ఎనకట వడ్లు దంచబోతే
నూకలే కూలిచ్చిన్రు
ఆకలికి నూకలొండుకొని తిని బత్కినం
పరంతో గంజి గాస్కొని తాగినం
పండుగలకు బెల్లం పాయసం జేస్కున్నం
నువ్వులు.. నూకలు.. కల్పిస్తే…
మా పోరగాళ్లు సంబురపడి తిన్నరు
కరువు కాటకాల్లో మమ్మల్ని నూకలే కాపాడినయ్
కట్టకాలంల ఆదుకున్న నూకలను
ఈ దినం సులకన జేత్తే
సూత్తూ ఊరుకునేదే లేదు
మా బతుకులు నూకల్తోనే మొదలైనయ్
అచ్చెర సీకారం తర్వాతే
కాక్కాల గుణితం నేర్వాలట
నూకల పరం తిన్నాకే
నేడు సన్నబియ్యం కెదిగినం
ఈయాల కాళేశ్వరం కడుపు నిండి
మా పొట్టలు నింపుతున్నది
నాడు తెల్లోడు మన పంటను
సముద్రంలో పోసి సంబురపడి
మా పొట్టలు కొడ్తే…
నేడు మంచి బియ్యం వాళ్ల గోదాంల బోసి
మాకేమో నూకలు తిన నేర్పాలనీ
హుకూమత్ జేస్తున్నడు
వీడు సూడబోతే తెల్లోని తోటోడే
వీనికి సక్కగ జెప్తె సమజ్గాదు
గొడ్డుకు తినిపించే తవుడు, పరం
నూకలు గూడ గోయల్‌కు తిన్పిస్తే సరి
గోయాలూ మాతో గోక్కోకు
గమ్మున పడుండు.. లేకుంటే
గో బ్యాక్ అవుతవు.. తప్పదు మరి!