కపాలాలపై కరెన్సీ పేర్చుకునే క్షుద్ర సాహిత్యమో వెలుతురు సోకని శృంగార నవలల చీకటిగుహెూ కాదిది. అక్షరాలగొయ్యి తవ్వుకోవడం.అరచేతిలో అశోకవనాలు సృష్టించే మాయాజాలం అంతకన్నాకాదు. అక్షరమక్షరం అనలమై మండుతున్నప్పుడు సమీకరించి, సైన్యంలా రూపొందించిన కృషిఫలితమే ఈ కవిత్వం. రక్తరేఖలతో నిర్మించిన దృశ్యాలే ఈ కవితా చిత్రాలు.
అలిశెట్టి ప్రభాకర్ తెలుగు కవిత్వంలో పరిచయం అక్కరలేని కవి. తెలుగు సాహితీలోకం మర్చిపోలేని కవి. ‘రాసిలో కన్నావాసి’ గొప్పదన్నట్లుగా ఎంతకాలం బతికాం అన్నది ముఖ్యం కాదు ఎలా బతికాం ఎందరి జ్ఞాపకాల్లో నిలిచిపోయామో ముఖ్యమన్నట్లుగా తన జీవితాన్ని ఉదాహరణ చేసి చూపించిన కవి. 1956 జనవరి 12 న జన్మించిన అలిశెట్టి ప్రభాకర్ జయంతి వర్ధంతి ఒకేరోజు కావడం విశేషం. పదవ తరగతిలోనే కవితలు రాయడం, చిత్రాలు వేయడం అలవాటు చేసుకున్నారు. 18 ఏండ్ల ప్రాయంలోనే తన కవిత్వాన్ని చిన్న పదాలతో గొప్ప అర్థాన్నిచ్చే అలతి పదాలతో అనంత అర్థాలు చెప్పి అనల్పమైన వాక్యాలతో శబ్దశక్తిని, తన చిత్రాలతో మహా ఇతివృత్త శక్తిని అందించాడు.
జగిత్యాల జైత్రయాత్ర సమయంలో దోపిడి చిహ్నలపై ‘మంటల జెండాలు’ ఎగుర వేసి దశ దిశ నిర్దేశిస్తూ పరిష్కారం చూపా రు. దోపిడీదారుల చేతిలో నలిగిపోతున్న మోదుగుపూల వనంలో పద క్షిపణులు పూ యించి యోధులకు అందించాడు. తన చిత్ర కవితలతో సంచలనం సృష్టించి, సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ శిథిల ప్రపంచాన్ని పునఃనిర్మించే ప్రతి విద్యార్థికి అంకితం ఇచ్చాడు. అక్షరాన్ని ఆయుధం చేసి తన కవిత్వాన్ని ప్రాణావాయువుగా మార్చి నింపాలని తపించాడు. అక్షరనేత్రం తెరిచి ఆనాటి ‘దొర’ తనంపై ఆగ్రహించాడు ప్రభాకర్.
సిద్ధాంత గ్రంథాల సారమేది వడబొయ్యకున్నా సిద్దార్థుడు వదిలి వెళ్ళిన ఈ రాజ్యమ్మిది నెత్తుటిధారల్ని కడిగేందుకు కవి త్వం ఆయుధంగా చేసుకున్నాడాయన. ప్రభాకర్ ‘సిటీలైఫ్’లో నగర జీవితాన్ని, నాణేనికి రెండో వైపును అందించి దినపత్రికల శైలినే మార్చి వేసిన సందర్భమది.
అలిశెట్టి కాన్సర్‌తో పోరాడాడు తప్ప కాసు లు వెతుక్కోలేదు. తాను రాసిన కవితలు సినిమాల్లో వాడుకోవడానికి కానీ, సినిమాలకు రాయడం కాని ప్రభాకర్‌కు ఇష్టముండేది కా దు. సినిమా కవిగా మారి ఉంటే ఆర్థిక సమస్యల నుంచి బయట పడవచ్చని తెలిసినా సమాజం కోసం రాస్తానని ప్రకటించారు. విప్లవోద్యమాల సమయంలో జగిత్యాల గడ్డమీద పుట్టిన ప్రభాకర్ కవితాకాశంలో ‘ఎర్రపావురాలు’ ‘మంటలజెండా’ఎగురవేశారు. రక్తరేఖలుగా మళ్ళీ మళ్ళీ ప్రసరించారు. తన కవితా చిత్ర ప్రదర్శనలతో ఈ సమాజాన్ని అంగుళమైనా కదిలించగలననే ఆశతో చివరి శ్వాస వరకు బతికారు అలిశెట్టి ప్రభాకర్. మరణం ఆయన చివరి చరణం కాదు.
– సురేష్ కాలేరు