బీజేపీ ప్రవచించే ‘సమ్మిళిత హిందుత్వ’ విధానం కారణంగా ఆ పార్టీకి బీసీల మద్దతు లభించింది. ఫలితంగా బీజేపీ లాభపడింది. కానీ, బీసీలకు ఎటువంటి ప్రయోజనం కలుగలేదు. కుల ప్రాతిపదికన జనగణన జరిపితే ఈ విషయం రుజువవుతుంది. అంతేకాదు, బీజేపీ రాజకీయాలకు కూడా అడ్డుకట్టే పడే అవకాశాలు పెరుగుతాయి. అందుకే, బీసీల డిమాండ్ అయిన కులగణనకు కేంద్రంలోని బీజేపీ సమ్మతించటం లేదు.
అధికార కేంద్రాల్లోకి, సంస్థల్లోకి దళితులు, బహుజనులు, ఆదివాసీలను తీసుకురావటం వల్ల భారత్ మరింత ప్రజాస్వామ్యీకరింపబడుతుంది, మరింత సుసంపన్నమవుతుందనే భావనకు భవిష్యత్తులో మద్దతు పెరగటం ఖాయం.
కులగణన వల్ల వివిధ రంగాల్లో బీసీల సంఖ్యకు తగిన ప్రాతినిధ్యం లేదని స్పష్టమవుతుంది. ఈ గుర్తింపు వల్ల సామాజిక న్యాయం కోసం ఈ వర్గాలలో ఒక కొత్త రాజకీయ చైతన్యం మొగ్గతొడిగి, సామాజిక ఉద్యమానికి నాంది పలికే అవకాశం ఉంది. ఈ పరిస్థితే వస్తే బీజేపీ రాజకీయాలు ప్రభావం కోల్పోతాయి. కాబట్టే, బీసీ జనగణన జరుపటానికి బీజేపీ నిరాకరిస్తున్నది.
దేశ ప్రజానీకంలో సామాజికంగా, ఆర్థికంగా వచ్చే మార్పులను అర్థం చేసుకోవటానికి జనాభా లెక్కలు, భారీ సామాజిక సర్వేలు ప్రభుత్వానికి ఉపయోగపడుతాయి. ఆ సర్వేల ద్వారా ఎంతో విలువైన సమాచారం అందుబాటులోకి వస్తుంది. సాధారణంగా వలస ప్రజలు, విద్యావంతులు, వృత్తి సముదాయాలు మొదలైన విభాగాలపై వివిధ సంస్థలు ఇంటింటి సర్వేలను చేపడుతుంటాయి. ప్రభు త్వ విధానాలు, కార్యక్రమాలు ఈ వర్గాలపై ఏ విధమైన ప్రభావం చూపాయనేది తెలుసుకోవడానికి ఈ సర్వేలను జరుపుతాయి. అయితే, విచిత్రమైన విషయం ఏమంటే, మన దేశంలో కులం అనేది సామాజికంగా ఒక ప్రముఖ అంశమైనప్పటికీ దాని ఆధారంగా సమాచారం సేకరించటానికి ప్రభుత్వం సంకోచిస్తుంటుంది. ముఖ్యంగా బీసీల విషయంలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. జాతీయస్థాయిలో కులగణన చేపట్టడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. ఈ వివరాలు సేకరిస్తే కుల ప్రాతిపదికన సామాజిక, ఆర్థిక భావోద్వేగాలు తీవ్రమవుతాయని, తద్వారా తమ ‘హిందు త్వ-జాతీయవాద రాజకీయాలకు’ ఆటంకం ఏర్పడుతుందనే భయమే ఇందుకు కారణం.
భారత ప్రజాస్వామ్యంలో కులం ప్రాథమిక అంశం. 1947 తర్వాత రాజ్యాంగ రచన సాగుతున్నప్పుడు, అప్పటికే సామాజిక, రాజకీయ రంగాలలో కులవ్యవస్థ విష ప్రభావాన్ని చూసిన మన జాతినిర్మాతలు, ఈ కులవ్యవస్థను రూపుమాపి భారత పౌరులకు ఆధునిక జాతీయవాద అస్తిత్వాన్ని నిర్మించాలని భావించారు. కానీ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 73 ఏండ్లయిన తర్వాత కూడా, ఉన్నతవర్గాల కుల అస్తిత్వంలో ముడిపడిన అధికారాలను, ప్రయోజనాలను ప్రజాస్వామీకరించడంలో దేశం విఫలమైంది. సంప్రదాయ సామాజిక కులీన వర్గాలు రాజకీయాధికారం కొనసాగిస్తూ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాలను ఇప్పటికీ నియంత్రిస్తున్నాయి. అట్టడుగువర్గాలు అధికార ప్రాంగణాలకు దూరంగా ఉండి, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను స్వీకరిస్తూ బతుకీడుస్తున్నాయి.
ఓబీసీలు అంటే- కులవ్యవస్థలో అట్టడుగు న ఉండే శూద్రులు. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థతో ముడిపడినవారు, వృత్తి కార్మికులు, చేతివృత్తుల కళాకారులు, ఇతర కష్టజీవులు. వీరిని తరచుగా బహుజనులని సంబోధిస్తుంటారు. 1931 జనగణనలో ఓబీసీ జనాభా వివరాల ను ప్రచురించారు. అప్పుడు వీరి జనాభా 52 శాతం. ఆ తర్వాత నుంచి ఏ ప్రభుత్వమూ ఓబీసీల లెక్కలు తీయలేదు. దళితులు, ఆదివాసీల లెక్కలు తీస్తారు కనుక, వివిధ ప్రాంతాల్లో, ప్రభుత్వ సంస్థల్లో, విద్యారంగం లో వారు ఎంత ఉన్నారనేది వెల్లడవుతున్నది. కానీ ఓబీసీలకు సంబంధించి జాతీయస్థాయి లో డేటా లేదు.
సామాజిక న్యాయ రాజకీయాలు
1970లలో ఆధిపత్య వ్యవసాయ కులాలకు చెందిన నాయకులు రాజకీయాధికారం చేపట్టడం మొదలైంది. సోషలిజం, సామాజిక న్యాయం అనే నినాదాలు విశాల ప్రజానీకాన్ని ముఖ్యంగా నిమ్న కులాలను, దళితులను ఆకర్షించాయి. ముఖ్యంగా ఉత్తరాది న ఈ పరిణామం చోటుచేసుకున్నది లాలూప్రసాద్ యాదవ్, దేవీలాల్, ములాయం సింగ్ యాదవ్, రాంవిలాస్ పాశ్వాన్, శరద్‌పవార్ వంటి ప్రాంతీయ, ఓబీసీ, దళిత నాయకులు ఆవిర్భవించారు. ఫలితంగా జాతీయస్థాయిలో కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యానికి భంగం వాటిల్లింది. సామాజిక న్యాయం నినాదం కేంద్రంగా మొదలైన ఈ రాజకీయాలు దేశ ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠపరిచాయి. అప్పటివరకూ అణచివేతకు గురైన ప్రజానీకానికి సాధికారత కల్పించాయి. మరీ ముఖ్యంగా, ఉత్తరాది రాష్ర్టాల్లో మితవాద రాజకీయాలను (హిందుత్వ రాజకీయాలను) అవి అడ్డుకోగలిగాయి.
1951లో జనసంఘ్ ప్రారంభించిన, ఆ తర్వా తి దశలో బీజేపీ కొనసాగించిన ఈ రాజకీయా లు.. అగ్రకులాల, బూర్జువా వర్గ ప్రయోజనాలకు సంబంధించినవని సామాజిక న్యాయ సమర్థకులు తీవ్రంగా విమర్శించారు. రాజకీయాల్లో దళిత, బహుజనుల బలం పెరుగుతుండటాన్ని సహించలేకే హిందుత్వ రాజకీయాలను తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. అయితే, సామాజిక న్యాయ రాజకీయాలు ఎంతోకాలం నిలబడలేకపోయాయి. బీజేపీ మతతత్వ, జాతీయవాద రాజకీయాలు ఊపందుకున్నాయి. దిగువ కులాలను కలుపుకొని పోకపోతే ఎన్నికల రాజకీయాల్లో విజయం సాధించటం కష్టమని బీజేపీ కూడా కాలక్రమేణా గుర్తించింది. సామాజిక న్యాయ రాజకీయాలు కొన్ని కులాలకే లబ్ధి చేకూర్చాయనే ప్రచారం జరుపుతూ ఇతర ఓబీసీ కులాలను (ఉదాహరణకు యూపీలో, బీహార్‌లో యాదవేతర కులాలను) ఆకర్షించటానికి ప్రయత్నించింది. హిందుత్వ రాజకీయాల కింద నిమ్న కులాలకు కూడా తగిన ప్రాతినిధ్యం కల్పిస్తామ ని, వారి సాధికారతకు చర్యలు తీసుకుంటామ ని ప్రకటించింది.
2014 నుంచి అమల్లో పెట్టిన ఈ వ్యూహం ఫలించింది. వివిధ రాష్ర్టాల అసెంబ్లీల్లో, లోక్‌సభ ఎన్నికల్లో ముఖ్యంగా బీహార్, యూపీ, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో ఆ పార్టీ ఓట్లు, సీట్లు పెరిగాయి. బీజేపీ రాజకీయాల కారణంగా ఓబీసీ వర్గాల మధ్య ఐక్యత తీవ్రంగా దెబ్బతిన్నది. దిగువ ఓబీసీ కులాలు ఎస్పీ, ఆర్జేడీ వంటి పార్టీలను వదిలిపెట్టి బీజేపీ వెంట నడిచారు. ఈ విధంగా బీజేపీ ప్రయోజనం పొందినప్పటికీ, ఆయా ఓబీసీ వర్గాల పరిస్థితుల్లో పెద్దగా మార్పులు వచ్చింది లేదు. అధికారంలో, వ్యాపారంలో, పరిశ్రమల్లో, భూమి తదితర స్థిరాస్తుల్లో వారి ప్రాతినిధ్యం ఇప్పటికీ నామమాత్రమే. వీటన్నింటా అగ్రకులాల పెత్తనమే కొనసాగుతున్నది.
బీసీ రాజకీయాల పునరుద్ధరణ యత్నాలు
కులగణన ద్వారా సామాజిక న్యాయ రాజకీయవేత్తలు ఓబీసీ రాజకీయాలను పునరుద్ధరించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా బీహార్‌లో ఇది ప్రస్తుతం జరుగుతున్నది. ఆర్జేడీ, జేడీయూ పొత్తు ఫలితం గా శక్తిమంతమైన యాదవ, కుర్మి, ముస్లింల కూటమి మరింత బలోపేతమైంది. అయితే, ఇతర బీసీల నుంచి ముఖ్యంగా ఈబీసీల నుం చి మద్దతు సాధించటం ఈ కూటమికి కష్టమే. ఏదేమైనా, బీసీల సమస్యలను లేవనెత్తటం ద్వారా మరోమారు సామాజిక న్యాయ రాజకీయాలను ముందుకు తేవచ్చని, బీజేపీని గట్టిగా ఎదుర్కోవచ్చని వీరు భావిస్తున్నారు.
కులగణన ద్వారా వివిధ రాష్ర్టాల్లో బీసీల సంఖ్య ఎంత ఉన్నదో తెలుస్తుంది. వివిధ సంస్థల్లో, అధికార కేంద్రాల్లో.. ఉదాహరణకు న్యాయవ్యవస్థలో, విద్యాసంస్థల్లో, మీడియా వంటి వాటిల్లో బీసీల ప్రాతినిధ్యం వారి జనాభా ఏ మేరకు ఉన్నదో వెల్లడవుతుంది. ఈ రంగాలపై అగ్రకులాల గుత్తాధిపత్యం కొనసాగుతున్నదనేది తెలిసిన విషయమే. కాబట్టి, కులగణన వల్ల వివిధరంగాల్లో బీసీల సంఖ్యకు తగిన ప్రాతినిధ్యం లేదని స్పష్టమవుతుంది. ఈ గుర్తింపు వల్ల సామాజిక న్యాయం కోసం ఈ వర్గాలలో ఒక కొత్త రాజకీయ చైతన్యం మొగ్గతొడిగి, సామాజిక ఉద్యమానికి నాంది పలికే అవకాశం ఉన్నది. ఈ పరిస్థితే వస్తే బీజేపీ రాజకీయాలు ప్రభావం కోల్పోతాయి. కాబట్టే, బీసీ జనగణన జరపటానికి బీజేపీ నిరాకరిస్తున్నది.
భారత ప్రజాస్వామ్యంలో బీజేపీ హిందుత్వ రాజకీయాలు ఒక మలుపు. గత పదేండ్లలో బీజేపీని సామాజికన్యాయ రాజకీయాలు గట్టిగా ఎదుర్కొన్న ఘటనలు చాలా తక్కువ. బీసీల ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనం మీద నూతన రాజకీయాలను నిర్మిస్తే గనుక సంప్రదాయ రాజకీయాధికార శక్తులకు వ్యతిరేకంగా బీసీలు పెద్ద ఎత్తున సమీకృతమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీనివల్ల సామాజిక న్యాయ రాజకీయాల పునరుద్ధరణ సాధ్యమవుతుందా లేదా అని చెప్పలేం గానీ, ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి బీసీల సమస్యలను తీసుకురావటం అన్నది జరిగే అవకాశం ఉంది.
(వ్యాసకర్త: అధ్యాపకుడు, జేఎన్‌యూ, ఢిల్లీ) (‘ది వైర్’ సౌజన్యంతో..)
-హరీశ్ వాంఖడే