ఇది అలవాటయింది
ఇలాగే అలవాటయింది
కదిలే కలల కాలం, జారే ఇసుకలో,
కాళ్ళు కాలిపోతున్నా
చీకటి పడ్డట్టు కళ్ళు మూసుకొని
ఎండను ఓర్చుకోవడం అలవాటయింది
దెబ్బ తగిలినపుడు
ఎవరూ చూడకుండా
జేబులోని దస్తీ తీసి
రక్తం తుడుచుకోవడం
పరదేశి బాటసారిలా అలవాటయింది
దుఃఖం వచ్చినపుడు
భుజం మీది చొక్కాతో
చాటుగా కళ్ళను వొత్తుకోవడం
పసిపిల్లల్లా అలవాటయింది
నుదుటి మీద కారే చెమటను
తల విదిల్చి దులుపుకొన్నంత సులువుగా,..
బాధను తుడుచుకోవడం
నిస్సహాయంగా అలవాటయింది
బతుకడానికి బయల్దేరినపుడు,
ప్రాణాలు నిలుపుకోవడం కోసం,
పస్తులను కూడా
పండగ నాటి పవిత్ర ఉపవాసంలా
ఆకలిని తట్టుకోవడం అలవాటయింది
దూరాన లేచిన సుడిగాలిలో
దారి దొరకని గాలిపటం
పిట్టలా కొట్టుకొంటున్నపుడు
కిందకి లాగుదామని, పైకి చూస్తూ
బోర్లా పడిపోవడం అలవాటయింది
ఋతువులు మారినపుడు
ఉదయం వెలుగుల్లోనో,
సాయంత్రం నీడల్లోనో,
ఆకాశం సీతాకోకల గుంపైనపుడు
గాయం మానిందో లేదోనని
కట్టువిప్పి చూసుకోవడం
కొంత భయం భయంగా అలవాటయింది
జీవితం ఎదురు తిరిగినపుడు
పెనుగులాడి, పెనుగులాడి
ఊపిరి కోసం లేచి కూర్చున్నపుడు,
ముఖం మీద నీళ్ళు చిలకరిస్తే,
ఆశగా కళ్ళు తెరిచినట్టు,
ఈ లోకాన్ని గెలవడం అలవాటయింది
ఆశారాజు