మెల్బోర్న్: వారం రోజులుగా నిలకడగా సాగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్‌లో శుక్రవారం సంచలన ఫలితాలు నమోదయ్యాయి. టైటిల్ సాధనే లక్ష్యంగా దూసుకుపోతున్న టాప్ సీడ్ కార్లొస్ అల్కరాజ్ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. కానీ మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో పాటు మహిళల విభాగంలో ఏడో సీడ్ జైస్మిన్ పౌలిని (ఇటలీ)కి మూడో రౌండ్లో ఎదురుదెబ్బ తగిలింది.
శుక్రవారం రాడ్ లివర్ ఎరీనా వేదికగా జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో అల్కరాజ్.. 6-2, 6-4, 6-1తో కొరెంటిన్ మౌటెట్ (ఫ్రాన్స్)ను చిత్తుచేశాడు. 2 గంటల 5 నిమిషాల పాటు సాగిన పోరులో వరుస గేమ్స్‌ను గెలుచుకున్న ఈ టాప్‌సీడ్.. మ్యాచ్‌లో 3 ఏస్‌లు సంధించి 30 విన్నర్లు కొట్టాడు. జ్వెరెవ్.. 7-5, 4-6, 6-3, 6-1తో 26వ సీడ్ కామెరూన్ నూరీ (యూకే) చేతిలో పరాజయం పాలయ్యాడు. 11వ సీడ్ మెద్వెదెవ్ (రష్యా).. 6-7 (5/7), 4-6, 7-5, 6-0, 6-3తో ఫాబియన్ (హంగేరి)ని ఓడించాడు.
మహిళల సింగిల్స్‌లో పౌలినికి యూఎస్ యువ సంచలనం ఇవా జోవిచ్ ఊహించని షాకిచ్చింది. మూడో రౌండ్లో 18 ఏండ్ల జోవిచ్.. 6-2, 7-6 (7/3)తో పౌలినిని చిత్తుచేసింది. టాప్ సీడ్ అరీనా సబలెంకా (బెలారస్).. 7-6 (7/4), 7-6 (9/7) పొటపొవ (ఆస్ట్రేలియా)పై కష్టపడి గెలిచింది. మూడో సీడ్ కోకో గాఫ్ (యూఎస్).. 3-6, 6-0, 6-3తో హేలి బాప్టిస్టె (యూఎస్)పై గెలిచింది.