పన్నెండేండ్లకే గ్రాండ్ మాస్టర్‌గా నిలిచి, 17 ఏండ్ల వయస్సులో కెనడాలో నిర్వహించిన ‘క్యాండిడేట్స్ టోర్నీ’లో గెలిచి, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో చెస్ దిగ్గజాలతో తలపడే అర్హతను సాధించిన దొమ్మిరాజు గుకేశ్ విజయ ప్రస్థానం నేటి యువతరానికి ప్రేరణాత్మకం, అనుసరణీయం. పిన్న వయస్సులోనే 64 గళ్ల చదరంగ కురుక్షేత్రంలో పావులను రామబాణాలుగా సంధించడం, ప్రత్యర్థులకు చెమటలు పట్టించడం తన 7వ ఏట నుంచే చేసిన సాధనా ఫలమే. ఎత్తులకు పైఎత్తులు వేయడంలో దిట్ట అయిన గుకేశ్ ప్రపంచ చదరంగ సమరానికి సై అంటూ పావుల కత్తులను నూరుకుంటున్నాడు.
చెన్నైలో స్థిరపడిన డాక్టర్ రజనీకాంత్ (ఈఎన్టీ సర్జన్), పద్మ (మైక్రోబయాలజిస్ట్) దంపతులకు 2006లో దొమ్మరాజు గుకేశ్ జన్మించాడు. గుకేశ్ తల్లిదండ్రులు తెలుగువారు కావడం విశేషం. ఏడేండ్ల వయస్సులోనే చదరంగ క్రీడకు పేరుగాంచిన వేలమ్మల్ స్కూల్లో ఓనమాలు దిద్దాడు. 64 గళ్ల బోర్డుపై అలుపెరుగని మెలకువలు ఒంట పట్టించుకుంటూ అంచెలంచెలుగా ఎదిగాడు. తొలిసారి అండర్-09 ఆసియా స్కూల్ చెస్ ఛాంపియన్షిప్ చేజిక్కించుకొని, 2018లో అండర్-12 ప్రపంచ చదరంగ యువ ఛాంపియన్‌గా నిలిచాడు.
5 స్వర్ణ పతకాలు కొల్లగొట్టి సత్తా చాటాడు. 2020 నుంచి ప్రపంచ ప్రఖ్యాత చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ శిష్యరికంలో రాటుదేలాడు. ఆనంద్ నేతృత్వంలోని వెస్ట్‌బ్రిడ్జ్ చెస్ అకాడమీలో చేరి ఆయన మార్గదర్శకత్వంలో మెలకువలను ఒంట పట్టించుకున్నాడు. అవిశ్రాంత కృషితో దినదిన ప్రవర్థమానంగా ఎదిగిన గుకేశ్ అంతర్జాతీయ స్థాయికి చేరడం స్ఫూర్తిదాయకం. ఓటమినే పెట్టుబడిగా చేసుకొని అసాధ్యాలను సుసాధ్యం చేసిన ఘనుడు గుకేశ్. 2022లో ప్రపంచ మేటి చెస్ ఆటగాడు కార్ల్‌సన్‌పై నెగ్గడం, అదే ఏడాది ఒలింపియాడ్‌లో తొలి వ్యక్తిగత గోల్డ్‌మెడల్ గెలవడం, గతేడాది జరిగిన ఆసియా క్రీడల్లో రజత పతకం సాధించడం, నేడు 2,743 రేటింగ్‌తో రికార్డులను తిరగరాయడం గుకేశ్‌కు సర్వసాధారణమైంది.
17వ ఏటనే ఫిడే క్యాండిడేట్స్ టోర్నీ గెలిచి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించిన అతి చిన్న వయస్కుడిగా రికార్డును బద్దలు కొట్టారు. డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్‌తో తలబడేందుకు సిద్ధపడుతున్నాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత క్యాండిడేట్స్ టోర్నీ జయించిన రెండవ భారత మొనగాడిగా నిలిచిన గుకేశ్ 14 పాయింట్లకుగాను గరిష్ఠంగా 09 పాయింట్లు సాధించారు. 22 ఏండ్ల వయస్సులోనే ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచిన కార్ల్సన్, కాస్పరొవ్ల సరసన చేరి వారి రికార్డులను తిరగరాసే ప్రయత్నాల్లో దూసుకుపోతున్న గుకేశ్ పట్టుదల ప్రశంసనీయం.
డాక్టర్ బుర్ర మధుసూదన్‌రెడ్డి
99497 00037