దేశంలో ఓ వైపు పోషకాహార లోపంతో చిన్నారులు ఆకలి కేకలు వేస్తుంటే, మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. పోషకాహార సమస్య శతాబ్దాల తరబడి వెంటాడుతుంటే, దశాబ్ద కాలంగా ఊబకాయ సమస్య రోజురోజుకు పెరుగుతున్నది. పూర్తి వ్యతిరేక, విభిన్న సమస్యలను మన దేశం ఒకేసారి ఎదుర్కొంటుండటం గమనార్హం. దీనికి అనేక చారిత్రక, శాస్త్రీయ, జీవన విధానంలో వచ్చిన మార్పులే కారణం. కొంతమంది ప్రజలకు తినడానికి తిండి దొరకడమే గగనమైపోతుంటే.. మరికొంతమంది ప్రజలేమో పాశ్చాత్య వంటకాలు, ప్యాకేజ్డ్ ఫుడ్ వైపు ఆకర్షితులవుతున్నారు.
పట్టి పీడిస్తున్న పోషకాహార లోపం: దేశంలో దాదాపు 10.2 కోట్ల మంది పురుషులు, 10.1 కోట్ల మంది మహిళలు పోషకాహర లోపంతో బాధపడుతున్నారని 2016లో ‘ది లాన్సెట్ జర్నల్’ ఒక అధ్యయనాన్ని ప్రచురించింది. ఐదేండ్ల కిందటి కంటే ఇప్పుడు పిల్లలు ఎక్కువ పోషకాహారలోపంతో బాధపడుతున్నారని ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’ (ఎన్ఎఫ్హెచ్ఎస్) తాజా గణాంకాలు చెప్తున్నాయి. చిన్నపిల్లల్లో పోషకాహార లోపం 44 శాతం నుంచి 55 శాతానికి పెరిగింది. బరువు తక్కువ పిల్లల శాతం 7.8 నుంచి 13.4కు పెరిగింది. ఎక్కువ మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. పేదవారిలో ఈ సమస్య మరింత తీవ్రం. పోషకాహార లోపంతో ఉన్న మహిళలకు పుట్టే పిల్లలూ బలహీనంగానే ఉంటున్నారు. మహిళలకు సరైన పోషకాహారం అందకపోవడమే దీనికి కారణం. ఆదాయ మార్గాలను పెంచడం, ఉపాధి కల్పించడం, సరైన పథకాలను రూపొందించడం, వాటిని ప్రజలకు చేర్చడం, అవినీతికి ఆస్కారం లేకుండా చూడటం ద్వారా పోషకాహార లోపం సమస్యను అధిగమించే అవకాశం ఉన్నది.
పెరుగుతున్న స్థూలకాయ సమస్య: 2019-21 ‘నేషనల్ ఫ్యామిలీ హెల్త్’ సర్వే ప్రకారం.. దేశంలోని 23 శాతం జనాభా స్థూలకాయంతో బాధపడుతున్నారు. 2015-16లో ఇది 17 శాతమే. ఈ నాలుగేండ్లలో ఊబకాయుల సంఖ్య 6 శాతం పెరిగింది. అంతేకాకుండా చిన్నారుల్లో సైతం ఊబకాయ సమస్య రోజురోజుకు పెరిగిపోతున్నది. ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే ‘వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్’ ప్రకారం 2030 నాటికి భారతదేశ చిన్నారుల్లో 50 శాతం మంది ఊబకాయ సమస్యతో బాధపడుతారని అంచనా వేసింది.
అధిక బరువుకు అనేక కారణాలు: మొదటిది జన్యుపరమైన సమస్యలతో పాటు దేశంలో జంక్‌ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ వినియోగం పెరగడం. ఇలాంటి వాటిలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనిషి బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రజల టీవీ, ఫోన్లు చూసే సమయం ఎక్కువ కావడం. ఒక సర్వే ప్రకారం భారతదేశంలో పెద్దలు ప్రతి రోజు ఐదు గంటల సమయాన్ని టీవీలు, ఫోన్లు చూడటానికే వెచ్చిస్తున్నారు. ఇటీవల తమిళనాడులో నిర్వహించిన ఓ సర్వేలో రెండు నుంచి ఐదేండ్ల చిన్నారుల స్క్రీన్ టైమ్ రెండు గంటలు అని తేలింది. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఒక అధ్యయనం ప్రకారం ప్రతి రోజు టీవీ చూసేవారిలో స్థూలకాయం వచ్చే ప్రమాదం 21 శాతం ఎక్కువని తేల్చింది. ఇంకా పట్టణీకరణ పెరగడం, గంటల తరబడి కూర్చొని చేసే ఉద్యోగాలు పెరగడం, రవాణా సౌకర్యాలు మెరుగవడం, శ్రమను తగ్గించేస్తున్న గృహోపకరణాలు కూడా అందుకు కారణాలే. మోతాదుకు మించి చక్కెర ఉన్న ప్యాకేజ్డ్ ఫుడ్‌పై అత్యధిక పన్ను విధించాలి. హెల్తీ ప్రొడక్ట్ అంటూ ఆహార పదార్థాల కంపెనీలు ఇచ్చే ప్రకటనలపై మార్గదర్శకాలు విడుదల చేయాలి. ప్రభుత్వం ఊబకాయాన్ని కూడా ఒక వ్యాధిగా గుర్తించి, నివారణ చర్యలు చేపట్టాలి. దీంతోపాటు ప్రతి ఒక్కరూ ఆహారం, శారీరక శ్రమ విషయంలో వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటే ఊబకాయ సమస్యను దూరం చేయవచ్చు.
ఫిరోజ్ ఖాన్, 96404 66464