నా జీవితం తెరిచిన పుస్తకం అన్ని ఎన్నికల అఫిడవిట్లలో నా భూములు, ఆస్తుల వివరాలు సుస్పష్టంగా చెప్పిన అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బైండ్ల సంఘం సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ వాళ్లు సిద్దిపేటకు వస్తున్నరట. నా భూములు చూసి పోతరట. వందల మంది పోలీసులు, బుల్లెట్ ప్రూఫ్ బండ్లు, రోప్ పార్టీలు ఎందుకు? డ్రోన్లు పెట్టి ఫొటోలు తీయడం ఎందుకు?
నేను ఇక్కడే ఉన్న నాకు చెబితే వారికి అన్ని ఏర్పాట్లు చేస్తానని తెలిపారు. మంచిగ కడుపు నిండ అన్నం తినిపించి దగ్గరుండి కంటి నిండా తోట అన్నీ చూపిస్తానని పేర్కొన్నారు. కాకుంటే ఉన్నది ఉన్నట్లు చెప్పండి. అబద్ధాలు చెప్పకండని హితవు పలికారు. అన్ని ఎన్నికల అఫిడవిట్లలో నా భూములు, ఆస్తుల వివరాలు సుస్పష్టంగా చెప్పిన. సర్వే నెంబర్లతో సహా భూముల వివరాలు ఇచ్చినం. రామంచల 13 ఎకరాలు ఉంటే లేని పోనీవి చెప్పుతున్నారు.
నేను దాచింది ఏముంది. నువ్వు కొత్తగా బయట పెట్టేది ఏముంది. మీ లాగా నేను కబ్జాలు పెట్టలేదు, ప్రజల సొమ్ము దోచుకోలేదని స్పష్టం చేశారు. సిద్దిపేట ప్రజలు నా పని చూసి ఏడు సార్లు గెలిపించారు. నన్ను దీవించారు. మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు. మా సిద్దిపేట అంటేనే ప్రేమ, ఆప్యాయతకు, ఆతిథ్యానికి చిరునామా..సిద్దిపేటకు ఎవరు వచ్చినా కడుపునిండా అన్నం పెడతాం ప్రేమగా మాట్లాడుడుతామన్నారు. అంత మంది పోలీసులు పెట్టుకొని భయపడుకుంటూ రావాల్సిన అవసరం మీకు లేదని తెలిపారు.