ఏదైనా జవుడం జరిగితే పంచాయితీ తెంపేతందుకు మా తెలంగాణ పల్లెల్లో ఓ పద్ధతి పాటిస్తరు. జవుడం పెట్టుకున్న ఇద్దరి వద్ద దడువత్గ పైసలు పెట్టిస్తరు. ఇద్దరు చెప్పేది వింటరు. తప్పు తేలినోళ్ల సొమ్ముతో దండుగ కట్టిస్తరు.
బుల్డోజర్లతోని కొంపలు కూ ల్చినంత అల్కగ ప్రజా ప్రభుత్వాలను కూలగొట్టెటోళ్ల తరీక ను లోకం చూసింది. నాగపూర్ బాప తు ఢిల్లీ పెద్ద మనుషుల చిన్నబుద్ధి హైదరాబాద్ గడ్డ మీద అడ్డంగా బైటపడింది. నివద్దెకు ఈ పంచాయితీని సింపుల్గ తెంపవచ్చు. హస్తిన పీఠం సంకలోని సీబీఐ ఆవగింజంత సుత అక్కెరలేదు. దడువత్ ఛాన్సు కూడా అస్సల్లేదు. ఏమున్నా దండుగ కట్టుడే. అది ఎంత అంటే గుజరాత్‌కు పోయిన తాప, మొన్నటి ఎలక్షన్లకు ముందు ఎంత పైకం ఇచ్చిన్రో అంతకు సమానంగా తెలంగాణకు ఇయ్యాలె. మొత్తం దునియా అంతట ఇనవడేటట్టూ చెంపలు ఏసుకోవాలె. ఇంకా జెప్పాల్నంటె మూల కారకులకు, కర్తలకు బేడీలు పడాలె. ఎందుకంటే పూనుకున్న దోకబాజి నేరం గసొంటిది. గీ రకంగ జరుగాల్సినది జరుగకుండా అటు తిరిగి, ఇటు తిరిగి తమ కోసమే పాటుపడే సీబీఐ చేతుల పడెదాక తండ్లాడిన్రు. దీన్నిబట్టి వాళ్ళ నేరం వాళ్ళే పురాగ ఒప్పుకున్నరు. ఖానూన్ ప్రకారం తప్పించుకునెతందుకు గీ తొవ్వన పోతున్నరు. నిజానికి వాళ్ళ ఢిల్లీ సర్కారును నిట్టనిలువున పడగొట్టెతందుకు తెలంగాణ కేసీఆర్ సర్కారు కుట్రలు చేయలె. తన మనుషులను ఢిల్లీకి పంపలె. హైదరాబాద్ నుంచి బ్రోకర్లను తోలలె.
ఒకవేళ అట్ల జేసుంటే వాళ్ళ సీబీఐని దింపితె కరెక్టు. ఓర్నీ! మరి గిదేంది. ఢిల్లీకెల్లి హైదరాబాద్‌కు దింపింది వాళ్లే కాబట్టి హైదరాబాద్ పోలీసులు ఎంక్వయిరీ చేయాలె కదా. వద్దు వద్దు అనుకుంట కోర్టుకు పోయిన్రు. నియ్యత్ ఉండి ఉంటె, కుట్రలు చేయకుంటె విచారణ ఎవరు చేస్తే ఏందని చౌరస్తా మీద దర్జాగా ఉండాలె కదా. హైదరాబాద్ పోలీసుల దర్యాప్తునకు సహకారం చేయాలె కదా. కుట్ర చేసి చిక్కింది వాస్తవం అయినందున వణికిపోయిన్రు. అగం అయిన్రు. ప్రజలల్ల పలుచనై కూడా మేకపోతు గాం భీర్యం కోసం తెగ ఆరాటపడుతున్నరు. తాము కోరుకున్నట్టుగా సీబీఐ చేతిల కేసు పడంగనె ఇగ మా తెరువు వచ్చినోల్ల సంగతి చూస్తమంటూ అపుడే బెదిరింపులు, అదిరింపులు పలుకుతున్నరు. తప్పుచేసింది మీరు. నిలువునా ప్రజా కోర్టులో బుక్ అయింది మీరే. దీన్ని ఎట్లా బుకాయించగలరు. ముమ్మాటికీ ముక్కు నేలకు రాయాలి కదా. ఇదంతా కాదని మసిపూసి మారేడు కాయ చేస్తరా.
ఇక్కడ ఒకటి చెప్పుకోవాలె. కేసీఆర్ రివాజు అనే గ్రంథంల ప్రజా ప్రభుత్వాలను కూలగొట్టేదానికి చోటే ఉండదు. పబ్లిక్కు సేవ చేయాలె. వారి ఆశీర్వా దం పొందాలె అనేది కేసీఆర్ పంథా. తెలంగాణ జనంల మమేకం అయిన కేసీఆర్ దేశం మొత్తం ఏకం చేసే పనిల నిమగ్నమయ్యారు. కేసీఆర్ మాటా, చేతా, చేసే మేలు తెలంగాణ అనుభవంలో ఉన్నది. ఇసొంటి ప్రయోజనం దేశమంతటా దక్కెతందుకు వేసిన అడుగుల కాళ్ళు కట్టేసుడు మీ తరం కాదు. హైదరాబాద్ పోలీసులు వద్దనడం మీకు వాజీవె అనిపిస్తే, సీబీఐ వద్దని బల్ల గుద్దడం మాకు డబుల్ వాజీవు. ఈడ ఇంకోటి జ్ఞాపకం చేసుకోవాలె. సీబీఐ, ఈడీ, ఐటీ అసొంటియి మీ కీసల్నే ఉంటె ఉండొచ్చు. కానీ అన్నింటికంటే, అందరికంటే పవర్ఫుల్ పబ్లిక్ కేసీఆర్‌తోనే ఉన్నరు. తెలంగాణ గడ్డ మీద మళ్ళోతాప పవర్ ఫుల్ తీర్పు ఇస్తరు. దాంట్ల డౌటేం లేదు. దేశంల కేసీఆర్, బీఆర్ఎస్ వెంట నడిచెతందుకు జనం నడుం కట్టిన్రు. ఇరుగు పొరుగు రాష్ర్టాల రాజకీయ నేతలు, పూర్వ బ్యూరోక్రాట్లు, మేధావులు, యువత జై బీఆర్ఎస్ అంటుండటం కేసీఆర్ సామర్థ్యం, దార్శనికతలకు చిహ్నం. ఢిల్లీ ప్రభువుల్లారా జ్ఞానేంద్రియాలను యాక్టివేట్ చేసుకుంటే వర్తమాన, సమీప భవిష్యత్తులు మీకే తెలుస్తయి.
(వ్యాసకర్త : ఇల్లెందుల దుర్గాప్రసాద్ , 94408 50384, ఇండిపెండెంట్ జర్నలిస్ట్)