‘వదినె…గ్యాస్ బుక్ అయిందా మీకు? నాకైతే లేదు, యుద్ధం అంట, గ్యాసు బండలు దొరుకవంట, ఇండక్షన్ స్టవ్వు, పొయ్యిలు పెట్టుకోవాలె ఇంక’ అని పక్కింటి వదినె వచ్చి గబగబా చెప్పింది. ఒక రెండునిమిషాలు నాకసలు ఏమీ అర్థం కాలేదు. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధం గురించి మనకు రోజూ పట్టదు. ఏ రోజైతే మనకు వంట గ్యాస్ దొరుకదో ఆరోజే మనకు దిగులు స్టార్ట్ అయితది.
మనకు సాధారణంగా ఉన్న భావన చాలా సరదాగా ఉంటది. టీవీలో వార్తలు వస్తుంటయి, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి, హోర్ముజ్ జలసంధి వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి, చమురు సరఫరాపై ప్రభావం పడొచ్చునని ఆ వార్తలు వింటం, తల ఊపుతం, రిమోట్ మార్చి ఇంకో ఛానెల్ పెడుతం. ఎందుకంటే ఆ విషయాలన్నీ మన జీవితానికి చాలా దూరంగా ఉన్నట్టే అనిపిస్తయి. కానీ రెండు రోజుల తర్వాత పెట్రోలు బంకుల దగ్గర ధరల బోర్డు చూస్తే ఒక్కసారిగా మనకు జ్ఞానోదయం అయితది. అరే.. పశ్చిమాసియాలో జరిగిన యుద్ధం మన ఊరికి, మన వంటగదిలోకి వచ్చేసిందేమో! అని.
ప్రపంచ రాజకీయాలు సాధారణంగా మనకు చాలా దూరంగా ఉన్న విషయాల్లా అనిపిస్తాయి. పశ్చిమాసియాలో ఏ దేశం ఎవరితో ఉద్రిక్తతలు పెంచుకున్నది? ఏ సముద్ర మార్గం మూసుకుపోయే పరిస్థితి వచ్చింది? ఏ దేశం ఎవరిని హెచ్చరించింది? ఇవన్నీ టీవీ వార్తల్లో వినిపించే పెద్ద పెద్ద పదాలు మాత్రమే అనిపిస్తాయి. కానీ నిజం ఏమిటంటే, ఆ పెద్ద పదాలన్నీ చివరికి ఒక చిన్న ఇంటి వంటగదికి వచ్చి చేరాయి. ప్రపంచ రాజకీయాల పెద్ద చెస్ ఆటలో కదిలే పావులు దూరంగా కనిపించినా, వాటి ప్రభావం మన ఇంటి పెనం మీద ఉన్న నూనె ధరలో కనిపిస్తుంది.
పశ్చిమాసియాలో ప్రస్తుతం కనిపిస్తున్న ఉద్రిక్తతలు కూడా అలాంటివే. హోర్ముజ్ జలసంధి అనే చిన్న సముద్ర మార్గం గురించి వార్తల్లో
మాట్లాడినప్పుడు అది ఎక్కడ ఉందో కూడా చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ప్రపంచ చమురు రవాణాలో పెద్ద భాగం ఆ మార్గం ద్వారానే జరుగుతుంది. ఒకవేళ ఆ మార్గం కట్టడి అయితే చమురు సరఫరా తగ్గిపోతుంది. సరఫరా తగ్గితే ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అలజడి మొదలవుతుంది. చివరకు అది పెట్రోలు బంకుల బోర్డుపై కనిపించే ఒక కొత్త సంఖ్యగా మారుతుంది.
అక్కడి వరకు కూడా బాగానే ఉంటుంది. కానీ అసలు విషయం అక్కడి నుంచే మొదలవుతుంది. ప్రపంచంలో ఎక్కడో జరుగుతున్న శక్తి రాజకీయాల గురించి పెద్ద పెద్ద విశ్లేషణలు వస్తుంటాయి. సైనిక వ్యూహాలు, అంతర్జాతీయ ఒప్పందాలు, ఆర్థిక ఆంక్షలు ఇవన్నీ చర్చల్లో వినిపిస్తాయి. కానీ ఒక సాధారణ మనిషి మాత్రం ఈ అంతటి చర్చలన్నింటినీ ఒకే ప్రశ్నతో ముగిస్తాడు.. ‘పెట్రోలు ధర మళ్లీ పెరిగిందా?’ అని. అంతే… ప్రపంచ రాజకీయాల గొప్ప నాటకం చివరికి పెట్రోలు బంక్ దగ్గరే ముగుస్తుంది.
ప్రపంచ శక్తులు తమ ప్రాభవం కోసం పోరాడుతుంటే, మనం మాత్రం బైక్ ట్యాంక్ నింపించేటప్పుడు మన జేబు ఎంత ఖాళీ అవుతుందో చూసుకుంటూ ఉంటాం. ఒక రకంగా చూస్తే ఇది సాధారణ విషయమే. మరో కోణంలో చూస్తే ఇది చాలా లోతైన వాస్తవం. చమురు ధరలు పెరిగితే దాని ప్రభావం కేవలం వాహనాలపైనే కాదు, రవాణా ఖర్చులు పెరుగుతాయి. రవాణా ఖర్చులు పెరిగితే మార్కెట్లో వస్తువుల ధరలు పెరుగుతాయి. కూరగాయల నుంచి ధాన్యం వరకు ప్రతి వస్తువూ కొంచెం కొంచెంగా ఖరీదవుతుంది. అలా ప్రపంచ రాజకీయాల తుఫాన్ చివరకు ఒక సాధారణ కుటుంబంలో వంటగదిని ముట్టడిస్తుంది.
ఈ పరిస్థితుల్లో మనం ఎలా స్పందిస్తామనేది కూడా ఆసక్తికరమైన విషయం. సాధారణంగా మనిషి చేసే మొదటి పని ఆగ్రహించడం. ప్రభుత్వాన్ని తప్పుపట్టడం, ప్రపంచ రాజకీయాలను తిట్టడం, లేదా పరిస్థితులపై అసహనం వ్యక్తం చేయడం. సోషల్ మీడియాలో అయితే ఈ ప్రక్రియ ఇంకా వేగంగా జరుగుతుంది. మరొక విషయం ఏమిటంటే..మనం తరచుగా సమస్య మూలాన్ని గమనించం. చమురు ధరలు పెరిగితే మనం వెంటనే బాధపడుతాం. కానీ అదే సమయంలో మన జీవన విధానం చమురు మీద ఎంతగా ఆధారపడి ఉన్నదో మాత్రం ఆలోచించం. ప్రపంచం పరస్పర సంబంధాల ఒక పెద్ద వ్యవస్థ. ఒక ప్రాంతంలో జరిగే ఘటన మరొక ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుంది. పశ్చిమాసియాలో జరిగిన ఉద్రిక్తతలు మనదేశంలోని ఒక చిన్న పట్టణంలో కూడా జీవన వ్యయాన్ని మార్చగలవు. ఈ వాస్తవం మనకు ఒక ముఖ్యమైన పాఠం చెప్తుంది.
చివరగా ఒక చిన్న మాట, ప్రపంచ నాయకులు తమ తమ వ్యూహాలతో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. సముద్ర మార్గాలు, చమురు సరఫరాలు, సైనిక శక్తులు, ఇవన్నీ వారి చర్చల మేథోమథనం. కానీ ఆ నిర్ణయాల ప్రభావం చివరకు ఎవరి మీద ప్రభావం చూపుతుందంటే, ఉదయం మార్కెట్కు వెళ్లి కూరగాయలు కొనే ఒక సాధారణ మనిషి మీదే! అందుకే ప్రపంచ యుద్ధాలు, ఆర్థిక పోరాటాలు, రాజకీయ వ్యూహాలు అన్నీ చివరికి ఒక చిన్న ప్రశ్నగా మారిపోతాయి. ఈ నెల వంట ఖర్చు ఎందుకింత పెరిగింది? అందుకే ప్రపంచ రాజకీయాల గొప్ప కథ వంటగదిలో ముగుస్తుంది.
(వ్యాసకర్త: మోటివేషనల్ స్పీకర్)
-రమాదేవి కులకర్ణి
8985 613123