నా తెలంగాణ
నిన్నటి స్వప్నం
నేటి ప్రభాత కిరణం
నా తెలంగాణ
అరవై ఏండ్ల ఆవేశాన్ని
పుక్కిట పట్టుకొని ఆయుధమై కొట్లాడిన
వీరుల గుండెకాయ
సమైక్య కథల
పంచతంత్ర ప్రపంచంలో
కరటక దమనకుల కపట ప్రేమల నుంచి
బయటపడిన సుందరనందనం
ఉద్యమాల ప్రవాహంలో
బలిదానాల హవిస్సులతో
ప్రభవించిన కొత్తలోకం
ఇప్పుడు నా తెలంగాణ
కొత్త ఆశయాలు
అంకురిస్తున్న కల్పవృక్షం
సొంత గొంతుకతో
శాసిస్తున్న రాజసం
సంక్షేమం భావమై చిమ్ముతున్న కవిత్వం
మానవ బంధాల ఆత్మీయతలు
అల్లుకుంటున్న మల్లెతీగ
యువజన హృదయాకాశంలో
ఉదయిస్తున్న
మరో సూర్యోదయం
ఇప్పుడు నా తెలంగాణ
పాత సాహిత్య చరిత్ర శిథిలాలపై
నిర్మితమౌతున్న సౌహిత్య సౌధం
ఇప్పుడు నా తెలంగాణ
పాత పలుకుబడుల ముళ్ళను వదిలి
పచ్చచిగుర్లు తొడుక్కుంటున్న జ్ఞానవృక్షం
ఇప్పుడు నా తెలంగాణ
అస్తిత్వ భావజాల పరిమళాలను
వెదజలుతున్న వేయిరేకుల
గులాబిపుష్పం!
-పానుగంటి రామమూర్తి
8096139916