ఇండియా గేట్ దగ్గర ఓ పెద్దాయన సమోసాలు అమ్ముతున్నాడు. అతని వయసు డెబ్బైకి ఇటుగానే ఉంటుంది. అతని పేరు దిలీప్ పండిత్. 1990లో కశ్మీర్ నుంచి శరణార్థిగా ఢిల్లీకి వచ్చాడు. ఆనాటికి ఆయన వయసు 52 ఏండ్లు. ‘కశ్మీర్ నుంచి ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఢిల్లీకి వచ్చాం. 18 ఏండ్లుగా పొట్టకూటి కోసం రోజూ చస్తూ బతుకుతున్నాం’ అన్నాడా పండిత్. నాటినుంచి ఎన్నో ప్రభుత్వాలు, పాలకులూ మారారు. కొత్త చట్టాలూ వచ్చాయి. కానీ, కశ్మీర్ పండిత్‌ల జీవితాలు మాత్రం మారిన దాఖలాల్లేవు.
ఇక ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా విషయానికి వస్తే.. కశ్మీర్ పండిత్‌లపై జరిగిన దురాగతాన్ని నిర్దంద్వంగా ఖండించాల్సిందే! అయితే, కాషాయదళం తమ రాజకీయ లబ్ధి కోసం ఈ చిత్రాన్ని ఇంతగా వాడుకోవడం చూసి కశ్మీర్ పండిత్లే ముక్కున వేలేసుకుంటున్నారు.
1989-90 మధ్య కశ్మీర్లో పాక్ ప్రేరేపిత దుశ్చర్యలు శ్రుతిమించిన కాలంలో.. హస్తినలో ఉన్నది బీజేపీ మద్దతుతో జనతాదళ్ ప్రభుత్వం. లెఫ్టిస్ట్‌లు, రైటిస్ట్ల మధ్య లెఫ్ట్‌రైట్ కొడుతూ సాగిందా ప్రభుత్వం. స్వపక్షంలోని వైరి వర్గాలను సముదాయించలేక అప్పటి ప్రధాని వీపీ సింగ్.. ఏ ప్రతాపమూ చూపలేకపోయాడు (మండల్ కమిషన్ మినహాయిస్తే)! కశ్మీర్లో కల్లోలం రేగుతున్నా.. ఆయన సర్కార్‌కు ఏ ముప్పూ వాటిల్లలేదు. కశ్మీరీ పండిత్‌లు శరణార్థులుగా వలసపోతున్నా.. వీపీ సింగ్ ప్రధాని పీఠం కదల్లేదు. విడమరిచి చెప్పాలంటే.. తమ మద్దతుపై నిలబడిన సర్కార్‌ను కూలదోయడానికి బీజేపీకి కశ్మీర్ పండిత్‌ల అంశం పెద్ద కారణంగా అనిపించలేదేమో!
కశ్మీర్ నుంచి వలసవచ్చిన శరణార్థులు కన్నీళ్లు కారుస్తూ దేశమంతా రుతుపవనాల్లా విస్తరించారు. నాడు వారి కన్నీళ్లు తుడవడానికి ఏ చేతులూ ముందుకు రాలేదు. 1990 సెప్టెంబర్‌లో అద్వానీ రథయాత్ర మొదలైంది. దాదాపు నెల రోజులకు ఆ యాత్ర బీహార్ చేరుకున్నది. అప్పటి బీహార్ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ బీజేపీ రథసారథిని అరెస్ట్ చేయించారు. ఆ వెంటనే వీపీ సింగ్ సర్కార్‌కు బీజేపీ మద్దతు ఉపసంహరించుకున్నది.1990 అక్టోబర్ 23న అద్వానీ అరెస్ట్ అయితే, నవంబర్ 7న పార్లమెంట్లో బలం నిరూపించుకోలేక వీపీ సింగ్ ప్రభుత్వం కూలిపోయింది. కశ్మీర్ పండిత్‌లపై జరిగిన అకృత్యాలపై ప్రభుత్వాన్ని కూలదోయని కాషాయదళం.. రథయాత్ర విషయంలో మాత్రం తక్షణం స్పందించడంలో ఆశ్చర్యమేం లేదు.
ఎవరి వల్ల కశ్మీర్ పండిత్‌ల బతుకులు రోడ్డున పడ్డాయని భావించారో, అందుకు అనుగుణంగా ప్రచారం చేశారో ఆ వ్యక్తులతో, ఆయా పార్టీలతో హిందుత్వమే ప్రధాన అజెండాగా చెప్పుకొనే బీజేపీ దఫ దఫాలుగా అనుబంధం కొనసాగించడం దాచినా దాగని చారిత్రక సత్యం. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఎన్డీయే-2 సర్కార్‌లో కేంద్రమంత్రిగా పనిచేయడం ఇందుకు ఉదాహరణ. కశ్మీర్లో మారణకాండ జరిగినప్పుడు కేంద్ర హోంమంత్రిగా ఉన్న ముఫ్తీ మహమ్మద్ సయీద్ కూతురు, మెహబూబా ముఫ్తీకి మద్దతిచ్చి 2016లో ఆమెను కశ్మీర్ పీఠంపై కూర్చోబెట్టింది బీజేపీనే.
ఇక ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా విషయానికి వస్తే.. కశ్మీర్ పండిత్‌లపై జరిగిన దురాగతాన్ని నిర్దంద్వంగా ఖండించాల్సిందే! అయితే, కాషాయదళం తమ రాజకీయ లబ్ధి కోసం ఈ చిత్రాన్ని ఇంతగా వాడుకోవడం చూసి కశ్మీర్ పండిత్లే ముక్కున వేలేసుకుంటున్నారు. ‘ఇన్నాళ్లూ వాళ్లు అణచివేయాలని ప్రయత్నించిన నిజం, ఇప్పుడు వాస్తవాల మద్దతుతో బయటకు రావడంతో షాక్ అవుతున్నారు’ అని ప్రధాని మోదీ స్వయంగా అన్నారు. దీన్ని ఇంత తెలివిగా ప్రచారం చేసుకుంటున్న తీరును చూసి పండిత్‌ల మనసు చివుక్కుమనక మానదు.
ఇదొక్కటే కాదు, గతంలోనూ కశ్మీర్
పండిత్‌లపై జరిగిన దురాగతాలపై డజన్‌కు పైగా చిత్రాలు, షార్ట్‌ఫిల్మ్‌లు, డాక్యుమెంటరీలు వచ్చాయి. వీటిలో కశ్మీర్ పండిత్‌లు దర్శకత్వం వహించినవీ ఉన్నాయి. ఏ చిత్రానికీ ఇవ్వని ప్రాధాన్యం బీజేపీ ఈ సినిమాకు ఎందుకిస్తున్నదో తెలుసుకోలేని స్థితిలో లేరు దేశ ప్రజలు.
‘భావ ప్రకటన స్వేచ్ఛ గురించి ధ్వజమెత్తే కొందరు కొద్దిరోజులుగా అశాంతితో రగిలిపోతున్నారు. ఒక సత్యాన్ని దేశం ముందుకు తీసుకురావడం వల్ల మంచే జరుగుతుంది’ అని మోదీ ఉద్విగ్నంగా సెలవిచ్చారు. అయితే, ఈ చిత్రానికి ఎడతెగని ప్రచారం కల్పించడం వల్ల కశ్మీర్ పండిత్‌లకు జరిగే మేలు ఏంటో ప్రధాని మోదీ చెప్తేనే బాగుంటుంది. వారిపై జరిగిన అన్యాయాలను చాటిచెప్పిన చిత్రాలు గతంలో ఎన్ని వచ్చినా తను ఇంతలా ఎందుకు స్పందించలేదన్న సత్యం చెప్తే ఇంకా బాగుంటుంది.
‘డైరీ ఆఫ్ కశ్మీరీ పండిత్’, ‘ద లాస్ట్ పారడైజ్’, ‘షీన్’, ‘షికార్’, ‘నైన్టీన్త్ జనవరి’, ‘ఘర్ కా పతా’ ఇలాంటి చిత్రాలు, డాక్యుమెంటరీలు, షార్ట్‌ఫిల్మ్ కథలు కశ్మీర్ పండిత్‌ల వ్యథలే! వాటి విషయంలో ఎలాంటి హడావుడి చేయని బీజేపీ ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా విషయానికి వచ్చేసరికి ఏం ఆశించి ఇంత ప్రచారం చేస్తున్నదో ఊహించుకోవచ్చు. ‘దశాబ్దాలుగా దాగి ఉన్న సత్యాన్ని చాటిచెప్పారు’ అని మోదీ సగర్వంగా ప్రకటించారు. అయితే, అంతకుముందు విడుదలైన సినిమాల గురించి ఆయనకు తెలియదనుకోవాలా? కాసేపు తెలియదనుకున్నా…, 2013లో నిర్మించిన ‘ద లాస్ట్ పారడైజ్’ డాక్యుమెంటరీని బీజేపీ అధికారిక యూట్యూబ్ చానల్లో అప్లోడ్ చేసిన సంగతి ఆయన కావాలనే మరచిపోయారని భావించాలి.
1984లో ఇందిరాగాంధీ హత్య తర్వాత సిక్కుల ఊచకోత, 1990లో కశ్మీర్ పండిత్‌లపై మారణకాండ, 2002లో మోదీ సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్లో జరిగిన అల్లర్లు స్వతంత్ర భారత చరిత్రలో నెత్తుటి మరకలు. వీటి నుంచి అటు ప్రజలు, ఇటు పాలకులు గుణపాఠాలు నేర్చుకోవాలి. అంతే కానీ, తమ మనుగడకు ముప్పు వాటిల్లినప్పుడల్లా, ఓట్లు కావాల్సినప్పుడల్లా గుండెలు మండించి చలిమంట కాచుకోవద్దు. చరిత్రలో దాగిన దస్ర్తాల దుమ్ముదులిపి అస్ర్తాలుగా ప్రయోగించడం రాజకీయం అనిపించుకుంటుంది! కానీ, మోదీ ఇలాఖాలో వాజపేయి అన్నట్టు రాజనీతి అనిపించుకోదు. 32 ఏండ్లుగా కశ్మీర్ పండిత్‌లు కుమిలిపోతూనే ఉన్నారు. వారి హృదయాలకు తగిలిన గాయాలకు అభివృద్ధే నిజమైన మలాము! అవసరానికి కాకుండా, అన్నివేళలా వారిని ఆదరించడమే సరైన సలాము!!
ఎవరి వల్ల కశ్మీర్ పండిత్‌ల బతుకులు రోడ్డున పడ్డాయని భావించారో, అందుకు అనుగుణంగా ప్రచారం చేశారో ఆ వ్యక్తులతో, ఆయా పార్టీలతో హిందుత్వమే ప్రధాన అజెండాగా చెప్పుకొనే బీజేపీ దఫదఫాలుగా అనుబంధం కొనసాగించడం దాచినా దాగని చారిత్రక సత్యం.
– కణ్వస