రాజ్యాంగ పరిమితులను అతిక్రమించి ప్రజా ప్రభుత్వాన్ని గవర్నర్లు ఇబ్బంది పెట్టడం, కేంద్రంలోని రాజకీయ పార్టీకి ఏజెంట్ల మాదిరిగా పనిచేయడమనేది చాలా కాలంగా విమర్శకు గురవుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాజ్యాంగ బద్ధునిగా, సంస్కార వంతునిగా పేరున్నది. బీజేపీ సిద్ధాంతాలతో విభేదాలున్నా, పార్టీ బంధాలు వేరు, కేంద్ర రాష్ర్టాల మధ్య రాజ్యాంగ సంబంధాలు వేరని విడదీసి చూపిన విజ్ఞత కేసీఆర్‌ది. ఆయన పోరాటం ఎప్పుడైనా విధానాలపైనే కానీ వ్యక్తులపై కాదు. వ్యవస్థాగత పోకడలనే ప్రశ్నిస్తారు కానీ, వ్యక్తిగత విషయాలకు పోరు. అలాంటిది తమిళిసై విషయంలోనే ఎందుకు సమస్య అవుతుందో ఆలోచించాలి.
తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్నదన్నట్టుగా కొందరు ఇటీవల దుష్ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న బలమైన ప్రభుత్వం ఉన్నది. ఉద్యమ నేపథ్యం గల కేసీఆర్ ఈ ప్రభుత్వానికి సారథి. రాజ్యాంగ వ్యవస్థలకు, సంప్రదాయాలకు విలువ ఇచ్చే ప్రభుత్వమిది. గతంలో నరసింహన్ గవర్నర్‌గా ఉన్నప్పుడు ప్రగతి భవన్- రాజ్‌భవన్ మధ్య సత్సంబంధాలుండేవి. కానీ గవర్నర్‌గా బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షురాలు తమిళి సై సౌందర్ రాజన్ వచ్చిన తర్వాతనే సమస్య మొదలైంది. తొలుత ఆమెతో కూడా ముఖ్యమంత్రి సహా ప్రభుత్వ వర్గాలన్నీ బాగానే ఉన్నాయి. కానీ, రానురాను గవర్నర్ వ్యవహారశైలి వివాదాస్పదమవుతోంది.
ప్రతి రోజూ ఏదో విధంగా ప్రభుత్వంతో కయ్యం పెట్టుకునే విధంగా తమిళి సై వ్యవహారశైలి ఉన్నది. గౌరవం అనేది తీసుకోవడమే కాదు.. ఇవ్వడం కూడా ముఖ్యం. తనకు ప్రొటోకాల్ ఇవ్వడంలేదని గవర్నర్ పలు సందర్భాల్లో మీడియాతో చెప్పారు. ఈ సందర్భంగా తలెత్తిన ప్రధాన ప్రశ్న ఆమె ప్రొటోకాల్ ప్రకారమే వ్యవహరిస్తున్నారా? రాజ్యాంగం ప్రకారం వ్యవహరిస్తున్నారా? అన్నదే చర్చనీయాంశం. తెలుగులో ఓ కథ ఉన్నది. ‘చీమ చీమ ఎందుకు కుట్టావు అంటే.. నా పుట్టలో వేలుపెడితే కుట్టకుండా ఉంటానా’ అని. ఎవరి పరిధిలో వారుంటే మంచిది. ప్రగతిభవన్‌కు ప్రత్యామ్నాయంగా రాజ్‌భవన్ ఉంటుందన్న సంకేతాలు ఇవ్వడం ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం కాదు.
తమిళిసై పోకడ మొత్తంగా గవర్నర్ల వ్యవస్థపై నమ్మకం పోయేలా ఉన్నది. తాము పంపే ఫైళ్లను గవర్నర్ తొక్కిపెడుతున్నారన్నది ప్రభుత్వ వాదన. తానే ఫైళ్లను ఆపానని కొన్ని సందర్భాల్లో గవర్నర్ తమిళిసై కూడా చెప్పారు. అయితే, ప్రభుత్వం పంపే ఫైళ్లను గవర్నర్ ఒకసారి మాత్రమే ఆపగలరు. అదే ఫైలును ప్రభుత్వం రెండోసారి పంపితే ఆమోదించాలి. రెండోసారి కూడా ఆమోదించకపోతే ప్రభుత్వం మూడోసారి పంపవచ్చు. మూడోసారి ఫైలును పంపినపుడు దాన్ని గవర్నర్ ఆమోదించకపోతే, రాజ్యాంగం ప్రకారం ఆటోమెటిక్‌గా అది ఆమోదం పొందినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఈ విషయం గవర్నర్‌కు తెలియక కాదు. కానీ, బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షురాలిగా పనిచేయడంతో, ఆమె ఇంకా బీజేపీ నాయకురాలిగానే ఆలోచిస్తున్నట్టున్నారు!
గవర్నర్ పదవి కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసేది. గవర్నర్ వ్యవస్థ ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం ఎన్నటికీ కాదు, కాకూడదు. గవర్నర్లు తాము ప్రత్యామ్నాయం అని అనుకుంటే అవగాహనా రాహిత్యమే. గవర్నర్ గిరి అంటే గులాంగిరి కాదని చెప్పిన గవర్నర్లు కూడా అనేక మంది ఉన్నారు. రాజకీయ పార్టీల నుంచి కాకుండా ప్రభుత్వ సర్వీసుల నుంచి రిటైర్ అయిన మాజీ గవర్నర్ నరసింహన్ దీనికి ఉదాహరణ. ఆయనెప్పుడూ తన పరిధి దాటలేదు. అలాగే, ప్రభుత్వాలు గీత దాటితే ఒప్పుకోలేదు కూడా. బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షురాలు తమిళిసై వచ్చిన తర్వాతనే గవర్నర్ వ్యవస్థపై వివాదం రేగడం గమనార్హం.
గవర్నర్ వ్యవస్థపై మొదటి నుంచి విమర్శలున్నాయి. కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నపుడు ఇతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్టికల్ 356 ప్రయోగించడం చూశాం. ఉమ్మడి రాష్ట్రంలో 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నాటి గవర్నర్ రాంలాల్ కూలదోసిన సంగతి మన కండ్ల ముందు ఉన్నదే. ఆ తర్వాత రాంలాల్ అవమాన భారంతో హైదరాబాద్ విడిచిపోయిన విషయం తెలిసిందే. అనేక రాష్ర్టాల్లో కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ గవర్నర్ల వ్యవస్థను ఇలాగే వాడుకున్నది. దీనిపై ప్రతిపక్షంలో ఉన్నపుడు బీజేపీ కూడా తీవ్ర విమర్శలు చేసింది. కానీ కేంద్రంలో నరేంద్రమోదీ ఆధ్వర్యంలో బీజేపీ సర్కారు కొలువుదీరిన తర్వాత గవర్నర్ల వ్యవస్థను మరింతగా దిగజార్చిందన్న విమర్శలున్నాయి.
రాష్ర్టాల్లో తమ అనుకూలమైన ప్రభుత్వాన్ని ప్రతిష్ఠించేందుకు ప్రయత్నించడం రివాజుగా మారింది. కొన్ని చోట్ల సఫలం కాగా మరికొన్ని చోట్ల తీవ్ర ప్రతిఘటనను, అవమానాన్ని మూటగట్టుకున్నది. మహారాష్ట్రలో మెజారిటీ రాకున్నా, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో సూర్యోదయం కాకముందే ప్రమాణ స్వీకారం చేయించింది. బీజేపీ అధిష్టానం ఆదేశాలను అమలు చేసి ఆనాటి గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ అభాసుపాలయ్యారు. ఆ తర్వాత ప్రజాగ్రహానికి తలొగ్గి శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక తప్పలేదు. గవర్నర్లు తప్పు చేసి రాజ్యాంగం కల్పించిన రక్షణలో ఉంటామంటే అన్ని పరిస్థితుల్లో చెల్లదు.
మోదీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలతోపాటు గవర్నర్ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించింది. గవర్నర్లంటే కేంద్రంలోని రాజకీయ పార్టీకి ఏజెంట్లుగా పనిచేస్తారన్న అభిప్రాయం పెరుగుతున్నది. అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించ డంలో అప్పటి గవర్నర్లు తధాగత రా య్, జేపీ రాజ్కౌలు వ్యవహరించిన తీరు అక్కడ ముఖ్యమంత్రిగా పనిచేసిన కలికోపౌల్ ఆత్మహత్యకు దారితీసింది. కీలకమైన సరిహద్దు రాష్ట్రంలో ఇది అతిపెద్ద రాజకీయ సంక్షోభానికి కారణమయింది. ఈ సందర్భంలో సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా గవర్నర్ తన పరిధి దాటుతున్నాడని చెప్పింది. కేరళ గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్ అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టారు.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు గవర్నర్ జగదీప్ ధన్కర్ చేయని ప్రయత్నం లేదు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనీల్ బైజల్ చేసిన కుతంత్రాలు అన్నీ ఇన్నీ కావు. ఇక మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి గవర్నర్ లాల్జీటాండన్ను వాడుకున్న విషయం తెల్సిందే. కర్నాటకలో సైతం గవర్నర్ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతోపాటు కాపాడుతున్నారు.
కేంద్రంలో కాంగ్రెస్ బలంగా ఉన్నప్పుడు కాంగ్రెసేతర ప్రభుత్వాలను అస్థిర పరిచేందుకు గవర్నర్ వ్యవస్థను ఉపయోగించుకున్నది. 1990 దశకం నుంచి 2014 వరకు కేంద్రంలో ఏక పార్టీ పాలన లేనప్పుడు పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. కానీ మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గవర్నర్ల వివాదాస్పద పాత్ర మళ్ళీ మొదలైంది. బీజేపీ విస్తరణకు గవర్నర్ల వ్యవస్థను వాడుకుంటున్నది. గవర్నర్లు తమ రాజ్‌భవన్‌ను బీజేపీ క్యాంపు ఆఫీసులుగా మార్చారన్న అభిప్రాయం పెరుగుతున్నది. అందువల్ల మొత్తంగా గవర్నర్ల వ్యవస్థపై దేశవ్యాప్త చర్చ జరగాలి. మెజారిటీ రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ల ద్వారా రాష్ర్టాల్లో తన పెత్తనం చెలాయించే ప్రయత్నాలు బీజేపీ చేస్తున్నది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు, సమాఖ్య తత్వానికి మంచిది కాదు.
శరీరంలో కాలం చెల్లిపోయిన అవశేష అంగాలు ఉంటాయి. ఇప్పటి కాలానికి అవి పనికిరావు. నోటిలో చివరి దంతం, అపెండిక్స్ వంటివి. పరిణామ క్రమంలో అవి అంతరించి పోతాయి. ఇబ్బంది పెడుతుంటే పీకి వేయాల్సి వస్తుంది. ఆ విధంగా మన రాజ్యాంగ వ్యవస్థలో మిగిలిపోయిన అవశేషాంగమే గవర్నర్ పదవి. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో దేశ సమగ్రత మీద భయాందోళనలు ఉండేవి. సంస్థానాల విలీనం, రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ పూర్తి కాలేదు. దేశం ఒక జాతిగా, ప్రజాస్వామ్య వ్యవస్థగా పరిణతి చెందుతుందా అనే సందేహాలు ఉండేవి. కారణం ఏదైనా కేంద్రానికి, రాష్ర్టాలకు అనుసంధానంగా గవర్నర్ వ్యవస్థ ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకొని ప్రమాదకరంగా మారవచ్చుననే ఆందోళన రాజ్యాంగ సభలో వ్యక్తమైంది. అయితే గవర్నర్ పాత్ర పరిమితమైందని అంబేద్కర్ స్పష్టం చేశారు. గవర్నర్ పదవి ఏర్పరిచింది ప్రజా ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడానికి కాదు.
గవర్నర్ పదవి దుర్వినియోగం అవుతున్నందున ఈ పదవి అవసరం ఇంకా ఉందా అనేది ప్రాంతీయ పార్టీలు చర్చించాలి. సమాఖ్య తత్వాన్ని కాపాడుకోవడానికి సమిష్టి కార్యాచరణకు దిగాలి.
రాజ్యాంగం ఏం చెప్పిందంటే..
గవర్నర్ల వ్యవస్థపై రాజ్యాంగంలోని ఆర్టికల్ 163లో చాలా స్పష్టంగా ఉంది. గవర్నర్లు స్వతహాగా ఏదీ చేయడానికి ఉండదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు, ముఖ్యమంత్రి, ఆయన నేతృత్వంలోని మంత్రిమండలి సిఫారసుల మేరకే గవర్నర్ తన బాధ్యతలను నిర్వర్తించాలి. ఇంతకు మించి గవర్నర్లకు అంటూ ప్రత్యేక పనులేమీ పేర్కొనలేదు. అయితే, ఇదే ఆర్టికల్‌లో రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు కొన్ని వెసులుబాట్లు కూడా ఉన్నాయి. యుద్ధాలు, రాష్ట్రపతి పాలన, అత్యవసర పరిస్థితి వంటివి ఏర్పడినపుడు, ప్రత్యేక సందర్భాలలో గవర్నర్‌కు అనేక అధికారాలుంటాయని చెప్పింది. అసాధారణ సందర్భాలలో గవర్నర్‌కు ఉండే వెసులుబాట్ల పేరుతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను అస్థిరపరిచే చర్యలకు పాల్పడ కూడదు. కానీ పలు సందర్భాలలో గవర్నర్లు తమ పరిధులు, పరిమితులు దాటి వ్యవహరిస్తున్నారు.
గవర్నర్లను రీకాల్ చేసే అవకాశం ఉండాలి
గవర్నర్ల వ్యవస్థపై అనేక సందర్భాల్లో చర్చ జరిగింది. గవర్నర్లు కేంద్ర ప్రభుతానికి తొత్తులుగా మారారని, రాష్ర్టాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోయడానికి ప్రయత్నించారన్న విమర్శలున్నాయి. అయితే గవర్నర్ల వ్యవస్థపై లోతైన అధ్యయనాలు కూడా జరిగాయి.
1969లో నాటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి మద్రాసు రాష్ట్ర హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రాజమన్నార్ నేతృత్వంలో కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కమిటీ 1971లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో గవర్నర్ల వ్యవస్థపై సునిశిత పరిశీలన ఉన్నది. గవర్నర్ల నియామక వ్యవస్థలో మార్పులు చేయాలని, గవర్నర్లను నియమించే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాలు/ముఖ్యమంత్రుల అభిప్రాయం పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అంతే కాదు, రాష్ర్టాల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా గవర్నర్లు ప్రవర్తిస్తే వారిని రీకాల్ చేసే అధికారం ఉండాలని, రాష్ట్ర శాసనసభ 2/3 మెజారిటీతో గవర్నర్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేస్తే రీకాల్ చేయాలని కమిటీ సూచించింది. ఎన్నికైన ప్రజాప్రభుత్వాల నిర్ణయాలను ఉద్దేశపూర్వకంగా అడ్డుకునే, రాష్ర్టాల ప్రయోజనాలకు భంగం కలిగించేలా వ్యవహరించే వారి పట్ల ఉదాసీనంగా ఉండొద్దని కూడా చెప్పింది. గవర్నర్ల వ్యవస్థపై సుప్రీం కోర్టు కూడా అనేక సందర్భాల్లో ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో గవర్నర్ల వ్యవస్థపై తీవ్రమైన చర్చ జరగాలి.
– ఓరుగంటి సతీష్ , 80080 06667