ప్రత్యామ్నాయం అనివార్యం-2
దేశ ప్రజల వర్తమానపు ఆలోచనా ధోరణి, మానసిక స్థితి, కేసీఆర్ దార్శనికత, అనుభవం, సామర్థ్యం, తిరుగులేని పట్టుదల కలగలిసి ప్రత్యామ్నాయ ఆవిష్కరణకు దారి తీయగల అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. చుట్టూ తేరిపార జూస్తే, అందుకు ఈ రోజున తగిన యోగ్యత గల నాయకుడు కేసీఆర్ ఒక్కరే కనిపిస్తున్నారు.
ఈ దేశ ప్రజల గత అనుభవాలను, అందుకు వారి స్పందనలను ఒకసారి మదింపు చేసి చూసినట్లయితే, కశ్మీర్ నుంచి కేరళ వరకు, గుజరాత్ నుంచి అస్సాం వరకు సగటు మధ్యతరగతి మనిషి నుంచి శ్రమ జీవి దాకా అన్నింటికీ వర్తించేది పైన చెప్పిన పరిస్థితే.
గత 75 ఏండ్ల సుదీర్ఘకాలం పాటు వీరంతా అనుభవించి, ఈ రోజున తమ జీవితపు చౌరస్తాలో నిస్పృహతో, అయోమయంగా నిలిచి ఉన్న స్థితికి ఆశారేఖలు ఏవైనా కనిపించగలవనుకుంటే, అది ప్రత్యామ్నాయ అజెండాలోనే తప్ప, ఇంతకాలం వలె కేవలం కార్బన్ కాపీ పార్టీలను, నాయకులను అటు ఇటు మార్చి చూడటంలో కాదు. కొత్తపార్టీ నాయకత్వం దీన్ని గ్రహించి వ్యవహరించినట్లయితే, ప్రజలు కూడా ఇదంతా అర్థం చేసుకున్నట్లయితే, మన దేశ సువిశాల భౌగోళికత, వైవిధ్యతల వంటివేవీ అవరోధాలు కాబోవు. అటువంటి నిజమైన ప్రత్యామ్నాయం, నాయకత్వం తమ ఎదుటకు వచ్చినపుడు ఆ ప్రజలంతా దాన్ని అర్థం చేసుకొని ఆదరించగలరు. లోగడ గాంధీజీ, జయప్రకాశ్, అన్నా హజారే, నక్సలిజం తరహా పిలుపులకు దేశవ్యాప్తంగా ప్రజల నుంచి స్పాంటేనియస్గా వచ్చిన స్పందనలు చెప్పేవి ఇదే.
ఇంతటి వైవిధ్యతలను ఏకం చేసి ఆదరణ సంపాదించగల ప్రత్యామ్నాయ అజెండా ఏమిటన్నది కూడా నిజానికి సరికొత్తగా కనుగొనవలసిన విషయమేమీ కాదు. అది దేశ అవసరాలు, దేశ పరిస్థితులు, ప్రజల అవసరాలు, ప్రజల పరిస్థితులు గత 75 ఏండ్ల అనుభవాలు, రాజ్యాంగ లక్ష్యాల సాఫల్య వైఫల్యాలతో పాటు, మన ఎదుటగల అంతర్జాతీయ ప్రపంచ స్థితిగతులలో ఉన్నవే. చేయవలసింది వీటన్నింటిని వడపోసి క్రోడీకరించుకోవటం. అంతెందుకు.. కావలసిన ప్రత్యామ్నాయ అజెండా ఏమిటని దేశం నలుమూలల ఏ రంగంలో గల ఏ యువకుడిని, మధ్య వయస్కుడిని, వృద్ధుడిని, ఏ మహిళను అడిగినా చెప్పగలరు. నిత్య అధ్యయనశీలి కావటంతో పాటు రాజకీయాల్లో పరిపాలనలో సుదీర్ఘ అనుభవం కలిగి, అసాధారణమైన భావ వ్యక్తీకరణ శక్తి, భాషా పరిజ్ఞానం ఉండి, ప్రతి అంశం పై నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపే కేసీఆర్కు ఇవన్నీ కొట్టిన పిండేనన్నది ఆయన ప్రత్యర్థులు సైతం అంగీకరించే విషయం. అటువంటి స్థితిలో, ఆయన ఇప్పటికే తన ఆలోచనలలో రూపుదిద్దుతున్న ప్రత్యామ్నాయ అజెండా గురించి సందేహాలకు తావుండనక్కరలేదేమో.
అటువంటి అజెండాలో అనేకానేకం కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే గత ఎనిమిదేండ్లుగా తెలంగాణలో అమలుపరుస్తున్నవే. ఫలితాలను ప్రజల జీవితాల్లో చూస్తున్నవే. జాతీయంగా, అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతున్నవే. అవి గ్రామాలకు, పట్టణాలకు, వ్యవసాయానికి, వివిధ రూపాలలో రైతులకు, వృత్తుల వారికి, యువతకు, వృద్ధులకు, మహిళలకు, నిస్సహాయులకు, పేదలకు, సంక్షేమానికి, జలవనరుల అభివృద్ధికి, విద్యుత్ రంగానికి, పారిశ్రామికాభివృద్ధికి, వ్యాపారాలకు, పౌర సదుపాయాలకు, విద్యా వైద్యాలకు, పర్యావరణానికి, సాంప్రదాయికంతోపాటు, ఐటీ, బయోటెక్నాలజీ వంటి ఆధునిక రంగాలకు , సాంస్కృతిక పునరుజ్జీవనానికి, రహదారులు కమ్యూనికేషన్లకు, వివిధ పరిపాలనా సంస్కరణలకు మొదటి నుంచి అణగారిన తరగతులకు, దళితులకు, అల్పసంఖ్యాక వర్గాలకు, గిరిజనులకు, ఆహారభద్రత కొరవడిన వారికి, కల్యాణలక్ష్మి- షాదీముబారక్ వంటి రూపాల్లో పేదల తక్షణావసరాలకు, ఇంకా ఎన్నింటికో ఆయన ప్రభుత్వం పాటుపడుతూ నికరమైన ఫలితాలు సాధిస్తున్నది. ప్రజలను, జాతీయ అంతర్జాతీయ పరిశీలకులను కూడా మెప్పిస్తున్నది. వస్తున్న పెట్టుబడులు, లభిస్తున్న అవార్డులు అందుకు ఒక నిదర్శనం.
ప్రస్తుత చర్చకు సంబంధించి ఇక్కడ గుర్తించవలసిందేమంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి కావటానికి ముందుకాలంలో 1956 నుంచి 2014 వరకు 58 ఏండ్ల కాలంలో పాలించిన కాంగ్రెస్, టీడీపీల మధ్య అధికార మార్పిడులు అయితే జరిగాయి గాని, తెలంగాణ ప్రాంత అభివృద్ధి అవసరాలకు, ప్రజల జీవితాలకు సరిపోయే ప్రత్యామ్నాయ అజెండాను ఎవరూ రూపొందించి అమలుపరచలేదు. అసలు అటువంటి ఆలోచనే ఏ పార్టీకి రాలేదు. ఆ పని ఇప్పుడు జరుగుతున్నది. అటువంటి దార్శనికతతో పాటు, అందుకు తగిన పరిజ్ఞానం, నిబద్ధత, పట్టుదల ఉన్న ఆయన ఇప్పడు అదే సరళిలో, తన అనుభవాన్ని వినియోగించి జాతీయస్థాయిలో ఈ దేశానికి తగిన ప్రత్యామ్నాయ అజెండాను రూపొందించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ప్రజలకు, దేశానికి ఎక్కడైనా ఒకేవిధంగా వర్తించే అభివృద్ధి అవసరాలు, ఆలోచనలు ఉంటాయి. పరిస్థితులు, పరిసరాలను బట్టి కొన్ని భిన్నత్వాలు కూడా ఉండటం సహజం. అవి సైతం ప్రత్యామ్నాయ అజెండాలో భాగంగా ఎక్కడికక్కడ పరిగణనలోకి రావటం సహజం. ఆచరణకు సంబంధించి తెలంగాణను గీటురాయిగా తీసుకుంటే, ప్రత్యామ్నాయ అజెండాతో దేశమంతటా కూడా ఆచరణలు అంతే పట్టుదలగా ఉంటాయని నిస్సందేహంగా భావించవచ్చు.
కేసీఆర్ ఆలోచనలో ప్రజల కోరికకు తగిన సాధనం ప్రత్యామ్నాయ అజెండా రూపంలో ఉండటంతో పాటు, ఒక వ్యక్తిగా ఆయన అందుకు సమర్థుడైన నాయకుడు కావటం. అనేకానేక సవాళ్ల ఎదుటఅన్నింటినీ వమ్ము చేస్తూ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించటంతో పాటు, ఎంతగానో వెనుకబడిన ప్రాంతాన్ని చూస్తూ చూస్తుండగానే అభివృద్ధి-సంక్షేమ రంగాలలో దేశంలోని అగ్రశ్రేణి రాష్ర్టాలలో ఒకదానిగా నిలబెట్టగలిగిన వాడు ఆయన.
తెలంగాణ దేశంలో అన్నింటికన్న ఇటీవల ఏర్పడి ఇంకా ఒక దశాబ్దమైనా పూర్తిచేసుకోని రాష్ట్రమైనప్పటికీ, కేసీఆర్ పేరు కొం తకాలం కిందటినుంచే అంతటా బాగా తెలిసిపోవటం, ఆయనపై ప్రశంసలు రావటమన్నది ప్రస్తుత చర్చతో ముడిపడిన ఒక గమనార్హమైన విషయం. నిర్మొహమాటంగా ఒక వాస్తవం చెప్పాలంటే, తెలంగాణ ఉద్యమం దీర్ఘకాలం సాగి అందులో కేసీఆర్ ప్రధాన పాత్ర నిర్వహించినప్పటికీ ఆ కాలంలో ఆయన పేరు దేశంలో పరిమితంగానే తెలిసేది. ఆందుకు కారణాలు వ్యక్తిగా తనతో నిమిత్తం లేకుండా ఆ ఉద్యమం గురించిన సార్వత్రిక పరిజ్ఞానం, దానిపట్ల వైఖరి, అందుకు తోడు అప్పుడు చంద్రబాబు, కమ్యూనిస్టులు ఢిల్లీ స్థాయిలో, అట్లాగే మీడియాతో సాగించిన ఎత్తుగడలతో సంబంధం గల విషయాలవి. ఆ ప్రభావం వల్ల రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆ స్థితి కొంతకాలం కొనసాగింది.
ఇది చాలదన్నట్లు ఉద్యమకారులు, నాయకులూ ఢిల్లీలో పబ్లిసిటీ పట్ల శ్రద్ధ చూపలేదు. ఆ ప్రభావం దేశమంతటా మీడియాపై పడింది. ఇదంతా క్రమంగా తెలంగాణ రాష్ట్రం ఒక్కొక్క విజయాన్ని సాధిస్తూ పోవటంతో, సగం కాలం గడిచిన తర్వాత మారసాగింది. ఇప్పుడు తెలంగాణ పేరు, కేసీఆర్ పేరు ఢిల్లీలోనే గాక దేశమంతటా మారుమోగుతున్నాయి. హైదరాబాద్, తెలంగాణల ఖ్యాతి ప్రపంచవ్యాప్తమవుతున్నాయి. పథకాలూ, అభివృద్ధీ, నాయకులు, అధికారులనుంచి సామాన్యుల వరకు అందరి దృష్టిని ఆకర్షించటం మొదలైంది. అందరికీ హైదరాబాద్, అక్కడి అభివృద్ధితో ఒక గమ్యస్థానం (డెస్టినేషన్ సిటీ)గా మారింది. ఇక్కడ పనిచేస్తున్న వివిధ రాష్ర్టాలకు చెందిన లక్షలాది మంది ఉద్యోగులు, ఇతర పనులవారి నోటి మాటల ప్రచారంతో, తెలంగాణ ప్రత్యామ్నాయ అభివృద్ధి అజెండా అంతటా చర్చనీయాంశమవుతున్నది.
ఇవన్నీ కేసీఆర్ తలపెట్టిన కార్యానికి సానుకూలాంశాలుగా మారుతున్నాయని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తను ఒక వేళ జాతీయ పార్టీని ఆరంభించి, పైన పేర్కొన్న తరహా అభివృద్ధి అంశాలతో ప్రత్యామ్నాయ అజెండాను రూపొందించి, ఆ విషయాలను వివిధ రాష్ర్టాలలో ప్రజల ముందుకు తీసుకు వెళ్లినట్లయితే, అది విన్నవారికి ప్రత్యామ్నాయ అభివృద్ధి ఏమిటో తెలంగాణ ఉదాహరణ దరిమిలా వెంటనే స్ఫురించే అవకాశం ఉంటుంది.
దేశంలో ప్రజలు ఈ రోజున నిరాశా నిస్పృహలతో ఉన్నారు. కాంగ్రెస్ ఇప్పటికే బాగా క్షీణించి రోజురోజుకు మరింత క్షీణిస్తున్నది. కమ్యూనిస్టులు జాడ లేకుండా పోయారు. లోహియా సంప్రదాయం నుంచి వచ్చిన సోషలిస్టులు, కుల పార్టీలతో పాటు దళిత పార్టీలు చీలికలు పేలికలై దిక్కుతోచకుండా ఉన్నాయి. బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ర్టాలకు పరిమితమయ్యాయి. ఇటువంటి శూన్య స్థితిలోకి బీజేపీ తేలికగానే ప్రవేశించగలిగింది కాని, దేశానికి తాను ఇచ్చిన అభివృద్ధి హామీలను నెరవేర్చలేక దారుణంగా విఫలమైంది. ఇతర పార్టీలు కోలుకోలేని స్థితిని తగినంత మంది సామాన్యులు మతం మత్తులో కూరుకొని ఉన్నదానిని అనువుగా చేసుకొని రాజ్యమేలుతూ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోగలుగుతున్నది. అయితే ఇతర పార్టీలు ఇంకా కోలుకోవటం లేదు గాని బీజేపీ పరిపాలనా వైఫల్యాలను ప్రజలు గ్రహించటం క్రమంగా పెరుగుతున్నది.
క్షీణిస్తున్న ఆర్థిక స్థితి, పెరుగుతున్న ధరలు, నిరుద్యోగ తీవ్రత, సబ్సిడీల ఎత్తివేత, ప్రభుత్వరంగ సంస్థలను వరుసపెట్టి తక్కువ ధరలకు తమ వారికి అమ్మటం, వాళ్లు చూస్తుండగానే లక్షల కోట్లకు పడగలెత్తటం, తీవ్రమైన రీతిలో ధనిక-పేద వ్యత్యాసాలు, అభివృద్ధి సూచీలలో, మానవాభివృద్ధి సూచీలలో ఇతర దేశాలతో పోల్చినప్పుడు మన ర్యాంకులు క్రమంగా పతనం కావటం, మనతోపాటు స్వతంత్రమైన దేశాలు మనకన్న ముందుకుపోతుండటం, నెమ్మదిగా బయటపడుతున్న అవినీతి కుంభకోణాలు, వేగంగా జరుగుతున్న అధికార కేంద్రీకరణ, ఆర్థిక కేంద్రీకరణ. సహకార ఫెడరలిజం అన్న నాయకుడు రాష్ర్టాల అధికారాలను ఎన్నడూ లేనంతగా హరించివేయటం, గుజరాత్ నమూనా అంటూ వేసిన ఊదర చివరికి వట్టి భ్రమగా తేలిపోతుండటం, అంతర్జాతీయంగా పెరుగుతున్న అప్రతిష్ఠ వంటివన్నీ ప్రజల కళ్లను తెరిపించటం కొంతకాలం క్రితమే మొదలై ఇటీవల వేగాన్ని అందుకుంటున్నది. ఇక వారికి మిగిలింది మతం మత్తుమందుతో ప్రజలను తప్పుదారి పట్టించి తమ అధికారాన్ని కొనసాగించుకోవటం ఒక్కటే. ఇది ఒక్కటి పటాపంచలు అయితే బీజేపీకి ఇక మిగిలేది ఏమీ ఉండదు.
ఈ శూన్యంలోకి, వివిధ శూన్యాల సముదాయంలోకి, ప్రత్యామ్నాయ శక్తి ఒకటి ప్రత్యామ్నాయ అభివృద్ధి అజెండాతో ప్రవేశించవలసిన సమయం ఇదే. క్షేత్రస్థాయిలో అందుకు తగిన అదను ఇదే. నిజానికి ఇప్పుడు కేసీఆర్ ప్రయత్నంతో నిమిత్తం లేకుండా కూడా, ప్రత్యామ్నాయం ఏమిటన్నది, అటువంటిది ఒకటి అత్యవసరమన్నది అసంఖ్యాకులైన ప్రజల మనసులలో మెదులుతున్న మాట. తగిన ప్రత్యామ్నాయానికి, తాము గతంలో చూసిన బలహీన ప్రత్యామ్నాయాలకు భిన్నంగా ఒక నికరమైన శక్తికోసం ప్రజలు అంతటా అన్వేషిస్తున్న సమయమిది అటువంటి శక్తులకు దేశం పట్ల ఒక బాధ్యత ఉంది. అది నెరవేర్చేందుకు వారు ప్రయత్నించకపోవటం దోషమవుతుంది. వారికిపుడు కావలసింది తగిన నాయకత్వం. కేసీఆర్ రాకతో అందుకు మరింత స్పష్టత, పెద్ద ఊపు వస్తాయి.
భారతజాతి జీవనంలో, 75 ఏండ్ల స్వాతంత్య్రం తర్వాత ఇదొక చారిత్రక దశ. ఇటువంటి సరైన తరుణంలో తాను అందుకు చొరవ తీసుకోవాలన్నది కేసీఆర్ సంకల్పం. పైన అనుకున్నట్లు ఇంత సువిశాలమైన, వైవిధ్యమైన దేశంలో అది తేలిక కాదు. అదే సమయంలో అసాధ్యం కూడా కాదు. ఎందుకంటే, అన్నింటికన్న ముఖ్యంగా ప్రజలు అటువంటిది కోరుకుంటున్నారు. అంతే ముఖ్యమైన రెండవది, కేసీఆర్ ఆలోచనలో ప్రజల కోరికకు తగిన సాధనం ప్రత్యామ్నాయ అజెండా రూపంలో ఉండటంతో పాటు, ఒక వ్యక్తిగా ఆయన అందుకు సమర్థుడైన నాయకుడు కావటం.
అనేకానేక సవాళ్ల ఎదుట అన్నింటినీ వమ్ము చేస్తూ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించటంతో పాటు, ఎంతగానో వెనుకబడిన ప్రాంతాన్ని చూస్తూ చూస్తుండగానే అభివృద్ధి-సంక్షేమ రంగాలలో దేశంలోని అగ్రశ్రేణి రాష్ర్టాలలో ఒకదానిగా నిలబెట్టగలిగిన వాడు ఆయన. ఆ విధంగా దేశ ప్రజల వర్తమానపు ఆలోచనా ధోరణి, మానసిక స్థితి, కేసీఆర్ దార్శనికత, అనుభవం, సామర్థ్యం, తిరుగులేని పట్టుదల కలగలిసి ప్రత్యామ్నాయ ఆవిష్కరణకు దారితీయగల అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. చుట్టూ తేరిపార ,చూస్తే, అందుకు ఈ రోజున తగిన యోగ్యత గల నాయకుడు కేసీఆర్ ఒక్కరే కనిపిస్తున్నారు.
ఆయన ఈ చారిత్రక కర్తవ్య నిర్వహణకు పూనుకొన్న పక్షంలో తనకు ఆ దిశలో బాసటగా నిలవవలసిన చారిత్రక బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉంటుంది. ఆ విధంగా వారు కూడా ఆ కర్తవ్య నిర్వహణలో భాగస్వాములవుతారు. 75 ఏండ్ల స్వాతంత్య్రం తర్వాత తలెత్తిన ఈ చారిత్రక క్లిష్ట దశలో, ఈ దేశం కోసం, జాతికోసం ప్రజలు అందరూ తమ పాత్రను నిర్వహించటం ఒక తప్పనిసరి అవసరం. ప్రత్యామ్నాయ సృష్టి ఇప్పుడొక చారిత్రక అవసరం.
– టంకశాల అశోక్