నాయనా! పురిటింటి తెరువరి!
కులజ్యోతి! నీకు దీర్ఘాయువురా!
నవమాసములు భోజనము నీరమెరుగక –
పయనించు పురిటింటి బాటసారి
చిక్కు చీకటి చిమ్ము జానెడు పొట్టలో-
నిద్రించి లేచిన నిర్గుణుండు
నును చెక్కిళుల బోసినోటి నవ్వులలోన-
ముద్దులు చిత్రించు మోహనుండు
అక్షయంబైన మాతృక్షీర మధుధార
లన్నంబుగా తెచ్చుకొన్న యతిధి
బట్ట కట్టడు బిడియాన బట్టువడడు-
ధారుణీ పాఠశాలలో చేరినాడు
వారమాయెనో లేదో మా ప్రకృతి
కాంత కరపి యున్నది వీని కాకలియు నిద్ర
ప్రతిమల పెండ్లి సేయుటకు
వందలు వేలు వ్యయించుగాని దుః
ఖితమతులైన పెదలపకీరుల
శూన్యములైన పాత్రలన్
మెతుకు విదుల్పదీ భారతమే
అదిని ముప్పది మూడు కోట్ల దే
వతలెగవడ్డ దేశమున
భాగ్యవిహీనుల క్షుతులారునే
ఈ ప్రశాంత రాత్రి ఏళ్ళ లోకంబును
బుజ్జగించి నిద్ర బుచ్చు కొనియె
నౌషదంబు లేని యసృష్యతా జాడ్య
మంద భాగ్యు నన్ను మరిచిపోయె.
కర్మ సిదాన్తమున నోరుకట్టివేసి
స్వార్దాలోలుర ఐ నా భుక్తి నను భావింత్రు
కర్మమననేమొ, దానికీ కక్షయేమొ,
యీశ్వరుని చేత రుజువు చేయించవమ్మ
(నేడు గుర్రం జాషువా జయంతి)