అంబటాళ్ల బస్సు అటువోయిందో లేదో, ఇటు కాకచ్చి ఆలింది ఇంటిమీన. ‘కావ్.. కావ్..’మంటూ ఒర్రుతనే ఉన్నది. ‘ఎవ్వలో సుట్టాలొత్తరు సూడే అవ్వా’ అనుకుంటా గల్మకాడ బకీట్ల నీళ్లువెట్టి ఔతల వడ్డడు పెద్ద మామ. ‘అగ్గొ అంజిగాడు అట్లన్నడో లేదో.. అల్లుడు రానే రావట్టె..’ కొత్తంగి, తెల్లదోతి కట్టుకొని, నోట్లెకెళ్లి పొగూదుకుంటా అస్తున్న బాపును జూస్కుంట ‘ఓ పిలగా మీ బాపొస్తున్నడ’ని నాకు జెప్పంది అమ్మమ్మ. బాపు రాంగనే ‘అల్లుని కాళ్లకు నీళ్లియ్యి బిడ్డా’ అని ఆత్రంగురికచ్చిన అజ్జిరవ్వ చేతికి శెంబిచ్చింది అమ్మమ్మ.ఇరువై ఏడేండ్లుంటడు గావచ్చు శిన్నమామ రాయేశ్వర్లు. ఏమైందో ఏమో.. ఓ రోజు రోడ్డుమీన నిల్సున్నకాన్నే కుప్పకూలిండు. కన్నారం దావఖాన కేస్కవోతే ‘మెదట్ల రక్తం గడ్డగట్టింది.. పట్నం తీస్కపోవాల్న’న్నరు. కాల్రెక్కలాడితే గానీ కడుపు నిండని పరిస్థితి అమ్మమ్మోళ్లది. నల్గురు బిడ్డలు నపరిన్ని పైసలు పోగుజేసి అమ్మమ్మను పట్నం దావఖానకు సాగదోలిర్రు. పట్నంల రెండు, మూణ్నెల్లున్న అమ్మమ్మ ‘ఇగ నీ కొడు క్కు అచ్చిన బీమారేందో మాగ్గూడ దొర్కుతలేదు. ఇం టికి వట్టుకుపో అమ్మా’ అని డాక్టర్లు శెప్తే లచ్చింపురం ఏస్కచ్చింది. మంచం మీన పడుకొని ఉన్నడు శిన్నమా మ. ఉలుకూ పలుకు లేదు. జీవునం మాత్రం ఉన్నది.
గొడ్డూ, గోదా.. ఎద్దూ, ఎవుసం.. ఇడ్శిపెట్టి బాపు లచ్చిపురం ఎందుకొచ్చిండంటే? శిన్నమామను సూడటానికొచ్చిండు. కొద్దిసేపు శిన్నమామను జూస్కుంట అమ్మమ్మోళ్ల ఇంట్లనే గూసున్న బాపు అంగి శెమ్టలతోని పదనైంది. అసలే ఎండకాలమంటే కరెంటు వొయి నాలుగైదు గంటలైతున్నది. మంచిగున్న బాపుకే అట్లున్నదంటే కాల్రెక్కలు కదిలియ్యలేని శిన్నమామకెట్లుంటదో ఊహించుకుంటనే బాధనిపిచ్చింది. ‘బాపు ఈత గొడ్దాం పాయె, ఎండకు పెయి సల్లవడ్తది’ అని అంటున్న నాకు ‘మీ పెద్దమామ బుర్రకాయ ఏడ ఓరకు వెట్టుకున్నడో తియిరా’ అని జవాబిచ్చిండు. (అప్పటికి నాకింకా ఈత రాదు) మా మజ్జనకొచ్చిన అమ్మమ్మ ‘బుర్రకాయ రేకుల మీదుంది బిడ్డా’ అని బాపుతోటి జెప్పింది. బాపు కుడిచేతి ల బుర్రకాయ ఉంటే, ఆయన ఎడమ చేతి చిటికనేలుకు నా చిటికనేలు జతయింది. ఇద్దరం ఒడ్లపొంటి నడుస్తనే ఉన్నం. మా తొవ్వ బాయికాడికి సాగుతున్నది.
అసలే ఎండకాలం.. కోసిన వరిగొయ్యల నడుమ భూమి నోరు దెర్సుకొని ఆవురావురుమని సూత్తున్నది. ఇంక బాయి గూడ రాలేదు గని నేను, మజ్జనకెల్లే గుండీలిప్పుకుంటా వోతున్న. బాయికాడికి సక్కగ వోయి ఎప్పుడెప్పుడు బాయిల దుంకుదామా అని తొంగిసూత్తే సుక్క నీళ్లు కనవడ్తలెవ్వు. ఆ బాయి తర్వాత, ఇంకో బాయి, ఆ తర్వాత ఇంకో బాయి. లచ్చింపురం మొత్తం గాలిచ్చినం. నీళ్ల జాడ లేదు.
‘ఏమాయెనుల్లా పొద్దుగూకంగా అస్తరనుకుంటే మాయిలమె రావడ్తిరి’ ఓ రెండు గంట ల తర్వాత ఇంట్లడుగు ఇంక వెట్టనేలేదు అడిగింది అజ్జిరవ్వ. ‘ఓ కొద్ది నీళ్లా మీ ఊళ్లే.. బాయిలు నిండి బైటికి ఎగేసివోత్తున్నయి. వాగుల పొంటి రువ్వడిగా ఉరుకుతున్నయి. ఆ నీళ్లల్ల మన పోరడేడ కొట్టుకవోతడోనని జెప్ప న ఇంటికి తీస్కచ్చిన’ ఊరంతా తిర్గినా ఏ బాయి ల గూడ నీళ్లు లేకపోయేసరికి అజ్జిరవ్వతోని కారడ్డమాడుతున్నడు బాపు. ఆ యాళ్ల ఎండిపోయిన బాయిలు దరులు తేలి కనవడ్డయి, వాగులున్న ఇసుక మీన నడుస్తా ఉంటే అరికాళ్లకు పొక్కులొచ్చినయి. నాకప్పుడు ఆరేడేండ్లుంటయి గావొచ్చు.
మొన్నటైతారం.. లచ్చింపురం, పెద్దమామోళ్లింటికి వోయిన. నాత్రి అక్కన్నే నిర్ద దీసిన. పడుకునే ముందు నాటి పరిస్థితులు యాదికొచ్చి గుడ్లల్ల నీళ్లు దిర్గినయి. అప్పటిదాన్క ఎలుతురున్న ఇల్లు శిమ్మశీకటైంది. ఏమైందా అని ఆలోచిస్తున్న… ‘ఏ ఎప్పుడు వోదల్లుడు కరెంటు, ఇయ్యాల్లనే వోయింది. ఆగాగు జల్దే అస్తది గని’ అంటనే ఉన్నడు పెద్దమామ. రానే అచ్చింది కరెంటు. కన్నారం పట్టణం నుంచి 25 కిలోమీటర్ల దూరంలుంటది లచ్చింపురం.
ఆ నాత్రి ఏం నిర్దది..? తెల్లారి ఏడు గొట్టేదాన్క తెలివి గాలె. లేసేసరికి యాప పుల్ల, తువ్వాల వట్టుకొని రెడీగున్నడు పెద్దమామ. ఆ యాప పుల్ల పంటికిందేస్కొని బాయి మొకాన వోయిన. నాడు పాతాళానికి జూసినా కనవడని నీళ్లు, నేడు శెంబుతోని ముంచుకునేటట్టు కనవడ్తున్నయి. ఎండకాలం శెల్మల నీళ్లు దొర్కుడే కట్టమనుకుంటే బాయి నిండా నీళ్లు. ఆ నీళ్లను జూత్తే పానమాగలే. భుజం మీదున్న తువ్వాల చెట్టు కొమ్మ మీదేసిన, బట్టలి డ్శి అదే బాయిల దున్కిన. ఓ అద్దగంట సేపు బుద్ధి దీరా ఈతగొట్టిన. ఆ బాయికి ఆనుకొనే ఉంటది ఓ శెట్టు… ఆ శెట్టుమీ ద వాలి రెండు కాకులు ‘కావు.. కావు..’ అంటున్నయి. ఆ అరుపులు బాపుయి, శిన్నమామయేమో అనిపించింది. గడ్డకెక్కి రెండుజేతులా దండం పెట్టిన. సప్పుడుజెయ్యకుంటా ఆ కాకులు ఎగిరిపోతనే ఉన్నయి.
-గడ్డం సతీష్
99590 59041