న్యూఢిల్లీ : బంగ్లాదేశ్లో యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా విరుచుకుపడ్డారు. యూనస్ పరిపాలన దేశాన్ని అరాచకంలోకి నెట్టివేస్తున్నదని ఆమె ఆరోపించారు. శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలాయని, విధ్వంసకర పరిస్థితుల మధ్య ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ఇప్పుడు రక్తంతో తడిసిన ప్రాంతంగా మారిపోయిందని అన్నారు.
విదేశీ ప్రతినిధులకు చెందిన క్లబ్ ఆఫ్ సౌత్ ఆసియా నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్లో అందించిన ఆడియో సందేశంలో మాట్లాడుతూ ఒకప్పుడు శాంతితో సారవంతంగా కళకళలాడిన బంగ్లాదేశ్ ఇప్పుడు పూర్తి హింస, విధ్వంసం, భయానక వాతావరణాన్ని ఎదుర్కొంటున్నదని అన్నారు.