భద్రంగా కోడేసుకున్న
బతుకు తాలూకు
కలలు ముక్కలవ్వటం
ఎవ్వరూ తీర్చలేని వెలతి
అకస్మాత్తుగా కుప్పకూలిన
కాలపు గోడల మధ్య
దేహాలు నుజ్జయి పోవటం
అత్యంత సహజం కావచ్చు
కానీ………
రూపాంతరం చెందని
ఎన్నో స్వప్నాలు
శిథిలమవుతాయి కూడా…
ఒకానొక కాళరాత్రి
విరుచుకు పడిన విధి
మహావిషాదాల్ని పరచి పోవచ్చు
కానీ……..
ప్రపంచ గుమ్మాన కన్నీళ్ళతో మోకరిల్లి
చరిచిన వేదనా భరిత గుండె చప్పుళ్ళకు
ఎవ్వరూ ఆసాంతం అద్దం పట్టలేరు
బాధలు ఎప్పుడూ
వందశాతం గ్రంథస్థం కావు
దృశ్యాలను చూసే కళ్ళు
మనసును తోడుక్కున్నప్పుడే
స్వప్నాలు శిథిల మవ్వటం కనిపిస్తాయి
భౌతికంగానో మానసికంగానో
గాయపడ్డ ప్రాణాలు తెరిపిన పడాలంటే..
అనివార్యంగా మెరుపు లేపనాలు
మళ్లీ మళ్లీ రాసుకుంటూ ఉండాలి
ఎవ్వరైనా ఇప్పుడు
చెయ్యాల్సింది ఒక్కటే..
హృదయ కుహరం అహరహం
కొత్తదనాలు తొడిగేట్టు
ఆనందాల్ని పోగు చేసుకోవాలి
కూలిన కునారిల్లిన
శిథిల స్వప్నాల నుంచి….
-డా.కటుకోఝ్వల రమేష్
సెల్:9949083327