలో, ఎడమ చేతితో విదిలించినట్లు కేంద్ర ప్రభుత్వం ‘కిసాన్ సమ్మాన్ యోజన’ పేరుతో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నది. సవాలక్ష నిబంధనలతో, చాలా తక్కువ మొత్తం ఇవ్వడం వల్ల ఈ రాయితీ, బీజేపీకి ఉత్తరాదిలో ఎన్నికల లాభాలు చేకూర్చుతున్నదే తప్ప రైతులకు ఒరుగుతున్నదేమీ లేదు. ‘కిసాన్ సమ్మాన్ యోజన’ కేవలం పేద రైతుల బలహీనతలను వాడుకునే ఎత్తుగడ మాత్రమే తప్ప నిర్మాణాత్మక పథకం కాదు. కేంద్రం ఇచ్చే ‘కిసాన్ సమ్మాన్ యోజన’ డబ్బులు, రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సమకూర్చుకునేందుకు సరిపోయేవి కావు. ఏదో నామకార్థంగా కొంత ఇచ్చి, మరోవైపు ఎరువులు, క్రిమి సంహారకాల ధరలు పెంచడం, డీజిల్ ధర పెంపు వంటి చర్యలతో కేంద్రం వ్యవసాయ పెట్టుబడి వ్యయం పెరిగిపోయేలా చేసి దేశ రైతాంగం నడ్డి విరుస్తున్నది. పైనుంచి ఉచితాలు ఇవ్వొద్దని ఉచిత సలహాలను వల్లె వేస్తున్నది.
నేడు రాష్ట్ర ఆదాయంలో 20 శాతం వ్యవసాయరంగం నుంచే సమకూరుతున్నదంటే వచ్చిన అభివృద్ధిని అర్థం చేసుకోవచ్చు. దీన్ని ఉచితాలు ఇవ్వడం అంటమా!? రైతులను ఆదుకోవడం అంటమా? అదే సమయంలో, ఎడమ చేతితో విదిలించినట్లు కేంద్ర ప్రభుత్వం ‘కిసాన్ సమ్మాన్ యోజన’ పేరుతో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నది. సవాలక్ష నిబంధనలతో చాలా తక్కువ మొత్తం ఇవ్వడం వల్ల ఈ రాయితీ, బీజేపీకి ఉత్తరాదిలో ఎన్నికల లాభాలు చేకూర్చుతున్నదే తప్ప రైతులకు ఒరుగుతున్నదేమీ లేదు.
బీజేపీ ప్రభుత్వ కూటనీతికి మరో ఉదాహరణ ‘ఎన్పీఏ’ల రద్దు. ఈ రద్దుకు కేంద్ర ప్రభుత్వం ఓ అందమైన పేరు పెట్టింది. అదే ‘రైట్ ఆఫ్’. బ్యాంకులను లూటీ చేస్తూ లక్షల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని ఎగవేస్తే, ఆ రుణాలను ‘రైట్ ఆఫ్’ చేసి రుణ ఎగవేతదారులకు వెసులుబాటును, చట్టపరమైన రక్షణను కల్పిస్తున్నది. ఈ విధంగా కార్పొరేట్ కంపెనీలకు 11 లక్షల కోట్ల రూపాయలను ‘రైట్ ఆఫ్’ పేరుతో మాఫీ చేసింది. కానీ అన్నదాతలైన రైతులకు మాత్రం రుణమాఫీ చేయకూడదంటున్నది. దాన్ని ఉచితం కింద చిత్రీకరిస్తున్నది. రైతులకు రుణమాఫీ చేసిన రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్థిక క్రమశిక్షణ ఉల్లంఘించిన రాష్ర్టాలుగా పరిగణించి వేర్వేరు కారణాలతో ఆంక్షలు విధిస్తున్నది. కార్పొరేట్లకే తప్ప రైతులకు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రుణాల కల్పన కానీ, మాఫీ కానీ చేయకూడదనేది బీజేపీ వైఖరి. నేడు దేశంలో ఏం నడుస్తున్నదంటే.. ‘అట్టడుగు ప్రజలను కొట్టు- అస్మదీయులకు దోచిపెటు’్ట అన్న సిద్ధాంతం.
బీజేపీ ప్రభుత్వం సాయం చేసే కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య కోటి మించదు. కానీ, ఆ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయల ప్రయోజనాలు చేకూర్చారు. దేశంలో 64 శాతం మంది ప్రజలు (89 కోట్లమంది) వ్యవసాయం, వ్యవసాయానుబంధ రంగాలపై ఆధారపడి ఉన్నారు. కానీ వీరికి ఇచ్చే సబ్సిడీలకు ‘ఉచితాల’నే ముద్ర వేస్తారు. వీటివల్ల దేశానికి చేటు జరుగుతుందని గంభీరంగా ప్రసంగిస్తారు. దీనికి వారి వందిమాగధులైన కొద్దిమంది మిడిమిడి జ్ఞానపు ఆర్థికవేత్తలు వంత పాడుతారు. వాట్సప్ యూనివర్సిటీల ద్వారా వాదనలను తయారుచేసి ప్రచారంలో పెడతారు. అంతిమంగా పేద ప్రజల ఉసురు తీస్తారు. అసలు ‘ఉచితం’ అనే పదమే తప్పు. ప్రభుత్వ ప్రధాన లక్ష్యం సంక్షేమమైనపుడు ఉచితం ఎక్కడుంది? ఉచితం అని అనటమే అనుచితం. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చేది ఏదైనా ప్రజలిచ్చిన పన్ను సొమ్ముతో కొన్నదే కదా!
ఉచితాలపై ఇన్ని మాటలు మాట్లాడే బీజేపీ- యూపీ, బీహార్లలో ఎన్నికల సమయంలో ‘మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి యోజన పథకా’నికి ఇచ్చే పనిదినాలు వంద నుంచి 150కి పెంచామని ఎందుకు డప్పు కొట్టుకున్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని కూడా ఉచితాల కింద లెక్కేసి ఎద్దేవా చేసిన బీజేపీ పెద్దలు, ఎన్నికల సమయంలో మాత్రం ఇదే పథకాన్ని చూపెట్టి ఓట్లు దండుకున్నారు. ఇదీ బీజేపీ మార్కు ద్వంద నీతి.
మోదీ గారు చేసిన డిమానిటైజేషన్ (పెద్దనోట్ల రద్దు) ఎవరి ఆర్థిక ప్రయోజనాలను నెరవేర్చిందో బీజేపీ ఆర్థికవేత్తలు చెప్పాలి. ‘డిమానిటైజేషన్ వల్ల పెద్దలకే నష్టం. నల్ల డబ్బు బయటకు వస్తుంది’ అని ఊదరకొట్టారు. పేద, మధ్యతరగతి ప్రజలను ఏటీఎంల ముందు, బ్యాంకుల ముందు లైన్లు కట్టించారు తప్ప ఏ సంపన్నుడూ లైన్లో నిల్చోలేదు. ఇప్పటివరకు డిమానిటైజేషన్ వల్ల ఏం తేలిందో ఎవరికీ తెలియదు. వెయ్యి రూపాయల నోటు రద్దుచేసి, 2 వేల నోటు తేవడం తప్ప వచ్చిన మార్పు ఏంటో బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు. పైగా పెద్దనోట్ల రద్దు తర్వాత మన దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని విధంగా కుదేలైంది.
నేడు ద్రవ్యోల్బణం ప్రమాదకరమైన స్థాయిలో పెరుగుతున్నది. ఈ సమయంలో పేదల కొనుగోలుశక్తి పెంచే ఉద్దీపన చర్యలు చేపట్టాలి. కానీ అందుకు మన ప్రధానికి చేతులు రావు. కరోనా సమయంలో మన సీఎం కేసీఆర్ ‘హెలికాప్టర్ మనీ’ అవసరాన్ని గురించి నొక్కి చెప్పినప్పుడూ అంతే. ఏ ప్రతిస్పందనా లేదు. ‘ఆత్మ నిర్భర్ భారత్’ పేరుతో వాగాడంబరమే తప్ప దుర్భరమైపోతున్న పేదల బతుకుల్లో వెలుగులు నింపే ఏ ఒక్క నిర్దిష్ట నిర్మాణాత్మక చర్యకూ బీజేపీ ప్రభుత్వం పూనుకోలేదు.
ఎన్నికల ముందు పేదల పాట… ఎన్నికల తర్వాత పెద్ద గద్దల బాట.. ఇదే మోదీ ప్రభుత్వం అనుసరించే రాజకీయ సూత్రం. 2014 ఎన్నికల ముందు.. ‘విదేశాల నుంచి నల్లధనం తెస్తాం. ప్రతీ ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తాం’ అన్నరు. కానీ ఒక్కరి ఖాతాలో డబ్బులు పడకపోగా, స్విస్ బ్యాంకుల్లో నల్లధనం నిల్వలు గతం కన్నా రెట్టింపుగా పెరిగిపోయాయి. వందల ఏండ్లుగా సామాజిక వివక్ష, వెనకబాటుతనానికి గురై.. శాపగ్రస్త జీవితాలు అనుభవిస్తున్న దళితులకు అభివృద్ధి ఫలాలు సమానంగా అందించాలనే ఉదాత్తమైన లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దళిత బంధు’ పథకం బీజేపీ దృష్టిలో ఉచితాల కిందకు వస్తుంది. వారి దృష్టిలో ఇది తిరోగమన దృక్పథం.
ప్రజల గొంతెమ్మ కోర్కెలు తీర్చడమే ప్రభుత్వం పనా.. అని కొంతమంది వాదనకు దిగవచ్చు. కానీ, ప్రజలు ఏం కోరుకుంటున్నారు? వాటిని తీర్చే ఆర్థిక వనరులు తమ వద్ద ఉన్నాయా? లేవా? ప్రజల ఆకాంక్షలు తీర్చడం వల్ల సమాజంలో వచ్చే మార్పులు ఏమిటి? దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వర్గాలను ఆర్థికంగా ఎలా అభివృద్ధి చేయటం? తద్వారా సంపద అన్ని వర్గాలకు సమంగా పంచుతున్నామా? లేదా? అన్నది లెక్కలు వేసుకొనే ప్రతీ ప్రభుత్వం సంక్షేమ చర్యలు తీసుకుంటుంది. అన్నం పెట్టగలిగి ఉండి కూడా ఆకలిచావులు జరుగుతుంటే చూస్తూ ఉండటం పరిపాలన అనిపించుకుంటుందా? వెనుకబడిన సామాజిక వర్గాలు అభివృద్ధికి దూరంగా ఉండిపోతే వారి ఖర్మానికి వారిని వదిలేసి మిగతా సమాజం ముందుకు వెళ్లడం నాగరిక సమాజ లక్షణం అవుతుందా? అసమానతల వల్లే కదా ప్రపంచంలో తిరుగుబాట్లు చెలరేగాయి. ధనికుడు మరింత ధనికుడై, పేదలు మరింత పేదరికంలో కూరుకుపోతే ఆ అసమ సమాజంలో ఎటువంటి ఉత్పాతాలు చెలరేగుతాయో అంచనాలు ఉండవద్దా? తమను అభివృద్ధికి దూరం చేస్తున్నారని కొన్ని వర్గాలు అశాంతితో రగిలిపోతే ఎలాంటి విపరిణామాలు చోటుచేసుకుంటాయో ప్రపంచవ్యాప్తంగా ఉదాహరణలు కోకొల్లలు.
ప్రజల నుంచి పన్నులు వసూలు చేసే ప్రభుత్వాలు వారి అవసరాలు తీర్చకుండా పక్కకు తప్పుకోవడం బాధ్యతారాహిత్యం తప్ప మరేమీకాదు. ఉత్పాతాలు, భూకంపాలు, వరదలు, జాతీయ విపత్తులు సంభవించినప్పుడే ఉచిత వరాలు ఇవ్వాలా? తెలంగాణ ప్రాంతంలో వేల మంది రైతులు గతంలో అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరి ఇది విపత్తు కాదా? ఈ విపత్తు సమయంలో రైతులను ఆదుకోవడం ప్రభుత్వాల బాధ్యత కాదా? వారికి ఉచిత విద్యుత్తు, పెట్టుబడి సాయం, బీమా, పంటలకు రక్షణ వంటివి కల్పిస్తే.. అది తప్పుడు విధానం అని జాతీయ పార్టీ నేతలు అనుకోవడం సిగ్గుచేటు.
MAN BECOMES GREAT EXACTLY IN THE DEGREE IN WHICH HE WORKS FOR THE WELFARE OF HIS FELLOW MEN… అని గాంధీ పేర్కొన్నట్లు వ్యక్తి అయినా, ప్రభుత్వమైనా తమ సహచరుల సంక్షేమం కోసం పాటుపడటం ద్వారానే గొప్పతనాన్ని పొందుతారు. ఆయన సిద్ధాంతాన్ని నమ్మిన ప్రభుత్వం మాది. అంబేద్కర్ ఆశయాల వెలుగులో ప్రయాణిస్తున్న పరిపాలన మాది. అందుకనే ‘దళితబంధు’, ‘రైతుబంధు’ వంటి పథకాలతో ప్రజల ఆత్మబంధువుగా మా ప్రభుత్వం చరిత్రలో స్థానాన్ని సంపాదించుకున్నది.
ఎన్నికల ముందు పేదల పాట… ఎన్నికల తర్వాత పెద్ద గద్దల బాట.. ఇదే మోదీ ప్రభుత్వ అనుసరించే రాజకీయ సూత్రం. 2014 ఎన్నికల ముందు..‘విదేశాల నుంచి నల్లధనం తెస్తాం. ప్రతీ ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తాం’ అన్నరు. కానీ ఒక్కరి ఖాతాలో డబ్బులు పడకపోగా, స్విస్ బ్యాంకుల్లో నల్లధనం నిల్వలు గతం కన్నా ఎక్కువగా పెరిగిపోయాయి.
ఉచితాలను వ్యతిరేకించే బీజేపీ నేతలు ‘దళితబంధు’ కింద ఇచ్చే మొత్తాన్ని పది లక్షల నుంచి 20 లక్షలకు పెంచాలని ఎందుకు డిమాండ్ చేశారో వివరించాలి. మోదీ ఉచితాలే వద్దంటారు.. రాష్ట్ర నేతలు పెంచమంటారు. ఇదా మీ నీతి? ఇదా మీ విధానం? ఇంతకన్నా మోసం ఉంటుం దా? మీకు నిజంగా నిజాయితీ ఉంటే… ‘మేం అధికారంలోకి వస్తే, మా మోదీ గారి సిద్ధాంతం ప్రకారం ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, కల్యాణలక్ష్మి తదితర పథకాలన్నీ రద్దు చేస్తామ’ని ప్రకటించండి. లోపల ఒకమాట, పైకి ఒకమాట ఎందుకు? జింక తోలు కప్పుకున్న తోడేళ్లలా వ్యవహరించడం బీజేపీ నాయకుల రాజకీయ తంత్రం. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్య పాత్రికేయ సమావేశంలో బీజేపీ గురించి వ్యాఖ్యానిస్తూ.. ‘బీజేపీది లోకతంత్రమో, జనతంత్రమో కాదు. వారిది ఉత్త షడ్యంత్రం. కుటిలతంత్రం’ అని కుండబద్దలు కొట్టినట్లు ఎండగట్టారు. ఇది అక్షర సత్యం. ఈ షడ్యంత్రాన్ని బద్దలు కొట్టి ప్రజాతంత్రాన్ని నిలబెట్టే పోరాటంలో టీఆర్ఎస్ అగ్రభాగాన నిలుస్తుంది.
(వ్యాసకర్త: రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి)