‘కొత్త బిచ్చగాడు పొద్దెరుగడు’ అన్నట్టు టీడీపీ లాంటి పార్టీలో తిరిగి ట్రంప్ కార్డు లాంటి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్‌రెడ్డి స్థాయి మరిచి విమర్శలకు తెగబడటం ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ అన్న చందంగా ఉన్నది. తెలంగాణ ఉద్యమం ఉప్పెనలా సాగుతున్న క్రమంలో.. ఉద్య మం వెనుక అడవిబిడ్డలు ఉన్నారన్న అక్కసుతో పల్లెసీమలను వల్లకాడు చేసిన తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబు నాయుడు అనుంగు అనుచరుడు రేవంత్‌రెడ్డి.
ఆంధ్రాపార్టీని నమ్ముకుంటే పుట్టగతులుండవని కాంగ్రెస్‌లో చేరి చంద్రబాబుకు కోవర్ట్‌గా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి ఓవరాక్షన్ గాడి తప్పింది. చంద్రబాబుతో కలిసి ఆయన పన్నిన తెలంగాణ వ్యతిరేక కుట్రలు ప్రజలు మరిచిపోతారన్న భ్రమలో ఉన్నాడు. తెలంగాణ రాకుండా రహస్యంగా, బహిరంగంగా కుట్రలు, కుతంత్రాలు చివరి వరకు పన్నిన చంద్రబాబు సలహాతో కాంగ్రెస్‌లో చేరాడు రేవంత్ రెడ్డి. స్థాయికి మిం చిన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఇప్పుడు ఆటలో అరటి పండు మాదిరిగా తయారయ్యాడు. చితిమంటలను చలి మంటలుగా కాచుకొని, దారుణ మారణహోమాన్ని సృష్టించిన నారాసురుని భజన చేసి, ఆనందించినవాడు రేవంత్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్‌ను, ఆయన కుటుంబాన్ని విమర్శించడం హాస్యాస్పదం.
ఆర్టీఐని, రైట్ టు ఇన్కమ్ యాక్ట్‌గా వాడుకొన్న ఆర్టీఐ బ్రోకర్ రేవంత్. బ్రోకర్తనంతో బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్న జాదునాయకుడు రేవంత్. మొన్నటికి మొన్న కొత్తగా కట్టుకున్న డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని కూడా ఆర్టీఐ ద్వారా బద్నాం చేయాలని ప్రయత్నించాడంటే తెలంగాణపై ఆయనకు వ్యతిరేకత ఎంత ఉందో…అర్థమవుతున్నది. తెలంగాణ వచ్చిన కొత్తలోనే ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రచేసి డబ్బు సంచులతో దొరికిన ఈ పచ్చ బాబు భక్తుడు ఎవరి ప్రయోజనాలకు పనిచేస్తాడో చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలకు తెలుసు. విచిత్రమేమిటంటే బాబు కనుసన్నల్లో సోనియాగాంధీని బలి దేవత, దెయ్యం అని తిట్టిన ఆయన కింద కాంగ్రెస్ హేమాహేమీలు హోంగార్డులుగా పని చేయాల్సిరావడం వారు చేసుకున్న పూర్వజన్మ శాపం. అందుకే అనుభవించక తప్పటంలేదు. ఇది చాలదన్నట్టు కొంత కాలంగా అణగారిన వర్గాలను తొక్కుకుంటూ కుల అహంకార పునాదుల మీద పార్టీ నిర్మాణం చేపట్టే పనిలో పడ్డాడు రేవంత్. అసలు కాంగ్రెస్ వాదులకే కొసరు పాఠాలు చెబుతున్న ఈ నాయకుడి తీరు సిగ్గుకే సిగ్గనిపించేలా ఉన్నది.
నరనరాన ‘నారా’ భక్తి నింపుకున్న ఈ రేవంత్ రెడ్డి, మొన్న ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ అంత్యక్రియల సందర్భంగా చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ మరణాన్ని కూడా నీచ రాజకీయాలకు వాడుకున్న తీరు అత్యంత జుగుప్సాకరంగా ప్రజలు భావిస్తున్నారు. అప్రకటిత గ్రీన్ హంట్ దాడులతో తెలంగాణలో రక్తపుటేరులు పారించిన కాంగ్రెస్‌ను ఈ ప్రాంతం మర్చిపోలేదు. వేలాది ఉద్యమ బిడ్డలను పొట్టన పెట్టుకున్న టీడీపీ నారా బాబు దత్తపుత్రుడు రేవంత్‌కు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయనేది నిర్వివాదాంశం.
రేవంత్ స్థాయిని మరిచి… చిన్నంతరం, పెద్దంతరం లేకుండా మాట్లాడుతున్నాడు. తెలంగాణ ప్రజలు ఆరాధ్య దైవంగా భావించే నేత కేసీఆర్ అంటే లెక్కలేదు. ఇంకా తెలంగాణ భవిష్యత్ నేత కేటీఆర్ అంటే అసలే గిట్టదు. ఎలాగూ రాజకీయాల్లో హుందాగా వ్యవహరించడం చేతకాదు కానీ, కనీసం సత్యం మాట్లాడే ప్రయత్నం చేస్తే ప్రజల మద్దతు దొరికేది. పీడిత ప్రజల ఆశలు, ఆశయాలకు తుపాకీ గుండ్లతో సమాధానం చెప్పిన పచ్చపార్టీ, కాంగ్రెస్ కల్లోల పార్టీల ప్రతినిధిగా తెలంగాణ ప్రజలకు ఏమి చేస్తారో చెప్పకుండా.. పనిగట్టుకొని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని తెలుసుకుంటే మంచిది. ఒంటెద్దు పోకడలతో నడుపుతున్న కాంగ్రెస్ దుకాణం ఎలక్షన్ల వరకు కూడా ఉండనిచ్చేటట్టు లేరు. నీ భజన భక్తులను చూసి కావ్, కావ్ మంటూ కాకి లెక్కలు చెప్పుకుంటా పోతే అనుకున్న టైమ్ కన్నా ముందే బంద్ చేయడం ఖాయం. బాబుకు ఇచ్చిన విధంగానే రేవంత్‌కూ తెలంగాణ ప్రజలు వడ్డీతో సహా తిరిగి చెల్లించడం తప్పదు.
తెలంగాణ మాడల్ దేశమంతా విస్తరించాలని, ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ పేరుతో బీఆర్ఎస్ స్థాపనతో దేశ వ్యాప్తంగా కేసీఆర్‌కు పెరుగుతున్న గ్రాఫ్, వస్తున్న ఆదరణ, కురిపిస్తున్న ప్రశంసలను ఓర్వలేక రేవంత్ నోరు పారేసుకోవడం తెలంగాణ సమాజం సహించడం లేదు. తెలంగాణ రాష్ట్ర సాధనలో చావంచులను చవిచూసిన కేసీఆర్‌పై అవాకులు చెవాకులు పేలడం రేవంత్ మూర్ఖత్వానికి నిదర్శనం. బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో వేలాది మందిని పొట్టన పెట్టుకొని, తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పిండ ప్రదానం చేస్తారనేది తథ్యం.
(వ్యాసకర్త : జర్నలిజం శాఖ విభాగాధిపతి, కేయూ)